సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ అని, ఉచిత విద్యుత్ గురించి బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడితే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్తు ఫైలుపై మొట్ట మొదటి సంతకం పెడుతున్న ఫొటో చూపించాల ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పార్టీ నేత లు, కార్యకర్తలకు సూచించారు. ఆ రోజు చరిత్రాత్మకమైనదని పేర్కొన్నారు.
ఉచిత కరెంటు తమ పాలసీ అంటూ సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ తదితరులతో కలిసి ‘సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్‌మెంట్’కార్యక్రమాన్ని భట్టి ప్రారంభించారు. ఉచిత విద్యుత్ ఫైలుపై వైఎస్సార్ మొదటి సంతకం చేస్తున్న ఫొటో వద్ద సెల్పీ దిగారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ అభివృద్ధి పనుల ముందు సెల్ఫీలు
ఉచిత కరెంటుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఇప్పుడు, ఎప్పుడూ, ఎల్లప్పు డూ దీనిని కొనసాగిస్తామని, అధికారంలోకి రాగానే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని భట్టి చెప్పారు. ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
వారి త ప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు, కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో తెలంగాణలో ఏం అభివృద్ధి చేసిందో చెప్పడానికి ‘సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్‌మెంట్’కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల ముందు సెల్ఫీ దిగి, వాటి గురించి ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
ప్రతి అభివృద్ధి పని గురించిప్రజలకు వివరిస్తాం
‘మెట్రో రైలు మేమే తెచ్చాం.. మెట్రో ఎక్కి సెల్ఫీ తీసి ఇది కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందంటాం. అలాగే కాంగ్రెస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఈసీఐఎల్, బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇలా ప్రతి అభివృద్ధిని ‘సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్‌మెంట్’పేరిట ప్రజలకు వివరిస్తాం.
ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొంటారు. వాట్సాప్ డీపీలో సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్‌టెంట్ ఫొటోలు పెట్టి విస్తృత ప్రచారం కల్పిస్తాం..’అని భట్టి తెలిపారు. సీఎంకు సోయి లేక కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రారంభించి 60 ఏళ్లు అవుతోందని, ఈ సందర్భంగా నిజామాబాద్ లో ప్రాజెక్టు వద్ద సంబరాలు నిర్వహిస్తామని మధుయాష్కీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment