గుడిని, గుడిలో లింగాన్ని మింగేస్తున్న కేసీఆర్: భట్టి
సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టండి: కుంతియా
హైదరాబాద్: తెలంగాణ ప్రజల సమస్యలపై దృష్టిపెట్టకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేల ఫిరాయింపులను నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నాడని టీపీసీసీ అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ శివార్లలో సోమవారం జరిగిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌పార్టీనేతల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ రామచంద్ర కుంతియా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు కరువు, వడగండ్లవానతో తీవ్రంగా నష్టపోయారని, రాష్ట్ర ముఖ్యమంత్రి వీటిని పట్టించుకోకుండా నాయకులను, మీడియాను ఆకర్షించే ప్రచార ఆర్భాటాలతోనే కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా 780 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయినా సహాయక చర్యలను చేపట్టలేదన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా దళితులకు మూడెకరాల భూమి, రెండు బెడ్‌రూములతో ఇళ్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ మాయమాటలతో ప్రజలు మోసపోయారని అన్నారు.
కాంగ్రెస్ నుంచి చెత్తపోయిందని, నిఖార్సైన కార్యకర్తలు మిగిలారని ఉత్తమ్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు డిసెంబరులోగా నిర్వహించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులంతా విభేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలని కోరారు. కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా నాయకత్వం అంతా అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు. కార్యకర్తలకోసం గాంధీభవన్‌లో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేస్తున్నట్టుగా ప్రకటించారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ఒక్కొక్క కుటుంబానికి 15లక్షలను బ్యాంకులో వేస్తామన్న ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటిదాకా 15 పైసలను కూడా వేయలేకపోయాడని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.
భూసేకరణ ఆర్డినెన్సుతో రైతులకు, భూమి యాజమానులకు భూమిపై హక్కు లేకుండా చేశారని అన్నారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీలతో ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్ సమావేశం అవుతారని ఉత్తమ్ వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా మాట్లాడుతూ సభ్యత్వాన్ని సత్వరమే పూర్తిచేసి, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేంద్రీకరించి పనిచేయాలని కోరారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు విఫలమైనాయన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సన్నద్ధం కావాలని కుంతియా కోరారు.
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ ముందుచూపుతో తెలంగాణను కాంగ్రెస్ అభివృద్ధి చేసిందన్నారు. బ్రహ్మాండంగా ఉన్న సచివాలయాన్ని ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించి, సచివాలయం జాగాను సీఎం కేసీఆర్ సన్నిహితులకు కట్టబెట్టడానికి సిద్దమైనారని ఆరోపించారు. సచివాలయం స్థలాన్ని అమ్మేయాలనే దుస్సాహాసానికి ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి దిగలేదన్నారు. గుడిని, గుడిలోని లింగాన్ని కూడా సీఎం కేసీఆర్ మింగేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని నలుగురు కుటుంబసభ్యులకు ఫలహారంగా పంచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా అనేక కుంభకోణాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, వాటిని త్వరలోనే ఒక్కొక్కటిగా బయటపెడ్తామని భట్టి హెచ్చరించారు. సేవ్ తెలంగాణ, సేవ్ హైదరాబాద్ నినాదంతో ఉద్యమిద్దామన్నారు. ఈ సమావేశానికి రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు క్యామ మల్లేశ్ అధ్యక్షత వహించగా అగ్రనేతలు మధుయాష్కీ, సర్వే సత్యరానాయణ, సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్, రామ్మోహన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఉద్దెమర్రి నర్సింహ్మా రెడ్డి, కుసుమకుమార్, కూన శ్రీశైలం గౌడ్ తదితరులు ప్రసంగించారు.
క్యామ మల్లేశ్ వర్సెస్ మల్‌రెడ్డి రంగారెడ్డి డీసీసీ సమావేశంలో ప్రసంగాల సందర్భంగా మల్‌రెడ్డి రంగారెడ్డి, క్యామ మల్లేశం పరస్పరం పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. ప్రజల్లో లేకుండా కొందరు నాయకుల దగ్గర పైరవీలు చేసుకున్నవారికి టికెట్లు ఇస్తే ఓడిపోతారని, ఇది పార్టీకి నష్టమని మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రసంగంలో పరోక్షంగా క్యామ మల్లేశ్‌పై విమర్శలు చేశారు. దీనికి స్పందించిన క్యామ మల్లేశ్ మాట్లాడుతూ అధిష్టానం గుర్తించి టికెట్ ఇచ్చిందంటే ప్రజల్లో ఉన్నట్టేనని, టికెట్ రాని వారు ప్రజల్లో లేనట్టేనని సమాధానం ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం చేయడానికి కనీసం ఒక పుస్తకం కూడా తీసుకునిపోని నాయకులు మైకులు దొరగ్గానే నోటికొచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదని మల్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. టీపీసీసీ, ఏఐసీసీ నేతల ఎదుటే జరిగిన వాద, ప్రతివాదాలు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.
'ఫిరాయింపులు తప్ప సమస్యలపై దృష్టి లేదు'
Published Tue, Apr 28 2015 12:38 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement