జిల్లా స్థాయి క్రికెట్ విజేత గుంతకల్లు
ఉరవకొండ : స్థానిక మహాత్మ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంటర్ క్రికెట్ పోటీల్లో భాగంగా బుధవారం గుంతకల్లు, ఉరవకొండ మహత్మ కళాశాల జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. జిల్లావ్యాప్తంగా 10 జట్లు పాల్గొన్న ఈ టోర్నిలో విజేతగా గుంతకల్లు నిలిచింది. ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఉరవకొండ మహాత్మ జట్టు నిర్ణీత 15 ఓవర్లకు 94 పరుగులు చేసింది. ఈ మేరకు బ్యాటింగ్‌కు దిగిన గుంతకల్లు జట్టు 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదిచింది.
ఈ సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవ వేడుకల్లో గవిమఠం ఉత్తరాధికారి శ్రీకరిబసవరాజేంద్ర స్వామి హాజరై మాట్లాడారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించినపుడే, భవిష్యత్‌లో క్రీడలతో పాటు జీవితంలో కూడా రాణిస్తారని చెప్పారు. కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు కెకె ప్రసాద్, మహాత్మ విద్యాసంస్థల గౌరవ సలహదారులు షాషావలి, డైరెక్టర్ గౌస్‌మోదీన్, ప్రిన్సిపాళ్లు బసవరాజు, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.