లండన్: మానవాళిపైకి మరో ప్రాణాంతక వైరస్ వచ్చిపడింది. మార్‌బర్గ్ వైరస్ డిసీస్ (ఎంవీడీ)గా పిలిచే దీని తాలూకు తొలి కేసు గత వారంలో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ఈక్వటోరియల్ గినియాలో నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే నిర్ధారించింది కూడా. విపరీతమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఆయాసం, రక్తపు వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పుల వంటివి దీని లక్షణాలు. ఈ వ్యాధి తొలిసారిగా 1967లో నమోదైంది.
ఎబోలాను పోలి ఉండే ఈ ప్రాణాంతక వైరస్‌కు ఇప్పటిదాకా చికిత్సేమీ లేదు! గినియాలోని కీటెం ప్రావిన్స్‌లో దీని బారిన పడి అప్పుడే 9 మంది మరణించారని డబ్ల్యూహెచ్‌వో మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘వారందరిలోనూ గుర్తు తెలియని హెమరేజ్ జ్వరం ఆనవాళ్లు బయటపడ్డాయి. ముందు జాగ్రత్తగా మార్‌బర్గ్ సోకినట్టు అనుమానమున్న 200పై చిలుకు మందిని క్వారెంటైన్ చేశారు’’ అని వెల్లడించింది. దాంతో పొరుగునున్న కామెరూన్ సరిహద్దుల వద్ద ఆంక్షలను మరింత పెంచింది.
ఏమిటీ వ్యాధి?
ఎంవీడీ రక్తస్రావంతో కూడిన తీవ్ర జ్వరానికి దారి తీస్తుంది. దీనిబారిన పడ్డవారిలో ఏకంగా 88 శాతం మంది మృత్యువాత పడుతున్నారు! 1967లో జర్మనీ, సెర్బియాల్లో ఎంవీడీ ప్రబలింది. ఉగాండా నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ గ్రీన్ మంకీస్ ద్వారా ఇది సోకినట్టు అప్పట్లో తేల్చారు. గబ్బిలాల వంటివాటికి ఆవాసమైన గుహలు, గనుల్లో చాలాకాలం పాటు గడిపితే ఈ వైరస్ సోకుతుంది.
పైగా ఇది అంటువ్యాధి కూడా. ఒకరి నుంచి మరొకరికి సులువుగా, అతి వేగంగా సోకుతుంది. తలనొప్పి, జ్వరం, ఆయాసంతో మొదలై మూడో నాటికల్లా పొత్తి కడుపు నొప్పి, విరేచనాల దాకా వెళ్తుంది. వారం రోజులకు రక్తపు వాంతులు మొదలవుతాయి. కళ్లన్నీ లోపలికి పోయి, మనిషి పీక్కుపోయి అచ్చు దెయ్యాన్ని తలపిస్తాడు. కేంద్ర నాడీవ్యవస్థ పనితీరు కూడా బాగా మందగిస్తుంది.
చికిత్స లేదు
దీనికి ఇప్పటిదాకా మందు గానీ, వ్యాక్సీన్ గానీ అందుబాటులో లేవు. పలు వ్యాక్సీన్లు ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నాయి. ఇదమిత్థంగా చికిత్స కూడా లేదనే చెప్పాలి. అసలు తొలి దశలో ఎంవీడీని గుర్తించడం కూడా చాలా కష్టం.
Comments
Please login to add a commentAdd a comment