అవినీతి పూత! | curreption covering | Sakshi
Sakshi News home page

అవినీతి పూత!

Published Fri, Aug 5 2016 11:57 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

అవినీతి పూత! - Sakshi

అవినీతి పూత!

– పుష్కరాలకు ముందే పనులు ఖలాస్‌
– ఒక్క వాహనమూ తిరగకముందే దెబ్బతింటున్న రోడ్లు
– రోజూ చక్కర్లు కొడుతున్నా.. పట్టించుకోని అధికారులు
– 25 శాతం మేరకు కమీషన్లు దండుకుంటున్న టీడీపీ నేతలు
 
మిలుగు రూ. కోటి?
 కపిలేశ్వరం నుంచి సంగమేశ్వరం వరకు రూ.90 లక్షలు, ఆత్మకూరు నుంచి కపిలేశ్వరం వరకు రూ.2 కోట్లతో రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఇందుకు దాదాపు రూ.3 కోట్ల ఖర్చు చేయాల్సి ఉంది. అయితే రూ.కోటి మాత్రమే ఖర్చు చేసి.. మిగిలిన రూ.2 కోట్లలో 25 శాతం వరకూ అధికారపార్టీ నేతలు వాటాలు పంచుకున్నారు. అధికారుల వాటా పోగా కనీసం కోటి రూపాయల మేరకు కాంట్రాక్టర్లు మిగిలించుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.
 
 
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కొత్తపల్లి నుంచి లింగాపురానికి వెళ్లే రోడ్డు. ఈ పనులను కృష్ణా పుష్కర పనుల్లో భాగంగా చేపట్టారు. పూరై ్త పది రోజులు కూడా కాలేదు. అప్పుడే కంకర తేలుతోంది. ఇప్పుడు మళ్లీ కంకర వేసి ప్యాచ్‌ పనులు చేసి పూతలు పూసేస్తున్నారు. విచిత్రమేమిటంటే ఈ రోడ్డుపైనే పుష్కర పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు రోజూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా పనులు పూర్తిచేశారంటూ బిల్లులు కూడా చెల్లించేస్తున్నారు. 
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: 
కృష్ణా పుష్కర పనులపై మొదటి నుంచీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా పనులకు టెండర్లు పిలవడం... ఈ పనులన్నీ అధికార పార్టీ నేతల అనుచరులే సంపాదించుకోవడం జరిగింది. ఇందులోనూ నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన పనులల్లో వాటాను ఆ నియోజకవర్గ అధికార పార్టీ నేత తీసుకుంటున్నారు. ఇక శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో జరిగిన పనులల్లో అధికార పార్టీలకు చెందిన నేతలు ఇద్దరికీ వాటాలు ఇవ్వాల్సి వస్తుండటంతో పనులు మరింత నాసిరకంగా తయారవుతున్నాయి. అందులోనూ అధికారులకూ చేయిచాస్తుండటంతో పనుల నాణ్యత పూర్తిగా కొరవడింది. ఈ పనులపై అటు సంబంధిత శాఖ అధికారులు కానీ... నాణ్యతను పరిశీలించాల్సిన క్వాలిటీ కంట్రోలు విభాగం అధికారులు కానీ కన్నెత్తి చూడటం లేదు. పైగా నాణ్యతను పరిశీలించవద్దంటూ క్వాలిటీ కంట్రోలు అధికారులకు అనధికారికంగా ఆదేశాలు జారీకావడంతో.. కాంట్రాక్టర్లు మరింత రెచ్చిపోయి పనులను నాసిరకంగా చేపడుతున్నారని తెలుస్తోంది. 
అధికారులు రోజూ తిరుగుతున్నా...
వాస్తవానికి సంగమేశ్వరానికి వెళ్లే దారిలో ప్రతీ రోజూ ఎవరో ఒక అధికారి వచ్చిపోతున్నారు. ఈ అధికారుల వాహనాలూ ఇదే రోడ్లపై వెళుతున్నాయి. కళ్ల ముందు రోడ్లన్నీ పెచ్చులూడి పాడైపోయినప్పటికీ కనీసం ఈ పనులపై విచారణ సైతం చేయడం లేదు. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లను పల్లెత్తు మాట కూడా అనడం లేదు. పైగా రోడ్డు వేసి పది రోజులు కాకముందే పెచ్చులూడిపోతే... పైపైన ప్యాచ్‌లు వేయాలంటూ ఆదేశిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్యాచ్‌ పనులు కూడా నాసిరకంగానే జరుగుతున్నాయి. అసలు వేసిన రోడ్డే ప్యాచ్‌ వర్క్‌లాగా చేసేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు పాడైపోయిన రోడ్డులకు వేస్తున్న ప్యాచ్‌పనుల్లోనూ అదే తీరు కొనసాగుతోంది.    
ప్రయాణికులకు తప్పని కష్టాలు...
కృష్ణా పుష్కరాల కోసం వేస్తున్న రోడ్లపై ఇప్పటివరకు ఇంకా ఒక్క భక్తుడి వాహనం కూడా రాకపోకలు సాగించలేదు. అయినప్పటికీ రోడ్లు మాత్రం పాడైపోతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా మొరుసు వేయాల్సి ఉండగా.. పక్కనే ఉన్న పొలం మట్టిని తీసేస్తున్నారు. ఫలితంగా ఘాటుకు వెళ్లే సందర్భంగా వాహనాలు రోడ్డు పక్కన ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కిమ్మనకుండా బిల్లులు కానిచ్చేస్తున్నారు. ఇందుకు కారణం పనులు చేస్తోంది అధికార పార్టీ నేతల అనుచరులు కావడమే. మొత్తం మీద పుష్కర పనులన్నీ పుష్కరాలకు ముందే కృష్ణా నదిలో కలిసిపోతున్నాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement