సాక్షి, కృష్ణా : తెలుగుదేశం పార్టీ నేత అపార్ట్‌మెంట్ కోసం రోడ్డును వెడల్పు చేస్తున్నారంటూ గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని సుందరయ్య కాలనీలోని బజారు గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. 40 అడుగులు ఉన్న రోడ్డును 80 అడుగులు చేయడం వల్ల తమ ఇళ్లు పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రోడ్డు నిర్మాణం కోసం పేదల ఇళ్లు తొలగించేందుకు రెవెన్యూ, పంచాయతీ అధికారులు సదరు ఇళ్లకు నోటీసులు అంటించారు.
బాధితుల ఇళ్లను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు పరిశీలించారు. స్థానిక టీడీపీ నేతకు రెవెన్యూ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పార్థసారథి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్లకు రక్షణ కరువైందని అన్నారు.
పట్టా ఉన్న భూములు తొలగించి 80 అడుగులు రోడ్డు వేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక టీడీపీ నేత శ్మశాన భూమిని సైతం ఆక్రమిస్తే అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో వైఎస్సార్ సీపీ పేదల తరఫున ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment