కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం
Published Fri, Aug 5 2016 12:13 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
బుట్టాయగూడెం : గిరిజనేతరులతో కలిసి రెవెన్యూ, పోలీసు అధికారులు కుమ్మక్కై గిరిజనులను ఇబ్బంది పెట్టాలని చూస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తీవ్రంగా హెచ్చరించారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఓ బృందం బుట్టాయగూడెం మండలంలో గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా స్థానిక సీపీఎం కార్యాలయంలో గిరినులతో మధు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ గిరిజనులకు న్యాయంగా చెందాల్సిన భూముల కోసం పోరాడుతున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టడం అమానుషమన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు అధికార తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి అండ చూసుకుని అతిగా ప్రవర్తిస్తే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఏజెన్సీలో 20 ఏళ్ల నుంచి భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వారం రోజుల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే మాజీ, సీనియర్ జడ్జిలను ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను వివరిస్తామని పేర్కొన్నారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయం, పోలీసు రెవెన్యూ అధికారుల తీరుపై ఒక వినతి పత్రాన్ని డీఐజీకి అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మిడియం బాబూరావు, సీపీఎం నాయకులు మంతెన సీతారాం, ఎంసీపీఐ నాయకులు కాటం నాగభూషణం, శ్రీరాములు, తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement