
సాక్షి, అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో ఇన్నిసార్లు మాట మార్చిన వారు.. ఇంతకాలం మాటమీద నిలబడని వారు రేపొద్దునైనా న్యాయం చేస్తారన్న నమ్మకం తమకు లేదని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా సాధన, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, రామకృష్ణలు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం మూడు పార్టీల నేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా సాధనకు సీపీఎం, సీపీఐ, జనసేనలు ఐక్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు వారు సంతకాలు చేసిన పత్రికా ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. ‘ప్రత్యేక హోదా అవసరంలేదు. అదేమన్నా దిగివచ్చిందా అని టీడీపీ నేతలే మాట్లాడారు. వాళ్లే ఈ రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు’.. అని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా కేంద్రంతో టీడీపీ రాజీ ధోరణితో వ్యవహరించిన కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని.. రాష్ట్ర ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లలేదని టీడీపీ వైఖరిని తూర్పారబట్టారు.అమరావతి రాజధాని కేవలం కొద్దిమంది ప్రయోజనాలకు ఉద్దేశించిందే తప్ప రాష్ట్ర ప్రజలందరి రాజధాని కాదని పవన్‌కల్యాణ్ విమర్శించారు.