ప్రత్తిపాడు వద్ద దారిదోపిడీ
Published Tue, Jan 10 2017 1:55 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
పెంటపాడు : ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారిపై దారి దోపిడీ జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెంటపాడు ఎస్సై వాసంశెట్టి సుబ్రహ్మణ్యం కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనుకు చెందిన చిక్కాల ఏసు, పెరవలి మండలం మల్లేశ్వరానికి చెందిన ఉప్పులూరి నాగలక్ష్మి వరుసకు అక్కాతమ్ముళ్లు. వీరు వారి గ్రామాల నుంచి శుభకార్యం నిమిత్తం ఈనెల 7న తాడేపల్లిగూడెం మండలం కడియద్ద వెళ్లారు. తిరిగి రాత్రి మోటార్‌సైకిల్‌పై ఆరుగొలను వెళ్లేందుకు కడియద్ద నుంచి జాతీయరహదారి దిగి క్వారీ లారీల మార్గం నుంచి వెళుతున్నారు. ఆ ప్రదేశంలో ఇద్దరు దుండగులు వీరిని అడ్డగించి నాగలక్ష్మి వద్ద నున్న బంగారు వస్తువులు అపహరించేందుకు యత్నించారు. ఏసు వారిని వారించడంతో వారిలో ఒకడు కర్రతో ఏసును కొట్టి ఇద్దరి వద్ద నుంచి 4 కాసుల బంగారు ఆభరణాలు, రూ. 8 వేల నగదు, వెండి ఉంగరం, రెండు సెల్‌ఫోన్లు లాక్కున్నారు. ఈ ఘటనపై ఏసు సోమవారం పెంటపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ మధుబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు.
Advertisement