రూ.5 వేల కోట్లివ్వాలి
-కరువు నివారణకు రైతుసంఘం డిమాండ్
– కలెక్టరేట్ ఎదుట ధర్నా
– రాగి గంజి తాగి నిరసన
అనంతపురం అర్బన్ : జిల్లాలో కరువు నివారణకు తక్షణమే రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం (సీపీఎం అనుబంధం) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నాయకులు రాగి గంజి తాగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ జిల్లాలో వరుస కరువులతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. 63 మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం.. సహాయక చర్యలు చేపట్టడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. ఉపాధి కరువై లక్షలాది మంది రైతులు, కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నా.. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు.
ఖరీఫ్‌లో పంట నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.19,500 పరిహారం ఇవ్వాలని, వేరుశనగకు ఫసల్ బీమా వర్తింపజేయాలని, పాడి రైతులను ఆదుకునేందుకు పాల ధరలు పెంచాలని డిమాండ్ చేశారు. కరువు దృష్ట్యా లీటరుపై రూ.5 ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. పంట రుణాలు రీషెడ్యూల్ చేసి.. 4 శాతం వడ్డీతో కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు నిబంధనలతో పని లేకుండా రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. ప్రతి రైతుకు నెలకు రూ.5 వేల పింఛన్ చెల్లించాలన్నారు. కార్యక్రమలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తరిమెల నాగరాజు, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు నాగేశ్, పెద్దన్న, వినోద్, శ్రీనివాసులు, జయచంద్రారెడ్డి, రామాంజినేయులు, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.