ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వానికి సంతల్లో సరుకుల్లాగా ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని సీపీఎం రాష్ట్ర నాయకులు ఓబులు విమర్శించారు. స్థానిక మునిసిపల్ కార్యాలయం ఎదుట గురువారం అక్టోబర్ విప్లవ శత వార్షికోత్సవ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర నాయకులు ఓబులు, రచయిత సింగమనేని నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు మరో పార్టీకి సంతల్లో సరుకుల్లా అమ్ముడుపోయారన్నారు. విప్లవాలకు పునాది సమాజంలో వచ్చే అసమానతలే కారణమన్నారు.
పేదవారికి, ధనికులకు మధ్య జరిగిన సంఘర్షణే సమాజంలో మార్పునకు ప్రధాన కారణమన్నారు. చంద్రబాబుకు నోట్ల రద్దు విషయం ముందే తెలుసని అందుకే గత నెల రోజుల నుంచి దానిపై పాట పాడుతున్నాడన్నారు. నల్లధనం కలిగిన వారెవరు లైన్‌లో నిలబడి లేరని సామాన్య ప్రజలు అనేక ఇబ్బంధులు పడుతున్నారన్నారు. సమాజంలో 86 శాతం 1000, 500 నోట్లు ఉన్నాయన్నారు. కేవలం 14 శాతం మాత్రమే ఉన్న 100 నోట్లు ఏవిధంగా సరిపోతాయన్నారు. స్విస్ బ్యాంకులో దాచిన నల్లధనాన్ని తేవడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రమ్మ, 49వ డివిజన్ కార్పోరేటర్ భూలక్ష్మీ, సీపీఎం నాయకులు రామిరెడ్డి, నాగరాజు, గోపాల్, బాబా, రంజిత్, ముర్తజా, ఐద్వా నాయకురాలు లక్ష్మీదేవి, చంద్రిక పాల్గొన్నారు.