టీఆర్‌ఎస్ సర్కారు పథకాలన్నీ అస్తవ్యస్తం
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పథకాలన్నీ అస్తవ్యస్తంగా మారాయని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. రుణమాఫీతో మొదలుకొని డబుల్ బెడ్‌రూం, దళితులకు భూపంపిణీ.. ఇలా పథకాలన్నీ గందరగోళంగా తయారయ్యాయన్నారు. కొత్త పథకాల పేరిట ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలను నీరుగార్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. కొత్తగా ప్రకటించిన వాటికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా పేదలను అణిచివేస్తోందని మండిపడ్డారు. సంక్షేమం గురించి మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. జానారెడ్డి హరితహారం కార్యక్రమాన్ని మెచ్చుకున్నారుకాని.. అందులో జరిగిన అవినీతిని సమర్థించలేదని చెప్పారు. అలాగే గాంధీ కుటుంబంతో పోల్చుకునే అర్హత టీఆర్‌ఎస్ నేతలకు లేదని భట్టి స్పష్టం చేశారు.