kalher
-
తెగిన వంతెన
కల్హేర్: మండలంలోని మాసాన్‌పల్లి చౌరస్తా వద్ద సంగారెడ్డి - నాందేడ్ జాతీయ రహదారిపై శనివారం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్ జిల్లా నర్సింగ్‌రావుపల్లి శివారులో గల వంతెన వద్ద జాతీయ రహదారి తెగిపోయింది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి.హైదరాబాద్, తదితర ప్రాంతాలకు వెళ్లె ఆర్టీసీ బస్సులు మాసాన్‌పల్లి చౌరస్తా నుంచి వెనుతిరిగాయి. నిజాంసాగర్ ఎస్ఐ అంతిరెడ్డి కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించారు. -
ఎర్రబడిన ఆకాశం
కల్హేర్: కల్హేర్ శివారులో సోమవారం సాయంత్రం ఆకాశంపై ఎర్రతివాచీ పర్చుకుంది. ఇటీవల భారీ వర్షాతో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో కారుమబ్బులు నెలకొన్నాయి. అనంతరం వర్షాలకు బ్రేక్ పడటంతో ఈ అపురూప దృశ్యం అవిష్కృతమైంది. -
నల్లవాగు.. పరవళ్లు
కల్హేర్: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగులో భారీగా వరద చేరింది. బుధవారం ప్రాజెక్టు అలుగుపై నుంచి వరద నీరు పొంగిపొర్లింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 ఫీట్లు. పూర్తి నీటి నిల్వ 776.13 ఎంసీఎఫ్‌టీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 1493.166 ఫీట్లు ఉంది. మంగళవారం రాత్రి ఎగువ భాగంలోని కంగ్టి మండలంలో కురిసిన వర్షంతో భారీగా నీరు చేరింది. 400 క్యూసెక్కులు వరకు వరద నీరు ఇన్‌ఫ్లో ఉంది. 200 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు అలుగు వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో మండలంలోని చెరువులకు జలకళ వచ్చింది. -
వీరప్ప.. తపన
కల్హేర్: మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడమేకాక, పర్యావరణ పరిరక్షణకు అవుసుల వీరప్ప విశేష కృషి చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతిమలు తయారు చేస్తూ బిజీగా మారుతారు. చంద్రప్ప- రత్నమ్మ దంపతుల ఎకైక సంతానం వీరప్ప. ఓ హోటల్లో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రి చంద్రప్ప వినాయకుడి విగ్రాహాలు తయారు చేసి గ్రామాస్తులకు సరఫరా చేసేవారు. దాదాపు 30 ఏళ్ల క్రితం తండ్రి మరణించడంతో అప్పటి నుంచి వీరప్ప ఆ బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. -
ఆహ్లాదకరం.. పచ్చని తోరణం
కల్హేర్: జాతీయ రహదారికిరువైపులా మర్రి వృక్షాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సంగారెడ్డి - నాందేడ్ 161 నంబర్ జాతీయ రహదారిపై దాదాపు వంద ఏళ్ల క్రితం నాటిన వృక్షాలు పచ్చదనం పర్చుకున్నాయి. నిజాం సర్కార్ హయాంలో రహదారికి ఇరువైపుల మర్రి చెట్లు నాటినట్లు పూర్వికులు చెపుతున్నారు. రహదారిపై వందల సంఖ్యలో ఉన్న చెట్లు భారీ వృక్షాలుగా ఎదగాయి. మాసాన్‌పల్లి చౌరస్తా, బాచేపల్లి సమీపంలో ఉన్న వృక్షాలు స్వాగతతోరణాలను తలపిస్తున్నాయి. రహదారిపై చెట్లను చూసి ప్రకృతి ప్రేమికులు పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. -
పదవులున్నా.. శ్రమజీవులే...
అటు ప్రజాప్రతినిధులుగా.. ఇటు కూలీలుగా సమర్థం గా బాధ్యతలు అధికార పెత్తనానికి పోకుండా సాధారణ జీవితం ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కల్హేర్: ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులైనప్పటికీ కొందరు శ్రమైక జీవనాన్ని సాగిస్తున్నారు. ఓవైపు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూనే మరోవైపు తమ కుటుంబాలకు చేయూత నిస్తున్నారు. ప్రజాప్రతినిధి అనే అహం లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ అటు గ్రామాల అభివృద్ధికి కృషి చేయడమేగాకుండా కుటుంబ పోషణలో తమవంతు సహకారాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కల్హేర్ మండలంలోని పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు. మండలంలో 18 పంచాయతీలు, 15 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఐదుగురు సర్పంచ్‌లు, ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు తమ కుటుంబ పోషణకు గాను వ్యవసాయ, కూలీ పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. పెసర పంటపై దృష్టి పెట్టిన సంతోషమ్మ.. బీబీపేట సర్పంచ్ సంతోషమ్మ ప్రస్తుత ఖరీఫ్‌లో పెసర పంట సాగు చేస్తున్నారు. మరో 15 రోజులు గడిస్తే పంట చేతికొస్తుంది. ఈమెకు గ్రామ శివారులో నల్లవాగు ఆయకట్టు కింద రెండు ఎకరాల పొలం ఉంది. సరైన వర్షాలు లేకపోయినా పెసర సాగు చేస్తున్నారు. దళిత వర్గానికి చెందిన ఈమె రిజర్వేషన్ కారణంగా బీబీపేట సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు. కుటుంబమూ ముఖ్యమేనంటున్న హిరిబాయి రాపర్తి పంచాయతీ పరిధిలోని అలీఖాన్‌పల్లి తండాకు చెందిన హిరిబాయి రాపర్తి సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. రాపర్తి, మీర్ఖాన్పేట, అలీఖాన్‌పల్లి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సర్పంచ్‌గా కొనసాగుతూనే కుటుంబ నిర్వహణకు గాను సొంత పనులు చేసుకుంటున్నారు. వ్యవసాయ పనులతోపాటు ఉపాధి హామీ పథకం కింద కూలీ పనులు చేస్తున్నారు. రాపర్తిలో ఇటీవలే 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణం జరిగింది. వీటి ఏర్పాటులో ఈమె ఎంతో చొరవ చూపారు. పదవి ఉందని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేమని చెబుతున్నారు హిరిబాయి. సొంత పనులు కూడా చేసుకుంటేనే ప్రతిఫలం దక్కుతుందని చెబుతున్నారు. మాదవ్వ సొంత పొలంలో పనులు... మాదవ్వ పెద్దముబారక్పూర్ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. పెద్దముబారక్పూర్, చిన్న ముబారక్పూర్ గ్రామాలకు ప్రథమ పౌరులు అయినప్పటికీ గ్రామ అభివృద్ధితోపాటు కుటుంబ సంక్షేమంపై దృష్టిపెట్టారు. వృద్ధాప్యంలో ఉన్నప్పటకీ ఈమె సొంత వ్యవసాయ పనులు చేస్తుంటారు. పనులు చేసేందుకు కూలీలు దొరకని పరిస్థితిలో సొంత పనులు చేసుకునేందుకు వెనుకాడడం లేదు. మాదవ్వ హయంలో పంచాయతీ భవనం, మురికి కాల్వల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి. వరినాట్ల పనులు.. బాలయ్య బొక్కస్‌గాం సర్పంచ్. ఈయనకు గ్రామ శివారులో రెండు ఎకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉంది. ఎకరం వరకు పెసర సాగులో ఉంది. మరో ఎకరంలో వరి సాగు పనులు మొదలు పెట్టారు. సొంత పొలంలో పనులు చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కూలీల కొరత కారణంగా సొంత పనులు చేసుకోవడంలో తప్పులేదంటున్నారు సర్పంచ్ బాలయ్య. ప్రజాప్రతినిధి హోదా ఉన్నా సొంత పనులను విస్మరించలేమంటున్నారు. రెండు వైపులా దృష్టి సారించి అటు గ్రామానికి ఇటు కుటుంబానికి న్యాయం చేస్తున్నారు. కుటుంబానికి సహకరిస్తున్న లచ్చవ్వ పెరుమాండ్ల లచ్చవ్వ కల్హేర్ ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈమె భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఎంపీటీసీ సభ్యురాలిగా బాధ్యతాయుతంగా పనిచేస్తూనే మరోవైపు కుటుంబానికి సహకరిస్తున్నారు. ప్రస్తుతం ఈమె వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. భర్త బాలయ్యతో కలిసి సొంత పొలంలో మొక్కజొన్న, సోయా పంటలు సాగుచేస్తున్నారు. పదవి ఉన్నా లేకపోయినా ఒకేరకంగా ఉండాలని లచ్చవ్వ అభిప్రాయపడుతున్నారు. ఆ ఉద్దేశంతోనే సొంత పనులను కూడా చేపడుతున్నారు. అహం వీడి.. సాధారణ జీవితం... అంతర్గాం ఎంపీటీసీ సభ్యురాలిగా లాలవ్వ పనిచేస్తున్నారు. వృద్ధాప్యంలోనూ ఈమె ఓవైపు ప్రజాప్రతినిధిగా మరోవైపు కుటుంబానికి చేయూతనిస్తున్నారు. వయస్సుమీద పడుతున్నా శరీరం సహకరిస్తున్న మేరకు ఇంటి పనులు చేపడుతున్నారు. ఎంపీటీసీ సభ్యురాలిని అనే అహం లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఇంటి పనులు కూడా చేసుకుంటున్నారు. సొంత పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. అంతర్గాం, పెద్దముబారక్పూర్ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. లాలవ్వ కృషీ మేరకు అంతర్గాంలో పంచాయతీ భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఉపాధిహామీ పనుల్లో కీలకం మిరిబాయి రాపర్తి ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఎంపీటీసీ సభ్యురాలైనప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. గ్రామంలో జరిగే ఉపాధి హామీ పనుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ పరిధిలోని అలీఖాన్‌పల్లిలో భర్త తావుర్యానాయక్తో కలిసి స్వయంగా ఉపాధి పనులు చేస్తూ తోటి కూలీల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. కూలీలకు అండగా ఉంటూ పనులు కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నారు. దానికి తోడు వ్యవసాయ పనులు, ఇతర పనులతో ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. -
‘శిఖం’పై సమరం
మెదక్, నిజామాబాద్ జిల్లా రైతుల మధ్య ఘర్షణ 30 మందికి పైగా గాయాలు కల్హేర్: నిజాంసాగర్ శిఖం భూమిలో దున్నకం విషయంలో ఇరు జిల్లాలకు చెందిన రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 30 మందికి పైగా రైతులు గాయపడ్డారు. కల్హేర్ మండలం మహదేవ్‌పల్లి గ్రామానికి చెందిన రైతులు నిజాంసాగర్ ప్రాజెక్ట్ 20 క్రాస్టు గేట్ల వద్ద ఉన్న శిఖం భూమిలో పంటలను సాగు చేసేందుకు పలు ట్రాక్టర్లలో తరలివెళ్లారు. దుక్కి దున్నే సమయంలో సరిహద్దుల విషయమై నిజామాబాద్ జిల్లా ఆరేడ్, ఆరేపల్లి గ్రామాలకు చెందిన రైతుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో పరస్పర దాడుల్లో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఘర్షణలో మహదేవ్‌పల్లికి చెందిన కుంటి బాల్‌సాయి, జి.మంజుల, చీకోటి బాలయ్య, బైండ్ల సుధాకర్, రాజు, జైపాల్, కె.నారాయణ, మాగి వీరయ్య, బి.లక్ష్మయ్య, ఆగమయ్యకు గాయాలయ్యాయి. వీరితో పాటు నిజామాబాద్ జిల్లా ఆరేడ్, ఆరేపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆరుగురికి కూడా గాయాలయ్యాయి. ఓ ట్రాక్టర్ ధ్వంసమైంది. సంఘటనా స్థలానికి బాన్సువాడ రూరల్ సీఐ వెంకటరమణారెడ్డి, నిజాంసాగర్ ఎస్ఐలు చేరుకొని మహదేవ్‌పల్లికి చెందిన 10 ద్విచక్ర వాహనాలను నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మెదక్ జిల్లా రైతులు సిర్గాపూర్ స్టేషన్లో పిర్యాదు చేశారు. గాయపడిన నిజామాబాద్ జిల్లా రైతులను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి, మెదక్ జిల్లా రైతులను నారాయఖేడ్ ఆసుపత్రికి తరలించి పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
మార్డిలో దాహం.. దాహం
ఎండిపోయిన మంచినీటి బోర్లు మార్డి గ్రామాస్తులకు తప్పని అవస్థలు కల్హేర్: వర్షాకాలంలో సైతం నీటి కోసం కష్టాలు తప్పడం లేదు. మంచి నీటి పథకం బోర్లలో భూగర్భజలాలు వట్టిపోయాయి. దీంతో మండలంలోని మార్డి గ్రామాస్తులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. 3,500 జనాభా ఉన్న గ్రామాంలో మంచినీటి పథకం బోర్లు 10 వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఆరు బోర్లు ఎండిపోయాయి. నాలుగు సింగిల్ ఫేజ్ బోర్లు మాత్రమే పని చేస్తున్నాయి. వీటిలో కూడా కొద్దిపాటి నీరు మాత్రమే వస్తోంది. నీటి కోసం సింగిల్‌ఫేజ్ బోర్ల వద్ద మహిళలు రాత్రిపగలు గంటల తరబడిగా ఖాలీ బిందేలు పెట్టుకుని పడిగాపులు కాస్తున్నారు. గత వేసవిలో వ్యవసాయ బోరును అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేశారు. వర్షకాలం రావడంతో రైతులు పంటలు సాగు చేశారు. దీంతో సాగుకు నీటి కష్టాలు వస్తాయన్న భయంతో ప్రజలకు తాగునీరు ఇవ్వడానికి జంకుతున్నారు. ప్రస్తుత సీజన్లో సరైన వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీటి మట్టం పెరగలేదు. దీంతో రైతులు బోర్లు అద్దెకు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. అధికారులు, నీటి సమస్యను తీర్చేందుకు ప్రయత్నలు చేస్తున్నా ఫలించడం లేదు. నీటి సమస్య రోజురోజుకూ తీవ్రం కావాడంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు గ్రామాస్తుల నుంచి చీవాట్లు తప్పడం లేదు. నీటి కోసం సింగిల్ ఫేజ్ బోర్ల వద్ద రాత్రి పూట జాగారం చేస్తున్నారు. గ్రామంలోని ఏ వీధిలో చూసినా నీటి కోసం తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ బోర్ల వద్దకు వెలితే రైతులు గొడవపడుతున్నారు. నీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆరోపించారు. -
వైభవంగా చతుర్వేద పారాయణం
కల్హేర్: మండలంలోని బాచేపల్లి బల్కంచెల్క తండాలో విశ్వమాలిని జగదాంబ మందిరంలో ఆదివారం కన్నుల పండుగల లోకకల్యాణం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మోటర్ వెహికిల్ ఇన్సపెక్టర్ మూడ్ కిషన్‌సింగ్–లలితాబాయి దంపతుల ఆధ్వర్యంలో ప్రజలు, రైతుల దోశలు తోలగి, సుఖసంతోషం కోసం లోకకల్యాణం జరిపారు. తండాలో నిర్మించిన జగదాంబ మందిరాం తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచడంతో వేడుకలకు ప్రదాన్యత సంతరించుకుంది. బాసర సరస్వతి దేవి క్షేత్రం అర్చకులు, నారాయణఖేడ్‌కు చెందిన వేద పండితులు మనోహర్‌శర్మ, సంతోష్ పంతులు, మురళిధర్, అంకుశ్రావు, గోవింద్, కిషన్, వినోద్ సంప్రోక్షణవిధి వైభవంగా నిర్వహించారు. చతుర్వేద పారాయణం, హరతి, హోమం, భోగ్భంఢార్, తీర్థప్రసాదవితరణ, ఇతర కార్యక్రమలు చేపట్టారు. భక్తులు మందిరంలో భవానీమాత, సేవాలాల్ మహరాజును దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు జరిపారు. దీంతో బల్కంచెల్క తండాలో భక్తిపారవశ్యం నెలకోంది. కార్యక్రమంలో తండా ప్రముఖులు రాములు, రూప్సింగ్, శంకర్, అమ్రనాయక్, కిషన్, మన్మోన్నాయక్ పాల్గొన్నారు. -
ప్రమాదకరంగా నల్లవాగు కట్ట
విపరీతంగా పెరిగిన పిచ్చి మొక్కలు కల్హేర్: నల్లవాగు పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ప్రాజెక్టు కట్టపై తుమ్మ చెట్లు, వివిధ చెట్లు దట్టంగా పెరిగాయి. దీంతో ప్రాజెక్టు కట్టకు ప్రమాదం పొంచి ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క గండ్లు, బుంగలు పడి ప్రాజెక్టుకు సంబంధించిన కాల్వలు దెబ్బతినడంతో శిథిలవంతంగా తయారయ్యయి. తూములు, సైఫాన్లు, షట్టర్లు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టు కింది భాగంలో ఎమార్జెన్సీ కెనాల్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. నల్లవాగు ప్రాజెక్టు పట్ల నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు బాగు గురించి పట్టించుకోకపోవడంతో కట్టపై చెట్లు పెరిగాయని చెపుతున్నారు. కల్హేర్ మండలంలోని సుల్తానాబాద్ వద్ద 1967లో రూ. 98లక్షలతో నల్లవాగు ప్రాజెక్టు నిర్మించారు.అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడి, నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిధ్ధారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. కుడి కాల్వ పరిధిలో సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, మార్డి, ఖానాపూర్(కె), కష్ణాపూర్, ఇందిరానగర్, కల్హేర్ వరకు 4,100ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ పరిధిలో బోక్కస్‌గాం, అంతర్గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్ గ్రామల్లో 1,230 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. నల్లవాగు కాల్వలను ఆధునీకరించేందుకు 200910లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.14.19కోట్లు మంజూరు చేశారు. పనుల్లో నాణ్యత లోపంతో సిమెంట్ కట్టడాలు బీటలువారాయి. కాల్వల మధ్య పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. ఇటివలే రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించి నల్లవాగు ప్రాజెక్టు రూపురేఖలు మారుస్తామని ప్రకటించారు. కట్టపై ఉన్న చెట్లను తోలగించాలని రైతన్నలు అధికారులను కోరుతున్నారు. ఈ విషయన్ని నీటి పారుదల శాఖ ఈఈ రాములుతో ప్రస్తవించగా కట్టపై పెరిగిన చెట్లను వెంటనే తోలగిస్తామని తెలిపారు. -
జలకళ సంతరించుకున్న నల్లవాగు ప్రాజెక్టు
కార్యరూపం దాల్చని వృథా నీటి మళ్లింపు పనులు శిథిలమైన కాల్వలు, తూములు సాగుపై రైతుల్లో మోదం.. ఖేదం కల్హేర్: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు కింది ఆయకట్టు రైతుల్లో ‘ఖరీఫ్’ ఆశలు మొలకెత్తాయి. నల్లవాగు ఎగువ భాగంలోని కర్ణాటక రాష్ట్రం, కంగ్టి మండలంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. ఈక్రమంలో ఆలస్యంగా వర్షాలు పడడంతో ఖరీఫ్ సాగు కోసం రైతుల పరిస్థితి సందిగ్ధంలో ఉంది. మెజారిటీ శాతం రైతులు వరి సాగు కోసం సన్నద్ధంగా కాగా.. మరికొందరు ఇప్పటికే సోయాబీన్, పెసర తదితర పంటలు వేశారు. ప్రాజెక్టు కింద చాలామంది రైతులు సాగుకు దూరంగా ఉన్నారు. ఆలస్యమైన వర్షాలు ఆలస్యంగా పడిన వర్షాల వల్ల ప్రాజెక్టు నిండుతుండటంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. వరి సాగు చేయదలచినవారు సందిగ్ధంలో ఉన్నారు. పెసర పంట చేతకొచ్చాక వరి వేస్తామని కొందరు చెబుతున్నారు. మరో పక్క నల్లవాగు ప్రాజెక్టు కాల్వల దుస్థితి అధ్వానంగా మారింది. ఖరీఫ్‌లో ఆయకట్టు భూములకు సక్రమంగా నీరు సరఫరా జరిగేందుకు దెబ్బతిన్న కాల్వల మరమ్మతులు ముందస్తుగా చేయాల్సి ఉంది. ఇప్పటికే గండ్లు, బుంగలు పడి ప్రాజెక్టు కాల్వలు దెబ్బతిన్నాయి. తూములు, సైఫాన్లు, షట్టర్లు పాడయ్యాయి. ప్రాజెక్టు కింది భాగంలో ఎమర్జెన్సీ కెనాల్ పూర్తిగా ధ్వంసమైంది. దివంగత సీఎం వైఎస్ ఆధ్వర్యంలో... నల్లవాగు కాల్వలను ఆధునీకరణకు 2009–10లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.14.19 కోట్లు మంజూరు చేశారు. పనుల్లో నాణ్యత లోపంతో సిమెంట్ కట్టడాలు బీటలువారాయి. కాల్వల మధ్య పిచ్చి మొక్కలు మొలిచాయి. దీంతో చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈనేపథ్యంలో ఆయకట్టు కింది రైతులు బోర్లు తవ్వుకుంటున్నారు. నల్లవాగు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు ముందు కాల్వలను బాగు చేయాలని వారంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవలే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించి నల్లవాగు ప్రాజెక్టు రూపురేఖలు మారుస్తామని ప్రకటించారు. దీంతో ఆయకట్టు కింది రైతుల్లో ఆశలు చిగురించాయి. ఖరీఫ్ సాగు కోసం కాల్వలను తక్షణమే బాగుచేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు. పెరుగుతున్న నీటిమట్టం నల్లవాగు ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,493 ఫీట్లు. పూర్తి నీటి నిల్వ 776.13 ఎంసీఎఫ్‌టీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1,488 ఫీట్లు ఉంది. సోమవారం కురిసిన వర్షంతో ఒక అడుగు నీరు చేరింది. నీటి నిల్వ 471.547 ఎంసీఎఫ్‌టీలు ఉందని ప్రాజెక్టు ఏఈ సూర్యకాంత్ తెలిపారు. 453 క్యూసెక్ల వరద నీరు వచ్చిందని, మరో 5 అడుగులు చేరితే ప్రాజెక్టు నిండి అలుగుపై పొంగే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండితే పోచాపూర్, బీబీపేట, మార్డి, ఖానాపూర్(కె) చెరువులు నిండుతాయి. వాగులు ప్రవహించడంతో బోరుబావుల్లో భూగర్భజలాలు పెరుగుతాయి. తాగు, సాగు నీటి కష్టాలు దూరమవుతాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండాలని బీబీపేట, పోచాపూర్ గ్రామాల రైతులు నల్లవాగు వద్ద కట్ట మైసమ్మకు ప్రత్యేకంగా పూజలు చేశారు. 5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు కలే్హర్ మండలంలోని సుల్తానాబాద్ వద్ద 1967లో రూ.98 లక్షలతో నల్లవాగు ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడి, నీటి పారుదలశాఖ మంత్రి శీలం సిద్దారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. కుడి కాల్వ పరిధిలో సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, మార్డి, ఖానాపూర్(కె), కృష్ణాపూర్, ఇందిరానగర్, కలే్హర్ వరకు 4,100 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ పరిధిలో బోక్కస్‌గాం, అంతర్గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్ గ్రామాల్లో 1,230 ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వల ఆధునీకరణ జరగడంతో ఇక కష్టాలు తీరినట్టే అని భావించిన ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆధునికీకరణ చేసి రెండేళ్లు గడిచాయో లేదో పాత పరిస్థితి తలెత్తింది. చివరి ఆయకట్టు పరిధిలోని మార్డి, ఇందిరానగర్, కల్హేర్ గ్రామల్లోS రైతుల కష్టాలు యథావిధిగానే ఉన్నాయి. పేరుకున్న పూడిక నల్లవాగు ప్రాజెక్టులో ఏటా పూడిక పేరుకుపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నీటినిల్వ తగ్గుతోంది. పూడిక ఎంత మేరకు ఉందో గుర్తించేందుకు అధికారులు 5 ఏళ్ల క్రితం హైడ్రాలాజికల్ సర్వే జరిపినా పురోగతి లేదు. నల్లవాగు ప్రాజెక్టు నిండిన ప్రతిసారి అలుగుపై నుంచి నీరు పొర్లుతోంది. వృథానీటికి అడ్డుకట్ట వేసేందుకు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో సర్వే నిర్వహించారు. నల్లవాగు నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులో మళ్లించాలని అప్పట్లో అధికారులు ప్రభుత్వానికి రూ.98 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వైఎస్ఆర్ ఆకస్మిక మరణంతో ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. వృథా నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మళ్లిస్తే కలే్హర్ మండలంలోని చెరువులు, కుంటలు నిండి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని అన్నదాతలకు లాభం చేకూరుతుంది. -
అకాల వర్షం
కల్హేర్, న్యూస్‌లైన్: జిల్లాలో శుక్రవారం అకాల వర్షం కురిసింది. దీంతో ప లుచోట్ల పంటకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా చెట్లు నేల వాలాయి. కల్హేర్ మండలంలో వడగండ్ల వర్షం కురిసింది. అదేవిధంగా ఈదురుగాలులు వీచాయి. ఉరుములు మెరుపులతో వర్షం కురువడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో కరెంట్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఇదిలాఉండగా గురువారం రాత్రి కురిసిన వర్షానికి కల్హేర్, మార్డి చోట్ల పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, గోధుమ పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లపై చెట్లు విరిగి పడ్డాయి. వర్షంతో పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖేడ్‌లో గంటపాటు.. నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలో శుక్రవారం సా యంత్రం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. సాయంత్రం వేళ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో పాటు గంట సే పు వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. ఈదురుగాలులతో కూడిన వర్షంతో విద్యు త్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. చల్లబడిన వాతావరణం మెదక్ మున్సిపాలిటీ: మెదక్‌లో శుక్రవారం సాయంత్రం కురి సిన చిరుజల్లులతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపం చూపగా, సా యంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఐదు గంటలకే చీకట్లు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో రాత్రి ఓ మో స్తారు వర్షం కురిసింది. కాగా వేసవి సమీపిస్తున్న తరుణంలో కురుస్తున్న వర్షం వల్ల మరింతగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దుబ్బాకలో చిరుజల్లులు దుబ్బాక: దుబ్బాకలో చిరు జల్లులతో కూడిన వర్షం కురిసిం ది. గురువారం రాత్రి ఈదురు గాలులతో పాటు చిన్నపాటి వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం కూడా చిరుజల్లు లు కురిశాయి. అయితే గత ఐదు రోజులుగా ఈదురు గాలు లు వీస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా గే వర్షాలు కురిస్తే మామిడి, ఇతర పంటలు దెబ్బతినే పరిస్థితి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్థం చేస్తున్నారు. కురిసింది వాన జహీరాబాద్ టౌన్: జహీరాబాద్‌లో శుక్రవారం రాత్రి వర్షం కురిసింది. సాయంత్రం సన్నని జల్లులతో ప్రాంభమైన వాన ఆ తరువాత ఉరుములు, మెరుపులతో ఓ మోస్తారుగా కురి సింది. దీంతో పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. ప్రధానంగా బ్లాక్ రోడ్డుతో పాటు జాతీయరహదారిపై బాగారెడ్డి విగ్రహాం వద్ద నీరు నిలిచిపోయింది. సుభాష్‌గంజ్ తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు వచ్చిచేరింది. గురువారం రాత్రి కూడా సన్నని జల్లులు పడ్డాయి. ఎగిరిన రేకులు న్యాల్కల్, న్యూస్‌లైన్: మండలంలో శుక్రవారం రాత్రి వడగండ్ల వాన కురిసింది. దీంతో పలు గ్రామాల్లో ఇంటి పైకప్పు లు ఎగిరిపోయాయి. అదేవిధంగా మండల పరిధిలోని హుస్సెళ్లి గ్రామ సమీపంలో గిరిజనులు వేసుకున్న గుడిసెలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాల య్యాయి. కర్నాటక రాష్ట్రం జబ్గి గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు గ్రామంలో చెరకు నరకడానికి వచ్చారు. గ్రామ సమీపంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఉన్నట్లుండి గాలి వాన రావడం, గుడిసెలు కొట్టుకపోవడంతో పప్పు, బియ్యం ఇతర సామగ్రి కూడా పూర్తిగా పాడైపోయాయి. అంతే కాకుండా కమలాబాయి చేయి విరిగి పోగా చెట్టు కొమ్మ విరిగి మీదపడిన సంఘటనలో రెండేళ్ల బాలునితోపాటు మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యా యి. ఉన్నట్లుండి ఒకే సారి గాలితో కూడిన వడగండ్ల వాన రావడంతో గిరిజనులు భయందోళనకు గురై పరుగులు తీశా రు. వారు పూర్తి నిరాశ్రయులు కావడంతో గ్రామానికి చెంది న ఎండీ అఫీజ్,ఎండీ.మైపూజ్ మాస్టార్ వారికి స్థానిక పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. అంతే కాకుండా వారికి బియ్యం ఇతర వస్తువులు అందజేశారు. -
భక్త జన సంద్రం.. మల్లన్న గుట్ట
కల్హేర్,న్యూస్‌లైన్: మాసాన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దేవునిపల్లి శివారులోని మల్లన్న జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి సంగారెడ్డి-నాందేడ్ ప్రధాన రహదారి పక్కనే దేవునిపల్లి గ్రామ శివారులో గుట్టపై వెలసిన మల్లన్న దేవుని జాతర ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేవునిపల్లి, మాసాన్‌పల్లి, మహదేవుపల్లి, బాచేపల్లి, ఖానాపూర్(బి), రాంరెడ్డిపేట, మీర్ఖాన్పేట, రాపర్తి, కల్హేర్, నిజామాబాద్ జిల్లా ఆరేడ్, అరేపల్లి, వెల్గనూర్, బ్రాహ్మణ్‌పల్లి, తదితర గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో జాతరకు తరలివచ్చి మల్లన్న దేవునికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మల్లన్న జాతరతో ఇక్కడి పరిసరాలు భక్త జన సంద్రంగా మారాయి. గుట్ట పరిసరాల్లో ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడాయి. జాతరలో గిరిజన మహిళల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జాతరకు ముస్లింలు సైతం హాజరై మత సామరాస్యాన్ని చాటారు. జాతర సందర్భంగా పలు దుకాణాలు వెలిశాయి. భక్తులు మిఠాయిలు కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద బారులు తీరారు. మల్లన్న గుట్ట చుట్టూ బండ్ల ఊరేగింపు ప్రదర్శన జరిగింది. జాతరతో పరిసరాల్లో భక్తి పారవశ్యం అలుముకుంది. గుట్టపై ఉన్న మెట్ల ద్వారా మల్లన్న దేవుని వద్దకు చేరేందుకు వృద్ధులు, కొందరు భక్తులు ఇబ్బందులు పడ్డారు.ఈతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాగు నీటి సౌకర్యం కల్పించారు. పెద్దశంకరంపేటకు చెందిన శివకుమార్ జాతరలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్లూరి గోపాల్, మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి గ్రామ ప్రముఖులు నారాయణరావు, సంజీవరెడ్డి, నారాయణ, ఆగంగౌడ్, ద్యావల శ్రీనివాస్, యూత్ బాధ్యులు పాల్గొన్నారు. కల్హేర్,న్యూస్‌లైన్: మాసాన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దేవునిపల్లి శివారులోని మల్లన్న జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి సంగారెడ్డి-నాందేడ్ ప్రధాన రహదారి పక్కనే దేవునిపల్లి గ్రామ శివారులో గుట్టపై వెలసిన మల్లన్న దేవుని జాతర ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేవునిపల్లి, మాసాన్‌పల్లి, మహదేవుపల్లి, బాచేపల్లి, ఖానాపూర్(బి), రాంరెడ్డిపేట, మీర్ఖాన్పేట, రాపర్తి, కల్హేర్, నిజామాబాద్ జిల్లా ఆరేడ్, అరేపల్లి, వెల్గనూర్, బ్రాహ్మణ్‌పల్లి, తదితర గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో జాతరకు తరలివచ్చి మల్లన్న దేవునికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మల్లన్న జాతరతో ఇక్కడి పరిసరాలు భక్త జన సంద్రంగా మారాయి. గుట్ట పరిసరాల్లో ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడాయి. జాతరలో గిరిజన మహిళల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జాతరకు ముస్లింలు సైతం హాజరై మత సామరాస్యాన్ని చాటారు. జాతర సందర్భంగా పలు దుకాణాలు వెలిశాయి. భక్తులు మిఠాయిలు కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద బారులు తీరారు. మల్లన్న గుట్ట చుట్టూ బండ్ల ఊరేగింపు ప్రదర్శన జరిగింది. జాతరతో పరిసరాల్లో భక్తి పారవశ్యం అలుముకుంది. గుట్టపై ఉన్న మెట్ల ద్వారా మల్లన్న దేవుని వద్దకు చేరేందుకు వృద్ధులు, కొందరు భక్తులు ఇబ్బందులు పడ్డారు.ఈతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాగు నీటి సౌకర్యం కల్పించారు. పెద్దశంకరంపేటకు చెందిన శివకుమార్ జాతరలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్లూరి గోపాల్, మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి గ్రామ ప్రముఖులు నారాయణరావు, సంజీవరెడ్డి, నారాయణ, ఆగంగౌడ్, ద్యావల శ్రీనివాస్, యూత్ బాధ్యులు పాల్గొన్నారు. -
కిరికిరి పెడితే మరో ఉద్యమమే..
కల్హేర్, న్యూస్‌లైన్: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ తథ్యమని, ఆపడం ఎవరి వల్లా కాదని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు స్పష్టం చేశారు. ఎలాంటి ఆంక్షలు పెట్టినా, కిరికిరి చేసినా మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. సోమవారం కల్హేర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తల మండల స్థాయి శిక్షణ జరిగింది. ఈ కార్యక్రమానికి కేశవరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలని అన్నారు. ఆత్మ బలిదానాలు, పోరాటల ఫలితంగా తెలంగాణను సాధించుకుంటున్నామని, ప్రత్యేక రాష్ట్రం పునర్నిర్మాణంలో ఎదురయ్యే ఆంక్షల్ని ‘ఉఫ్’అని ఊదేసి తొలగించుకుంటామన్నారు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాదని తెలంగాణలో అధికారం సాధించి ప్రజల బతుకులను చక్కదిద్దుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రజలకు అన్యాయం జరిగితే సహించమని హెచ్చరించ్చారు. రాయలకు నాడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ‘నైనై’ అని, నేడు ‘సైసై’ అంటున్నారన్నరు. మరో మారు వెన్నుపోటు పొడవడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని కేశవరావు మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్, తాను పదవులను సైతం వదులుకుని పోరాటం సాగిస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లడుతూ కిరాయిదారులు, పెట్టుబడిదారులే హైదారాబాద్‌పై హక్కుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిభ్రమించి రెండుకళ్ల సిద్ధాంతం గురించి మాట్లడుతున్నారని ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం పాలకుల అసమర్థతతో నారాయణఖేడ్ ప్రాంతాం అన్ని విధాలుగా వెనుకబడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం.భూపాల్‌రెడ్డి, కల్హేర్, పెద్దశంకరంపేట మండలాల పార్టీ అధ్యక్షులు కృష్ణమూర్తి, విజయరామరాజు, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, సర్పంచ్‌లు దీప్లానాయక్, సిత్కిబాయి, నాయకులు దాడె పండారి, వెంకటేశం సేట్, దిలీప్ కుమార్, నర్సింహాగౌడ్, బేగారి సాయిలు, సంజీవరావు, రాంసింగ్, బ్రహ్మం పాల్గొన్నారు.