cricket winner
-
క్రికెట్ విజేత ఆర్డీటీ అనంత జట్టు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : వైఎస్సార్ జిల్లా నందలూరులో జరుగుతున్న పీఎంసీఎం సౌత్‌జోన్ ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీ విజేతగా ఆర్డీటీ అనంత జట్టు నిలిచింది. బుధవారం జరిగిన రెండవ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్డీటీ అనంతపురం, గూడూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అనంత జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 212 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గూడూరు జట్టు 23 ఓవర్లలోనే 104 పరుగులకే కుప్పకూలింది. అనంత బౌలర్లలో ముదస్సిర్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు సాధించాడు. జట్టు విజయానికి కీలకంగా మారిన ముదస్సిర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఆర్డీటీ అనంతపురం జట్టు విజయకేతనం ఎగరేయడంతో జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాంఛో ఫెర్రర్, షాహబుద్దీన్లు హర్షం వ్యక్తం చేశారు. నేడు నామమాత్రపు మూడో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. -
జిల్లా స్థాయి క్రికెట్ విజేత గుంతకల్లు
ఉరవకొండ : స్థానిక మహాత్మ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంటర్ క్రికెట్ పోటీల్లో భాగంగా బుధవారం గుంతకల్లు, ఉరవకొండ మహత్మ కళాశాల జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. జిల్లావ్యాప్తంగా 10 జట్లు పాల్గొన్న ఈ టోర్నిలో విజేతగా గుంతకల్లు నిలిచింది. ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఉరవకొండ మహాత్మ జట్టు నిర్ణీత 15 ఓవర్లకు 94 పరుగులు చేసింది. ఈ మేరకు బ్యాటింగ్‌కు దిగిన గుంతకల్లు జట్టు 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదిచింది. ఈ సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవ వేడుకల్లో గవిమఠం ఉత్తరాధికారి శ్రీకరిబసవరాజేంద్ర స్వామి హాజరై మాట్లాడారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించినపుడే, భవిష్యత్‌లో క్రీడలతో పాటు జీవితంలో కూడా రాణిస్తారని చెప్పారు. కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు కెకె ప్రసాద్, మహాత్మ విద్యాసంస్థల గౌరవ సలహదారులు షాషావలి, డైరెక్టర్ గౌస్‌మోదీన్, ప్రిన్సిపాళ్లు బసవరాజు, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
అండర్–14 క్రికెట్ రన్నరప్ అనంత
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–14 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో అనంతపురం బాలుర జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజయనగరంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అనంత, విశాఖ జిల్లాల మద్య ఫైనల్ పోరు కొనసాగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన విశాఖ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసింది. అనంతపురం జట్టులో నీరజ్ 5, ప్రశాంత్ 2, ఆనంద్ 1 వికెట్లను పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంత జట్టు 205 పరుగులు చేసి ఆలౌటైంది. అనంత జట్టులో కెప్టెన్ దత్తారెడ్డి 87, శ్రీయాస్ 18, ప్రశాంత్ 16 పరుగులు మాత్రమే చేశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన విశాఖ జట్టు 109 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. దీంతో రెండోరోజు ఆట ముగిసే సమయానికి విశాఖ జట్టు ఇన్నింగ్స్ ఆధిక్యతతో విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో అనంత జట్టు హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యాయి. రాష్ట్ర ప్రాబబుల్స్‌కు ‘అనంత’ క్రీడాకారులు టోర్నీ ప్రారంభం నుంచి ‘అనంత’ జట్టు మంచి ఫలితాలను సాధిస్తూ వచ్చింది. ఫైనల్ మ్యాచ్‌లో ఓడినా మన జిల్లా క్రీడాకారులు దత్తారెడ్డి, అర్జున్ టెండూల్కర్, శ్రీయాస్, కామిల్, రూపేష్, ప్రశాంత్‌రెడ్డి, మీరజ్‌కుమార్, ఆనంద్‌లు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించగలిగారు. వీరు ఈ నెల 18 నుంచి 24 వరకు విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి ప్రాబబుల్స్ మ్యాచుల్లో పాల్గొంటారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రాబబుల్స్‌కు ఎంపిక కావడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, ప్రసన్న హర్షం వ్యక్తం చేశారు.