పులకించిన గోదావరి
-
భక్తజన సంద్రం
-
పుష్కర స్నానానికి పోటెత్తిన జనం
-
ధర్మపురిలో 50 వేల మంది స్నానాలు
ధర్మపురి/కాళేశ్వరం/మంథని : గోదావరి పులకించింది. శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది పుష్కరస్నానం చేసి పుణీతులయ్యారు. ఒక్క ధర్మపురిలోనే సుమారు 50 వేల మంది స్నానాలు ఆచరించారు. కాళేశ్వరంలో 8 వేలు, మంథనిలో ఐదు వేల మంది స్నానాలు చేశారు. అనంతరం గోదావరిలో పిండ్ర ప్రదానాలు, మొంటెల వాయినాలు, బ్రాహ్మనులకు దానధర్మాలు చేశారు. గోదావరి మాతకు దీపారాధనలు చేశారు. సాయంత్రం మహాహారతి ఘనంగా నిర్వహించారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు తీసుకున్నారు. తహశీల్దార్ మహేశ్వర్, సర్పంచ్ సంగి సత్తమ్మ, ఈవో రాజరెడ్డి పర్యవేక్షణ చేశారు. కాళేశ్వరంలో మహిళలు గోదావరిలో పూలు, పండ్లు, వస్త్రాలు, ఓడిబియ్యం సమర్పించారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వర స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు. శుభానందదేవి ఆలయంలో శ్రావణ పూజలు కొనసాగాయి. మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. సాయంత్రం గోదావరి మాతకు మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. కాళేశ్వరంలో కరీంనగర్,ఆదిలాబాద్ జోనల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ తిమ్మారెడ్డి పుష్కరస్నానం చేశారు. కార్యక్రమంలో సర్పంచి మెంగాని మాధవి, ఆలయ ఈవో డి.హరిప్రకాశ్‌రావు, ఎండోమెంట్ డీఈ రాజేష్, ఆలయ మాజీ ధర్మకర్త అశోక్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్, అర్చకులు కష్ణమూర్తిశర్మ, లక్ష్మీనారాయణశర్మ, ఫణీంద్రశర్మ, రామన్నశర్మ, రామాచార్యులు తదితరులు పాల్గొన్నారు. మంథనిలో భక్తుల తాకిడి కనిపించింది.