అనంతపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలో లేక ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వ భాగస్వామ్యం కావాలో తేల్చుకోవాలని సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. సీఎం తన నిర్ణయాన్ని ఈ నెల 17లోగా ప్రకటించాలన్నారు. అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సోమవారం అనంతపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నా ప్రధాని కానీ, సీఎం చంద్రబాబు కానీ నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు.
ఈ నెల 17న ప్రధానిని కలిసేందుకు సీఎం ఢిల్లీ వెళ్తున్నారని, ప్రత్యేక హోదాపై సానుకూల స్పందన రాకపోతే ప్రజలను సమీకరించి ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ రెండేళ్లలో 30 సార్లు ప్రధానిని కలిసిన చంద్రబాబు ఎన్నికోట్లు తెచ్చారని ప్రశ్నించారు. పోలవరం, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకు రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం, రాష్ట్రానికి రూ. 24 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఏమయ్యాయని నిలదీశారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలు ఎలా వాడుకోవాలో చట్టాలున్నాయని గుర్తు చేశారు.