పరుగుల వర్షం
– సెంచరీలతో కదంతొక్కిన న్యూజిలాండ్
– 84 పరుగుల తేడాతో ఓడిన ఆర్డీటీ జట్టు
- నేడు వన్‌డే మ్యాచ్
అనంతపురం న్యూసిటీ: అనంత క్రీడాగ్రామంలోని క్రికెట్ స్టేడియంలో శనివారం పరుగుల వర్షం కురిసింది. న్యూజిలాండ్‌కు చెందిన హాట్‌హాక్స్ జట్టు బ్యాట్స్‌మన్స్ టామ్‌బ్లండల్, మారడాక్ చెలరేగి ఆడి సెంచరీలు కొట్టి తమ జట్టు విజయంలో కీలకంగా మారారు. ఆర్డీటీ జట్టుతో రెండ్రోజులుగా సాగుతున్న సన్నాహాక క్రికెట్‌మ్యాచ్‌ల్లో శనివారం టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. జట్టులోని అంతర్జాతీయ క్రీడాకారుడు టామ్ బ్లండర్ 97 బంతుల్లో మూడు సిక్సర్లు, 11 బౌండరీలతో 125 పరుగులు సాధించారు.
మరో బ్యాట్స్‌మెన్ మారడాక్ 127 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు బౌండరీలతో 106 పరుగులు సాధించారు. ఆర్డీటీ బౌలర్లలో మస్తాన్‌ఖాన్ ఐదు వికెట్లు తీశారు. 332 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్డీటీ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 248 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో వినీల్‌కుమార్ 53, గిరినాథ్‌రెడ్డి 52 పరుగులు సాధించారు. న్యూజిలాండ్ బౌలర్లతో హెడెన్‌స్మిత్ మూడు వికెట్లు తీశారు. కాగా, ఆదివారం ఈ రెండు జట్ల మధ్య వన్డే పోటీ జరగనుంది.