‘అనంత’కు చేరిన న్యూజిలాండ్ జట్టు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : న్యూజిలాండ్ జూనియర్స్ క్రికెట్ జట్టు అనంతకు చేరుకుంది. శనివారం నుంచి అనంత వేదికగా అనంతపురం, న్యూజిలాండ్ జట్ల మధ్య సన్నాహక క్రికెట్ పోటీలు జరగనున్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన క్రికెట్ హాక్స్ క్లబ్, అనంతపురం జట్లు పోటీల్లో తలపడనున్నాయి. ఈ పోటీలు నేటి నుంచి 13 వరకు సాగనున్నాయి. అనంతపురం క్రీడాకారులతో స్నేహబంధం పెరిగేందుకు ఈ టోర్నీ తోడ్పడుతుందని న్యూజిలాండ్ జూనియర్స్ జట్టు కెప్టెన్ ఫ్రేజర్ మెక్ హాల్ తెలిపారు. శుక్రవారం స్థానిక అనంత క్రీడా గ్రామంలో అనంతపురం జట్టు కెప్టెన్ వినీల్‌కుమార్, న్యూజిలాండ్ జట్టు మరో కెప్టెన్ జోష్ మెక్ ఆడ్లెతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురంలో నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ దేశంలో ఇండోర్ స్టేడియంలోనే క్రికెట్ పోటీలను నిర్వహిస్తారన్నారు. ఈ టోర్నీ ముగిసిన తరువాత కూడా తమ బంధాన్ని కొనసాగించేందుకు సహకరిస్తామన్నారు. ఈ క్రికెట్ సీజన్‌లోనే అనంత జట్టును తమ దేశంలో క్రికెట్ పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు జట్టు కోచ్ రవి తెలిపారు. రాబోయే సీనియర్ జట్టులో న్యూజిలాండ్ ఆటగాళ్లు టామ్ బ్లాండర్, ఉడ్‌కుక్, రచిన్ రవీంద్ర (అండర్ 19 జట్టు కెప్టెన్)లు పాల్గొంటారన్నారు. ఆర్డీటీ హెడ్ కోచ్ షాహబుద్దీన్ మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం దొరికిందన్నారు. అంతర్జాతీయ క్రికెట్ జట్లను జిల్లాకు రíప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, న్యూజిలాండ్ కోచ్ నీరజ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.