నల్లవాగు ప్రాజెక్టు కట్టపై పెరిగిన తుమ్మ చెట్లు
- విపరీతంగా పెరిగిన పిచ్చి మొక్కలు
కల్హేర్: నల్లవాగు పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ప్రాజెక్టు కట్టపై తుమ్మ చెట్లు, వివిధ చెట్లు దట్టంగా పెరిగాయి. దీంతో ప్రాజెక్టు కట్టకు ప్రమాదం పొంచి ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క గండ్లు, బుంగలు పడి ప్రాజెక్టుకు సంబంధించిన కాల్వలు దెబ్బతినడంతో శిథిలవంతంగా తయారయ్యయి.
తూములు, సైఫాన్లు, షట్టర్లు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టు కింది భాగంలో ఎమార్జెన్సీ కెనాల్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. నల్లవాగు ప్రాజెక్టు పట్ల నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు బాగు గురించి పట్టించుకోకపోవడంతో కట్టపై చెట్లు పెరిగాయని చెపుతున్నారు.
కల్హేర్ మండలంలోని సుల్తానాబాద్ వద్ద 1967లో రూ. 98లక్షలతో నల్లవాగు ప్రాజెక్టు నిర్మించారు.అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడి, నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిధ్ధారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. కుడి కాల్వ పరిధిలో సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, మార్డి, ఖానాపూర్(కె), కష్ణాపూర్, ఇందిరానగర్, కల్హేర్ వరకు 4,100ఎకరాలు ఆయకట్టు ఉంది.
ఎడమ కాల్వ పరిధిలో బోక్కస్‌గాం, అంతర్‌గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్ గ్రామల్లో 1,230 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. నల్లవాగు కాల్వలను ఆధునీకరించేందుకు 200910లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.14.19కోట్లు మంజూరు చేశారు. పనుల్లో నాణ్యత లోపంతో సిమెంట్ కట్టడాలు బీటలువారాయి.
కాల్వల మధ్య పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. ఇటివలే రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించి నల్లవాగు ప్రాజెక్టు రూపురేఖలు మారుస్తామని ప్రకటించారు. కట్టపై ఉన్న చెట్లను తోలగించాలని రైతన్నలు అధికారులను కోరుతున్నారు. ఈ విషయన్ని నీటి పారుదల శాఖ ఈఈ రాములుతో ప్రస్తవించగా కట్టపై పెరిగిన చెట్లను వెంటనే తోలగిస్తామని తెలిపారు.