ఉల్లిగడ్డలు విక్రయిస్తున్న సర్పంచ్ సిత్కిబాయి
- అటు ప్రజాప్రతినిధులుగా.. ఇటు కూలీలుగా సమర్థం గా బాధ్యతలు
- అధికార పెత్తనానికి పోకుండా సాధారణ జీవితం
- ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు
కల్హేర్: ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులైనప్పటికీ కొందరు శ్రమైక జీవనాన్ని సాగిస్తున్నారు. ఓవైపు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూనే మరోవైపు తమ కుటుంబాలకు చేయూత నిస్తున్నారు. ప్రజాప్రతినిధి అనే అహం లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ అటు గ్రామాల అభివృద్ధికి కృషి చేయడమేగాకుండా కుటుంబ పోషణలో తమవంతు సహకారాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కల్హేర్ మండలంలోని పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు.
మండలంలో 18 పంచాయతీలు, 15 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఐదుగురు సర్పంచ్‌లు, ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు తమ కుటుంబ పోషణకు గాను వ్యవసాయ, కూలీ పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
పెసర పంటపై దృష్టి పెట్టిన సంతోషమ్మ..
బీబీపేట సర్పంచ్ సంతోషమ్మ ప్రస్తుత ఖరీఫ్‌లో పెసర పంట సాగు చేస్తున్నారు. మరో 15 రోజులు గడిస్తే పంట చేతికొస్తుంది. ఈమెకు గ్రామ శివారులో నల్లవాగు ఆయకట్టు కింద రెండు ఎకరాల పొలం ఉంది. సరైన వర్షాలు లేకపోయినా పెసర సాగు చేస్తున్నారు. దళిత వర్గానికి చెందిన ఈమె రిజర్వేషన్ కారణంగా బీబీపేట సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు.
కుటుంబమూ ముఖ్యమేనంటున్న హిరిబాయి
రాపర్తి పంచాయతీ పరిధిలోని అలీఖాన్‌పల్లి తండాకు చెందిన హిరిబాయి రాపర్తి సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. రాపర్తి, మీర్ఖాన్‌పేట, అలీఖాన్‌పల్లి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సర్పంచ్‌గా కొనసాగుతూనే కుటుంబ నిర్వహణకు గాను సొంత పనులు చేసుకుంటున్నారు. వ్యవసాయ పనులతోపాటు ఉపాధి హామీ పథకం కింద కూలీ పనులు చేస్తున్నారు.
రాపర్తిలో ఇటీవలే 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణం జరిగింది. వీటి ఏర్పాటులో ఈమె ఎంతో చొరవ చూపారు. పదవి ఉందని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేమని చెబుతున్నారు హిరిబాయి. సొంత పనులు కూడా చేసుకుంటేనే ప్రతిఫలం దక్కుతుందని చెబుతున్నారు.
మాదవ్వ సొంత పొలంలో పనులు...
మాదవ్వ పెద్దముబారక్‌పూర్ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. పెద్దముబారక్‌పూర్, చిన్న ముబారక్‌పూర్ గ్రామాలకు ప్రథమ పౌరులు అయినప్పటికీ గ్రామ అభివృద్ధితోపాటు కుటుంబ సంక్షేమంపై దృష్టిపెట్టారు. వృద్ధాప్యంలో ఉన్నప్పటకీ ఈమె సొంత వ్యవసాయ పనులు చేస్తుంటారు. పనులు చేసేందుకు కూలీలు దొరకని పరిస్థితిలో సొంత పనులు చేసుకునేందుకు వెనుకాడడం లేదు. మాదవ్వ హయంలో పంచాయతీ భవనం, మురికి కాల్వల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి.
వరినాట్ల పనులు..
బాలయ్య బొక్కస్‌గాం సర్పంచ్. ఈయనకు గ్రామ శివారులో రెండు ఎకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉంది. ఎకరం వరకు పెసర సాగులో ఉంది. మరో ఎకరంలో వరి సాగు పనులు మొదలు పెట్టారు. సొంత పొలంలో పనులు చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కూలీల కొరత కారణంగా సొంత పనులు చేసుకోవడంలో తప్పులేదంటున్నారు సర్పంచ్ బాలయ్య. ప్రజాప్రతినిధి హోదా ఉన్నా సొంత పనులను విస్మరించలేమంటున్నారు. రెండు వైపులా దృష్టి సారించి అటు గ్రామానికి ఇటు కుటుంబానికి న్యాయం చేస్తున్నారు.
కుటుంబానికి సహకరిస్తున్న లచ్చవ్వ
పెరుమాండ్ల లచ్చవ్వ కల్హేర్ ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈమె భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. ఎంపీటీసీ సభ్యురాలిగా బాధ్యతాయుతంగా పనిచేస్తూనే మరోవైపు కుటుంబానికి సహకరిస్తున్నారు.
ప్రస్తుతం ఈమె వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. భర్త బాలయ్యతో కలిసి సొంత పొలంలో మొక్కజొన్న, సోయా పంటలు సాగుచేస్తున్నారు. పదవి ఉన్నా లేకపోయినా ఒకేరకంగా ఉండాలని లచ్చవ్వ అభిప్రాయపడుతున్నారు. ఆ ఉద్దేశంతోనే సొంత పనులను కూడా చేపడుతున్నారు.
అహం వీడి.. సాధారణ జీవితం...
అంతర్‌గాం ఎంపీటీసీ సభ్యురాలిగా లాలవ్వ పనిచేస్తున్నారు. వృద్ధాప్యంలోనూ ఈమె ఓవైపు ప్రజాప్రతినిధిగా మరోవైపు కుటుంబానికి చేయూతనిస్తున్నారు. వయస్సుమీద పడుతున్నా శరీరం సహకరిస్తున్న మేరకు ఇంటి పనులు చేపడుతున్నారు. ఎంపీటీసీ సభ్యురాలిని అనే అహం లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
అందరితో కలుపుగోలుగా ఉంటూ ఇంటి పనులు కూడా చేసుకుంటున్నారు. సొంత పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. అంతర్‌గాం, పెద్దముబారక్‌పూర్ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. లాలవ్వ కృషీ మేరకు అంతర్‌గాంలో పంచాయతీ భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
ఉపాధిహామీ పనుల్లో కీలకం
మిరిబాయి రాపర్తి ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఎంపీటీసీ సభ్యురాలైనప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. గ్రామంలో జరిగే ఉపాధి హామీ పనుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ పరిధిలోని అలీఖాన్‌పల్లిలో భర్త తావుర్యానాయక్‌తో కలిసి స్వయంగా ఉపాధి పనులు చేస్తూ తోటి కూలీల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. కూలీలకు అండగా ఉంటూ పనులు కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నారు. దానికి తోడు వ్యవసాయ పనులు, ఇతర పనులతో ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు.