రామకృష్ణ, మధు, పవన్‌కల్యాణ్
సాక్షి, అనంతపురం: సీపీఐ, సీపీఎం, జనసేనతో కలిసి సరికొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఆయన శనివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ, ఉత్తరాంధ్ర సమస్యలపై ఈ త్రయం పోరాటం చేస్తుందని ప్రకటించారు. ఇందుకు సంబంధించి తొలిసభను అనంతపురంలోనే ఏర్పాటు చేస్తామన్నారు. తమతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిసి వస్తే ఆహ్వానిస్తామన్నారు. కడప జిల్లాలో తొలిసారిగా ఏప్రిల్ 6,7 తేదీల్లో సీపీఐ 26వ మహా సభలు నిర్వహించున్నట్టు వెల్లడించారు.
మరో వైపు ప్రత్యేక హోదా విషయంలో మోదీ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని, అవిశ్వాసంపై చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీలో అంతర్గతంగా మోదీపై వ్యతిరేకత ఉండటం వల్లే ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. ఏప్రిల్ 5న పార్లమెంట్ చివరి రోజు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే బ్లాక్ డే పాటిస్తామన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజు సాయంత్రం లైట్స్ ఆపేసి చీకటి దినంగా పాటిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment