టీడీపీ నాయకులకే ‘ఉపాధి’
గుంతకల్లు రూరల్ : కరువు సమయంలో సామాన్యులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లకు ఉపాధిగా మారిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ మండిపడ్డారు. జిల్లాలో కరువు రక్కసి రాజ్యమేలుతున్న నేపథ్యంలో ప్రజలు స్థితిగతులు, వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు సీపీఎం రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ ఓబులు, స్థానిక సీపీఎం నాయకులతో కలిసి శనివారం ఆయన మండలంలోని నక్కనదొడ్డిలో పర్యటించారు. గ్రామంలో ప్రజల సమస్యలు, ఉపాధి పథకం నిర్వహణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ గోడు వారితో వెళ్లబోసుకున్నారు.
వర్షాభావం కారణంగా మూడేళ్లుగా తీవ్రమైన పంటనష్టం ఏర్పడి అప్పులపాలయ్యామని, ప్రభుత్వం గుంతకల్లును కరువు మండలంగా ప్రకటించినా రైతులను మాత్రం ఆదుకోలేదని వాపోయారు. కరువు సమయంలో ఉపాధి పనులకు వెళ్తే నెలల తరబడి కూలి రాక కుటుంబాలు గడవక గ్రామంలో చాలామంది వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి నాలుగు నెలల క్రితం బోరు వేసిన అధికారులు ఇంతవరకూ ఆ బోరునుంచి చుక్కనీటిని పంపిణీ చేయకపోవడంతో నీటికి నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు గఫూర్, ఓబులు మాట్లాడుతూ ఉపాధి నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించడం వల్లే ఉపాధి కూలీలు బకాయిలు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా టూర్లు తిరిగితే ఆయన కుమారుడు లోకేష్ ఢిల్లీ టూర్లు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని లేని పక్షంలో గుత్తి–గుంతకల్లు జాతీయ రహదారిని దిగ్భందిస్తామని హెచ్చరించారు. అనంతరం వారు ఉరవకొండ మండలం బూదగవిలో ఆయన పర్యటించారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి డి.శ్రీనివాసులు, సీఐటీయు జిల్లా కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, సీపీఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, మారుతీ ప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐజిల్లా ఉపాధ్యక్షుడు అబ్దూల్ బాషిద్, ఇతర నాయకులు వారి వెంటున్నారు.