- మెదక్, నిజామాబాద్ జిల్లా రైతుల మధ్య ఘర్షణ
- 30 మందికి పైగా గాయాలు
కల్హేర్: నిజాంసాగర్ శిఖం భూమిలో దున్నకం విషయంలో ఇరు జిల్లాలకు చెందిన రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 30 మందికి పైగా రైతులు గాయపడ్డారు. కల్హేర్ మండలం మహదేవ్‌పల్లి గ్రామానికి చెందిన రైతులు నిజాంసాగర్ ప్రాజెక్ట్ 20 క్రాస్టు గేట్ల వద్ద ఉన్న శిఖం భూమిలో పంటలను సాగు చేసేందుకు పలు ట్రాక్టర్లలో తరలివెళ్లారు.
దుక్కి దున్నే సమయంలో సరిహద్దుల విషయమై నిజామాబాద్ జిల్లా ఆరేడ్, ఆరేపల్లి గ్రామాలకు చెందిన రైతుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో పరస్పర దాడుల్లో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఘర్షణలో మహదేవ్‌పల్లికి చెందిన కుంటి బాల్‌సాయి, జి.మంజుల, చీకోటి బాలయ్య, బైండ్ల సుధాకర్, రాజు, జైపాల్, కె.నారాయణ, మాగి వీరయ్య, బి.లక్ష్మయ్య, ఆగమయ్యకు గాయాలయ్యాయి.
వీరితో పాటు నిజామాబాద్ జిల్లా ఆరేడ్, ఆరేపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆరుగురికి కూడా గాయాలయ్యాయి. ఓ ట్రాక్టర్ ధ్వంసమైంది. సంఘటనా స్థలానికి బాన్సువాడ రూరల్ సీఐ వెంకటరమణారెడ్డి, నిజాంసాగర్ ఎస్‌ఐలు చేరుకొని మహదేవ్‌పల్లికి చెందిన 10 ద్విచక్ర వాహనాలను నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మెదక్ జిల్లా రైతులు సిర్గాపూర్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. గాయపడిన నిజామాబాద్ జిల్లా రైతులను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి, మెదక్ జిల్లా రైతులను నారాయఖేడ్ ఆసుపత్రికి తరలించి పోలీసులు విచారణ చేపడుతున్నారు.