obulu
-
టీడీపీ నాయకులకే ‘ఉపాధి’
గుంతకల్లు రూరల్ : కరువు సమయంలో సామాన్యులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లకు ఉపాధిగా మారిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ మండిపడ్డారు. జిల్లాలో కరువు రక్కసి రాజ్యమేలుతున్న నేపథ్యంలో ప్రజలు స్థితిగతులు, వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు సీపీఎం రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ ఓబులు, స్థానిక సీపీఎం నాయకులతో కలిసి శనివారం ఆయన మండలంలోని నక్కనదొడ్డిలో పర్యటించారు. గ్రామంలో ప్రజల సమస్యలు, ఉపాధి పథకం నిర్వహణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ గోడు వారితో వెళ్లబోసుకున్నారు. వర్షాభావం కారణంగా మూడేళ్లుగా తీవ్రమైన పంటనష్టం ఏర్పడి అప్పులపాలయ్యామని, ప్రభుత్వం గుంతకల్లును కరువు మండలంగా ప్రకటించినా రైతులను మాత్రం ఆదుకోలేదని వాపోయారు. కరువు సమయంలో ఉపాధి పనులకు వెళ్తే నెలల తరబడి కూలి రాక కుటుంబాలు గడవక గ్రామంలో చాలామంది వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి నాలుగు నెలల క్రితం బోరు వేసిన అధికారులు ఇంతవరకూ ఆ బోరునుంచి చుక్కనీటిని పంపిణీ చేయకపోవడంతో నీటికి నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు గఫూర్, ఓబులు మాట్లాడుతూ ఉపాధి నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించడం వల్లే ఉపాధి కూలీలు బకాయిలు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా టూర్లు తిరిగితే ఆయన కుమారుడు లోకేష్ ఢిల్లీ టూర్లు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని లేని పక్షంలో గుత్తి–గుంతకల్లు జాతీయ రహదారిని దిగ్భందిస్తామని హెచ్చరించారు. అనంతరం వారు ఉరవకొండ మండలం బూదగవిలో ఆయన పర్యటించారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి డి.శ్రీనివాసులు, సీఐటీయు జిల్లా కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, సీపీఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, మారుతీ ప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐజిల్లా ఉపాధ్యక్షుడు అబ్దూల్ బాషిద్, ఇతర నాయకులు వారి వెంటున్నారు. -
ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వానికి సంతల్లో సరుకుల్లాగా ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని సీపీఎం రాష్ట్ర నాయకులు ఓబులు విమర్శించారు. స్థానిక మునిసిపల్ కార్యాలయం ఎదుట గురువారం అక్టోబర్ విప్లవ శత వార్షికోత్సవ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర నాయకులు ఓబులు, రచయిత సింగమనేని నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు మరో పార్టీకి సంతల్లో సరుకుల్లా అమ్ముడుపోయారన్నారు. విప్లవాలకు పునాది సమాజంలో వచ్చే అసమానతలే కారణమన్నారు. పేదవారికి, ధనికులకు మధ్య జరిగిన సంఘర్షణే సమాజంలో మార్పునకు ప్రధాన కారణమన్నారు. చంద్రబాబుకు నోట్ల రద్దు విషయం ముందే తెలుసని అందుకే గత నెల రోజుల నుంచి దానిపై పాట పాడుతున్నాడన్నారు. నల్లధనం కలిగిన వారెవరు లైన్లో నిలబడి లేరని సామాన్య ప్రజలు అనేక ఇబ్బంధులు పడుతున్నారన్నారు. సమాజంలో 86 శాతం 1000, 500 నోట్లు ఉన్నాయన్నారు. కేవలం 14 శాతం మాత్రమే ఉన్న 100 నోట్లు ఏవిధంగా సరిపోతాయన్నారు. స్విస్ బ్యాంకులో దాచిన నల్లధనాన్ని తేవడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రమ్మ, 49వ డివిజన్ కార్పోరేటర్ భూలక్ష్మీ, సీపీఎం నాయకులు రామిరెడ్డి, నాగరాజు, గోపాల్, బాబా, రంజిత్, ముర్తజా, ఐద్వా నాయకురాలు లక్ష్మీదేవి, చంద్రిక పాల్గొన్నారు. -
కళ్లున్నకబోదిలా ప్రభుత్వాలు
హిందూపురం టౌన్ : ప్రభుత్వాలు, అధికారులు కార్మికులపై కళ్లుండి కబోదిలా వ్యవహరిస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు రామకష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. పరిగి మండలంలో ఉన్న ఎస్ఏ రావ్‌తార్ పరిశ్రమలో అన్యాయంగా 193 మంది కార్మికులను తొలగించి 15 నెలలు గడిచినా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. చట్టం ప్రకారం కనీస వేతనాలు పెంచాలని yì మాండ్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీనిపై వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతు, యువజన సంఘాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, వైఎస్సార్‌టీయూ ఆధ్వర్యంలో ఎస్ఏ రావ్‌తార్ కార్మిక సంఘీభావ కమిటీగా ఏర్పడి బుధవారం నుంచి పాదయాత్ర చేపట్టామన్నారు. హిందూపురంలో ప్రారంభమై అనంత కలెక్టరేట్ వరకు యాత్ర సాగుతుందన్నారు. దీంతో పాటు 16న కదిరి, 17న గుంతకల్లు, 18న తాడిపత్రిలో పాదయాత్రలు ప్రారంభమవుతాయని చెప్పారు. సమావేశంలో సీఐటీ యూ డివిజన్ కార్యదర్శి జెడ్పీ శ్రీనివాసులు, నాయకులు రాజప్ప, నారాయణస్వామి, లింగారెడ్డి, పురుషోత్తం, రాము, వినోద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రజలను మోసగించారు
హిందూపురం టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన సమయంలో ఓమాట, నేడు మరో మాట మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలను వంచించారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన సీపీఎం డివిజన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, సీపీఐ నాయకులు సురేష్‌బాబు, దాదాపీర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. విభజన సమయంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని బిల్లులు ఉంచక మోసం చేసిందన్నారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాలతో కలిసి ఉద్యమాలు చేయాలన్నారు. చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంటే భయం ఉండడంతోనే మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, రాయితీలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆగస్టు 2న సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌కు అందరూ సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం నాయకులు రాము, సీపీఐ నాయకులు శ్రీనివాసరెడ్డి, ఇబ్రహీం, మాబు పాల్గొన్నారు.