రీ డిజైన్ల పేరుతో రూ.కోట్ల లూటీ..!
మల్లు భట్టి విక్రమార్క
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో రూ.వేల కోట్లు లూటీ చేస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఇప్పటికే నీరుగార్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగం గా మంగళవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీతారామ, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులు రూ.475 కోట్లకు బదులు రీడిజైన్ చేసి అంచనా వ్యయాన్ని రూ.8 వేల కోట్లకు పెంచారని విమర్శించారు.
ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రభుత్వం లక్షా 50 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తోందన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును ఎవరి కోసం చేప ట్టారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దీన్ని ఇతర రాష్ట్రాల సీఎంలు, నీతి ఆయోగ్ సభ్యులు, ప్రధాని మోదీ అభినంది స్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని, కానీ, పథకంలో భారీ అవి నీతి చోటుచేసుకుందని, అవినీతి మరక నుంచి కేటీఆర్‌ను తప్పించాలనే ఉద్దేశంతో సీఎం ఆ శాఖను మార్చారని ఆరోపించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ పూర్తిగా చట్టవిరుద్ధమని, జీవో నంబర్ 123ను రద్దు చేసే వరకూ సర్కార్‌పై కాంగ్రెస్ యుద్ధం చేస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయశాఖలో ట్రాక్టర్లు, ఇతర అనుబంధ పరికరాల సబ్సిడీ విషయంలో కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని, దీనిపై జ్యుడీషియల్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.