డామిడ్.. కథ అడ్డం తిరిగింది
డామిడ్.. కథ అడ్డం తిరిగింది
Published Mon, Dec 12 2016 10:45 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు (మెట్రో)
ప్రభుత్వం అప్పగించిన పనులు చేయాలని, కనీసం ఇంకుడు కుంటలు తవ్వకాలలోనూ ఎంపిడిఒలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఇలా చేసుకుంటూ పోతే ప్రజలకు ప్రభుత్వ సేవలు ఏ విధంగా అందుతాయని కలెక్టర్ చెబుతుంటే... పనుల ఒత్తిడి తమపై పడుతోందనీ, విధుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయనీ, తాము ప్రభుత్వం అప్పగించిన పనులు చేయలేమనీ, ప్రతి వారం నిర్వహించే సమావేశాలనూ తగ్గించాలని ఎంపిడిఒలు అంటున్నారు. ఇలా అధికారులు, కలెక్టర్ మధ్య వైరం కొనసాగుతుంటే ఈ వైరాన్ని ఎంపిడిఒలకు అనుబంధంగా ఉండే ఒక జిల్లా స్థాయి నాయకుడు మాత్రం తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల ఎంపిడిఒలు జిల్లా కలెక్టర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురేశారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ తీవ్ర పతిఒత్తిడికి గురి చేస్తున్నారనీ, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సెలవులు ఇచ్చేందుకు కూడా వేధిస్తున్నారని, వారం వారం సమీక్షా సమావేశాలతో విసిగిస్తున్నారని ఎంపిడిఒలు కలెక్టర్‌పై తిరుగుబాటు ప్రకటించారు. అంతే కాకుండా మూకుమ్మడిగా సెలవుపై వెళ్లిపోతామంటూ బెదిరింపు దోరణులకూ దిగారు. అయితే దీనికి వెనుక ఉండి రెచ్చగొట్టింది మాత్రం సదరు అధికారులకు అనుబంధంగా ఉండే జిల్లాకు చెందిన ఒక నేత అనేది వెలుగులోకి వచ్చింది. సదరు నేత మాత్రం ఏమీ తెలియనట్లు అధికారులను రెచ్చగొట్టి విషయాన్ని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధృష్టికి తీసుకొచ్చి కలెక్టర్‌ను బదిలీ చేసేందుకు తీవ్రంగానే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆమేరకు సదరు నేత నివాసంలో మంగళవారం రాత్రి మంతనాలు సాగించి ముందుగా ఎంపిడిఒలు నిరసన వ్యక్తంచేస్తే ఆతరువాత పంచాయతీ కార్యదర్శులను, అనంతరం తహశీల్దార్లను నిరసనకు సిద్ధం చేస్తానని ఎంపిడిఒలకు వివరించి ఆమేరకు ఆందోళనకు ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే బుధవారం ఆందోళనకు జిల్లా కేంద్రానికి చేరుకున్న ఎంపిడిఒల ఆందోళను విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నేరుగా జిల్లా పరిషత్‌కు చేరుకుని ఎంపిడిఒల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ విషయంపై కలెక్టర్ ఎంపిడిఒలతో మాట్లాడుతూ తాను సొంత పనులు చేయించడం లేదనీ, ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందనీ, దీనిలో భాగంగా తాను కూడా జిల్లాలో పథకాలు అమలు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నానని ఎంపిడిఒలకు వివరించారు. అంతే కాకుండా ఇబ్బందులు పెట్టే సమీక్షలనే తొలగిస్తానని హామీ ఇచ్చారు. అయినా ప్రభుత్వం చేయాలనే పనులు చేయమని కోరితే ఎందుకు ఇబ్బందని ఎంపిడిఒలను ప్రశ్నించారు. అదే వేదికపై కనీసం ఇంకుడు కుంటల తవ్వించేందుకు ఎంపిడిఒలు ముందుకు రావడం లేదని ఇదెక్కడి పనితీరని విధుల్లో మరింత అశ్రద్ధ ప్రదర్శించే ఎంపిడిఒలను ప్రశ్నించారు. అంతే కాకుండా ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వ్యాయామం కూడా చేయాలని సలహాలు సైతం ఇచ్చారు. దీంతో ఎంపిడిఒలు ఆందోళనను విరమించారు.
బెడిసికొట్టిన నాయకుని ప్రయత్నాలు ః
దీంతో జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్లు, ఎంపిడిఒలు, కార్యదర్శులను ఆందోళన బాట పట్టించేందుకు సిద్ధపడుతున్న సదరు నేత ప్రయత్నాలు బెడిసికొట్టడంతో నేతకు మింగుడు పడటం లేదు. దీంతో ఉన్నతాధికారితో మార్గం మూసుకుపోవడంతో చివరకు ఎంపిడిఒలతో రాజీ చేయించే పనిలో నిమగ్నమయినట్లు చెప్పుకొచ్చి, ఎంపిడిఒలను బుజ్జగించి, ఆందోళన విరమింపచేయించానంటూ సహచర నాయకులతో చెప్పుకొంటూ ఆందోళనను తనకు అనుకూలంగా మార్చుకున్నారు.
అధికారుల ఆంతర్యం ఏమిటి ః
ఈ తతంగం ఒక వైపు జరుగుతుంటే జిల్లాలోని అధికారులతో శుక్రవారం అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ ప్రత్నిజ్ఞ చేయించారు. ఈ ప్రతిజ్ఞలో భాగంగా ఒక నెలరోజుల పాటు ఎవరు అవినీతిని దూరంగా పెడతారో వారే ప్రతిజ్ఞలో ఉండాలని కలెక్టర్ చెప్పడంతో కొందరు ఎంపిడిఒలు, ఇఒపిఆర్‌డిలు ప్రతిజ్ఞ చేయకుండానే సమావేశ మందిరం నుండి బయటకు వెళ్లిపోయారు. దీంతో అసలు అధికారుల ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలని సహచర అధికారులు చర్చించుకోవడం సమావేశంలో కనిపించింది. ఏది ఏమైనా ఈ విషయంలో పనిచేయాలని, అవినీతికి వ్యతిరేకంగా విధులు నిర్వహించాలని సూచించే కలెక్టర్‌ది తప్పా, లేక పనులు చేయలేకపోతున్నామని చెప్పే అధికారులది తప్పా, లేక వీరిని అడ్డం పెట్టుకుని ఆటలాడే నాయకునిది తప్పా అనేది జిల్లా ప్రజలే నిర్ణయించాలి.
Advertisement
Advertisement