పురుగుల మందు తాగిన వ్యక్తిని పైకి లేపుతున్న ఎస్సై
నల్లబెల్లి(నర్సంపేట): ధాన్యం అమ్మి రెండు నెలలవుతున్నా వ్యాపారి డబ్బులు ఇవ్వడం లేదని రైతులు జాతీయ రహదారిపై పురుగుల మందు డబ్బాలతో రాస్తారోకో చేసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండల పరిధిలో జరిగింది. మండలంలోని నారక్కపేట గ్రామానికి చెందిన వ్యాపారి తిప్పని కిరిటి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లి, బయ్యారం, గుండెంగ, మదనపూర్ గ్రామాలకు చెందిన రైతులు నుంచి ధాన్యం కొనుగోలు చేశాడు. సుమారు రూ.1.30 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా డొంకతిరుగుడుగా వ్యవహరిస్తున్నాడు. రెండు నెలలుగా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. కాగా మార్చి 14వ తేదీన నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌లో వ్యాపారిపై బాధిత రైతులు ఫిర్యాదు చేశారు.
కాగా ఇప్పటి వరకు వ్యాపారికి సంబంధించిన సమాచారం అందలేదు. కాగా మంగళవారం మండలంలోని శనిగరం క్రాస్ రోడ్డులోని జాతీయ రహదారిపై పురుగుల మందు డబ్బాలతో రాస్తారోకో చేసి ధాన్యం వ్యాపారి నుంచి తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అక్కడకు చేరుకున్న ఎస్సై హరికృష్ణ రాస్తారోకో విరమించాలని కోరుతుండగా ఆందోళనకు గురైన పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన బైరబోయిన వీరస్వామి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గమనించిన ఎస్సై పురుగుల మందు డబ్బాను లాక్కొని వారించారు. చికిత్స నిమిత్తం వెంటనే నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. విచారణ వేగవంతం చేసి రైతులకు న్యాయం చేస్తామని ఎస్సై హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment