క్రికెట్ విజేత ఆర్డీటీ అనంత జట్టు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : వైఎస్సార్ జిల్లా నందలూరులో జరుగుతున్న పీఎంసీఎం సౌత్‌జోన్ ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీ విజేతగా ఆర్డీటీ అనంత జట్టు నిలిచింది. బుధవారం జరిగిన రెండవ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్డీటీ అనంతపురం, గూడూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అనంత జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 212 పరుగులు చేసి ఆలౌటైంది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గూడూరు జట్టు 23 ఓవర్లలోనే 104 పరుగులకే కుప్పకూలింది. అనంత బౌలర్లలో ముదస్సిర్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు సాధించాడు. జట్టు విజయానికి కీలకంగా మారిన ముదస్సిర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఆర్డీటీ అనంతపురం జట్టు విజయకేతనం ఎగరేయడంతో జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాంఛో ఫెర్రర్, షాహబుద్దీన్‌లు హర్షం వ్యక్తం చేశారు. నేడు నామమాత్రపు మూడో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.