హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీల మెరుగుపడితేనే రాష్ట్రాభివృద్ది జరిగినట్లని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగిస్తున్న పాలన, అనుసరిస్తున్న విధానాలు ఇందుకు అనుగుణంగా లేవన్నారు. రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్న, కోరుకున్న పాలన సాగడం లేదన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి అనేది ఎలా జరగాలి, వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అణగారిన వర్గాల అభివృద్ధి ఏ విధంగా జరగాలన్న దానిని వివరిస్తూ ఈ నెల 17నుంచి పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో 'సామాజిక న్యాయం-రాష్ట్ర సమగ్రాభివృద్ధి'పై మహా జనపాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 'ఎడిటర్స్ మీట్' సమావేశంలో మాట్లాడుతూ పాదయాత్రలో భాగంగా తాము ప్రచారం చేయదలుచుకున్న 38అంశాలతో కూడిన ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ముసాయిదాను తమ్మినేని విడుదల చేశారు. ఈ విధానాలు అమలుకు నిరంతర కృషి జరిగేలా ప్రభుత్వంపై ప్రజల నుంచి ఒత్తిడి పెంచేందుకు, రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ అజెండా నుంచి దృష్టి మళ్లించకుండా చేసేందుకు కృషి చేయాల్సివుందన్నారు.
పాదయాత్రలో ఈ నమూనాపై వివిధ వర్గాల ప్రజలు, సంస్థల నుంచి వచ్చే సలహాలు, సూచనలను క్రోడీకరించి తుది డాక్యుమెంట్‌ను రూపొందిస్తామని చెప్పారు. సమగ్ర, సామాజిక తెలంగాణ కోసం నూతన ఆలోచనలు, ప్రత్యామ్నాయ విధానాల అవసరం ఉందన్నారు. అటువంటి ఆలోచనలు, విధానాలతో ఉమ్మడి రాజకీయ వేదిక ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. పాదయాత్ర టీఆర్‌ఎస్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్నది కాదని తమ్మినేని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాల్లో లోపం ఏమిటీ, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ఏమిటన్నది వివరిస్తామన్నారు.
సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి
ఒకేసారి అనేక అంశాలు తీసుకోవడం కంటే ముఖ్యమైన అంశాలను ఎంచుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటే బావుంటుందని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి సూచించారు. ప్రభుత్వం పొరబాట్లు చేస్తోందంటే వాటిని ఎలా అధిగమించాలి, ప్రత్యామ్నాయ మార్గాలేమిటో చెప్పగలగాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీపీఎం క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి క్రియాశీలంగా పనిచేస్తున్న టీజేఏసీ, కోదండరాం,ఇతర శక్తులు, వర్గాలను కలుపుకుపోవాలని సూచించారు. పాత్రికేయులు కె.శ్రీనివాసరెడ్డి (మనతెలంగాణ ), ఎస్.వీరయ్య (నవతెలంగాణ),శ్రీధర్‌బాబు (టీవీ 10),హాష్మి (సియాసత్), సాయి (జెమిని), కప్పర ప్రసాద్ (హెచ్‌ఎంటీవీ) తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణలో పాలన సాగడంలేదు-తమ్మినేని
Published Sun, Oct 9 2016 7:23 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
Advertisement
Advertisement