
నాలుగు తరాలు..
బంజారాహిల్స్: ఇది చాలాకాలం కిందటి సంఘటన.. ఓ వ్యక్తికి డైరీ రాసే అలవాటుంది. దానిలో తన అనుభవాలను రాసుకున్నాడు. దానిని తన చివరి కాలంలో కొడుకుకు ఇచ్చాడు. అనంతరం ఆ డైరీ ఆ కొడుకు నుంచి కూతురు వద్దకు చేరింది. అనంతరం ఆ డైరీలోనిక విశేషాలను ఆమె తమ ఇద్దరు కూతుళ్లకు చెప్పింది. దాంతో ఆ ఇద్దరూ ఆ పుస్తకంలోని వింతలు, విశేషాలు తెలుసుకునేందుకు బయలుదేరారు.
అలా పర్యటిస్తూ ఫ్రాన్స్ లోని సెయిన్ నదీతీరం నుంచి నుంచి మూసీ నది తీరానికి వచ్చారు. ఇక్కడి తమ పూర్వికుల మూలాలు తెలుసుకుని మురిసిపోయారు. దశాబ్దాల వెనక్కు వెళ్లి తాత, ముత్తాతల జ్ఞాపకాలను డైరీ ఆధారంగా ఆనాటి సంఘటనలు గుర్తించి ఆనందించారు. హాలీవుడ్ అడ్వంచర్ సినిమాను తలపిస్తున్న ఈ కథాకమామీషు ‘సాక్షి సండే స్పెషల్’...
బంధాలు దూరమై.. అనుబంధాలు మాయమవుతున్న కాలం ఇది. కానీ తమ పూర్వికులు నివశించిన ప్రాంతానికి చూడాలని, వారి విశేషాలు తెలుసుకోవాలని పాశ్చాత్య సంస్కృతికి, ఫ్యాషన్ కు నెలవైన ఫ్రాన్స్ దేశం నుంచి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మూలాలు వెతుక్కుంటూ నగరానికి వచ్చారు. సౌత్ ఫ్రాన్స్ లో నివసించే క్రిస్టెన్ హోవే (25), కమిలా(25) ఇద్దరు కవలలు.. ఇక్కడ తమ ముత్తాత, తాత నివసించిన ప్రాంతాలను సందర్శించి, అప్పటి ఫొటోలను చూసి మురిసిపోయారు. వారిని పలకరించిన ‘సాక్షి’తో తమ అనుభవాలు పంచుకున్నారు.
క్రిస్టెన్ సోషల్ ఆంథ్రోపాలజీ చదవగా, కమిలా ఆర్ట్స్ అండ్ ఫొటోగ్రఫీలో డిప్లొమా చేసింది. ఇద్దరికీ చదువుతో పాటు పర్వతారోహణం అంటే ఎంతో ఇష్టం. ఇందులో భాగంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడ పర్వతారోహణతో పాటు చరిత్రను చదువుకున్నారు. ఇండియాలో కూడా పర్యటించాలని తలపెట్టినప్పుడు వీరి తల్లి కేట్ కొన్ని ఆసక్తికర విషయాలను వీరికి చెప్పింది. వీరి ముత్తాత థియోడర్ టస్కర్ హైదరాబాద్ రాష్ట్రానికి 1927 నుంచి 1943 వరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూగా పనిచేశారని.. తన భార్య జెఫీ టస్కర్‌తో కలిసి ఆదర్శనగర్ పక్కనున్న ‘హిల్‌ఫోర్ట్ ప్యాలెస్’ (ఇప్పటి రిడ్జ్ హోటల్)లో ఉండేవారని ఆధారాలతో సహా అందజేసింది.
దీంతో తమ పూర్వికులు నివశించిన నగరాన్ని చూడాలన్న కోరికతో ఈ అక్కాచెల్లెళ్లు ఈనెల 7న సిటీకి వచ్చారు. ఇప్పుడున్న రిడ్జ్ హోటల్‌ను సందర్శించారు. ఇక్కడ తమ ముత్తాత 17 సంవత్సరాల పాటు నివాసంగా ఉన్నారట. అదే సమయంలో కౌన్సిల్ మెంబర్ ఆఫ్ హైదరాబాద్‌లో కూడా ఆయన పని చేశారని వెల్లడించారు. కొడైకెనాల్‌లో పుట్టిపెరిగిన టస్కర్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయనకు హ్యారీ టస్కర్ అనే కొడుకు హైదరాబాద్‌లోనే జన్మించాడు. హ్యారీ కూతురు కేట్ కాగా కేట్ పిల్లలే క్రిస్టెన్, కమిలా. ఇక్కడ టస్కర్ పనిచేస్తున్న సమయంలోనే ఆయనకు జూబ్లిహాల్‌లో జరిగిన కార్యక్రమంలో ’సర్’ బిరుదును బ్రిటిష్ ప్రభుత్వం ప్రదానం చేసింది.
చౌమొహల్లా ప్యాలెస్‌ను సందర్శించినప్పుడు తన ముత్తాత భార్య జెఫీ ఫొటోను ప్రిన్సెస్ నిలోఫర్ పక్కన చూశామని వీరు చెప్పారు. తమ ముత్తాత ప్రతి విషయాన్ని డైరీలో రాసేవారని.. ఆ డైరీని తన తాత హ్యారీకి ఇవ్వగా.. హ్యారీ చనిపోయే ముందు ఆ డైరీని తమ తల్లి కేట్‌కు ఇచ్చారని.. దాని ద్వారా తమకు హైదరాబాద్‌తో ఉన్న అనుబంధం తెలిసిందన్నారు. హైదరాబాద్‌లో తమ మూలాలు ఉన్నాయని తెలుసుకుని ఎంతో సంతోషపడ్డామని మురిసిపోయారు. సౌత్ ఫ్రాన్స్ లో నివశిస్తున్న వీరు ప్రస్తుతం ఫిమేల్ అడ్వెంచర్స్‌పై డాక్యుమెంటరీ తీసే పనిలో ఉన్నారు.
రాక్ క్లైంబింగ్‌పై ఆసక్తి ఉన్న నగరానికి చెందిన గచ్చిబౌలి వాసి రిత్విక్‌రెడ్డి నివాసంలో వీరు బసచేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన వీరు పలు గుట్టలను కూడా ఎక్కి సరదా తీర్చుకున్నారు. శనివారం నగర పర్యటన అనంతరం తన ముత్తాత పుట్టి పెరిగిన కొడైకెనాల్‌కు వెళ్లారు. అక్కడ కూడా జ్ఞాపకాలను నెమరువేసుకంటామని వెల్లడించారు.
ఇది మరిచిపోలోని ఘటన
మా ముత్తాతకున్న డైరీ రాసుకునే అలవాటు మాకెంతగానో సహాయపడింది. ఎందుకంటే ఆయన రాసిన డైరీ వల్లనే హైదరాబాద్‌తో మాకున్న అనుబంధాన్ని తెలుసుకోగలిగాం. ఇక్కడ 30 సంవత్సరాల పాటు మా ముత్తాత, తాత నివసించినట్లు తెలిసింది. ఆయన నివాసిత ప్రాంతాన్ని సందర్శించడం జీవితంలో మరిచిపోలేం. – క్రిస్టెన్ హోవే
సీటీతో ఎక్కువ అనుబంధం
మా పూర్వికులు నివసించిన ప్రాంతాలను సందర్శించడం తియ్యని జ్ఞాపకం. ఇందుకోసమే మేము కష్టపడి ఫ్రాన్స్ నుంచి వచ్చాము. మా ముత్తాత కాలం నుంచి నివాసిత ప్రాంతాలను అనుసంధానిస్తూ ఒక డాక్యుమెంట్‌ను తీస్తున్నాం. హైదరాబాద్‌తోనే ఎక్కువగా అనుబంధం ఉంది. ఇక్కడ తాత, ముత్తాతకు సంబంధించిన ఎన్నో ఫొటోలు భద్రంగా ఉంచారు. మా అమ్మ కూడా చిన్నతనంలో ఇక్కడ విశేషాలను తెలుసుకుంది. – కమిలా