అమరావతి పేరుతో అరచేతిలో వైకుంఠం...
విజయవాడ(గాంధీనగర్): రాజధాని అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. విజయవాడ లెనిన్ సెంటర్‌లో భారతీయ ఖేత్‌మజ్దూర్ యూనియన్(బీకేఎంయూ) జాతీయ మహాసభ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామీణ పేదలు సత్యాగ్రహం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకీ రైతు ఆత్మహత్యలు, వలసలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వలసలు, ఆత్మహత్యలపై మాట్లాడే తీరిక లేదని మండిపడ్డారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబును కోరారు.
భూ బ్యాంక్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీకేఎంయూ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేంద్రనాథ్ ఓఝా మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలు 200 రోజులకు పెంచి రూ. 300 రోజువారీ కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సత్యాగ్రహంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్, అధ్యక్షుడు ఆవుల శేఖర్, సీపీఐ జిల్లా, నగర కార్యదర్శులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.