'వారిపై కిరోసిన్ పోసి అంటించండి'
ఒంగోలు : ‘ప్రత్యేక హోదా కోసం ప్రజలెవరూ బలిదానాలు చేసుకోవద్దు. గత ఎన్నికల సమయంలో తమను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ అధికారంలోకి వచ్చిన వారిపైన కి రోసిన్ పోసి అగ్గిపుల్ల గీయండి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర మంగళవారం ఒంగోలు చేరుకుంది. సాయంత్రం స్థానిక అద్దంకి బస్టాండు సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో రాష్ట్రంలోని టీడీపీ, కేంద్రంలోని బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే ప్రధానమంత్రికి వాస్తవాలు చెప్పి ఒప్పించాలని లేకుంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలని హితవు పలికారు. రాష్ట్ర రాజధాని శంకుస్థాపనకు హాజరవుతున్న ప్రధానమంత్రి ఆ రోజు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకుంటే మరుసటి రోజు అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆయన దిష్టిబొమ్మలు దహనం చేస్తామని రామకృష్ణ చెప్పారు.
22న ప్రధానితో అఖిలపక్ష నేతల భేటీ ఏర్పాటు చేయండి!
నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఈనెల 22న రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అఖిల పక్ష నేతలు కలిసేందుకు వెసులుబాటు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కమిటీ.. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యద్శి కె.రామకృష్ణ మంగళవారం చంద్రబాబుకు లేఖ రాశారు. అఖిల పక్ష బృందానికి ముఖ్యమంత్రే నాయకత్వం వహించాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే వ్యవహారంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరడం ఆక్షేపణీయమేమీ కాదన్నారు.