కాల సర్పాలై..కాటేస్తున్న విద్యుత్ తీగలు
♦ అడుగడుగునా ఆపదే
♦ ఈ ఏడాది 245 మంది మృత్యువాత
♦ దాదాపు 4.5 లక్షల కిలోమీటర్ల
♦ మేర వేలాడుతున్న విద్యుత్తు తీగలు
♦ వేలాడే వైర్లు, ఎర్తింగ్‌లోపాలు,
♦ రక్షణలేని ట్రాన్స్‌పార్మర్లే అధికం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిశీధి వేళ వెలుగులు చిమ్మాల్సిన కరెంటు.. డొంక ‘దారి కాచి’ కాలనాగై కాటేస్తోంది. పచ్చని సంసారాల్లో కార్చిచ్చును రేపుతోంది. ఏళ్ల కేళ్లుగా ఆలనా పాలనా లేక గాలికి వదిలేసిన విద్యుత్తు తీగలు ఇళ్ల మీద, ఊరు బయట, పంట పొలాల్లో సిబ్బి తీగల్లా అల్లుకుపోయి కాళ్లకు చుట్టకుంటున్నాయి. జిల్లాలో ఏడాదికి సగటున 245 మంది విద్యుత్తు కాటుకు బలైపోతున్నారు. ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనో.. అనంతర కాలంలోనో బిగించిన విద్యుత్తు లైన్లను మళ్లీ ఇప్పటి వరకు పునరుద్ధరించకపోవటంతో నిత్యం ఏదో ఒక చోట అమాయకులను బలి తీసుకుంటూనే ఉన్నాయి.
దేగుల్ వాడీ తండాలో అర్ధరాత్రి వేళ సంభవించిన విద్యుదాఘాతం సంఘటనతో మెతుకుసీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన అధికారులకు కనువిప్పు కావాలి. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా దిద్దిబాటు చర్యలు చేపట్టాలి. కరెంటు చావులు కొత్త కాదు. జిల్లాలో నిత్యం జరిగే తంతే. కానీ ఎవరికీ పట్టదు. ఎందుకంటే చనిపోతున్నది బక్క రైతులు..బడుగు జీవులు.. గిరిజనులు. వీరి చావులంటే విద్యుత్తు శాఖకు లెక్కేలేదు. స్థానికంగా దొరికే ఏఈనో.. జేఈనో తీగలు వేలాడుతున్నాయి అని అడిగితే ‘ మేమేం చేయాలి.. ముందు నీ కరెంటు బకాయిలు కట్టు’ అనే బెదిరింపులు.
విద్యుత్తు స్తంభం వంగిపోయానా.. కరెంటు తీగలు కిందకు వేలాడుతున్న... ట్రాన్స్ ఫార్మర్ ఫ్యూజ్ పోయినా... ఒక్క లైన్‌మెన్ గాని, హెల్పర్ గాని వచ్చి సహాయం చేయరు. ప్రాణాలను కరెంటు తీగలకు వదిలేసి రైతులే వాటిని రిపేర్ చేసుకోవాలి. కంగ్టి మండలం దెవ్‌లా తండాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమదం విద్యుత్‌శాఖ అధికారుల లోపాలను ఎత్తిచూపుతోంది. రోడ్డుకు అడ్డంగా విద్యుత్ తీగలు వేలాడటం, తండావాసులు పలుమార్లు విద్యుత్ అధికారులకు తెలిపినా దీనిగూర్చి పట్టించుకోక పోవటంతోనే ప్రమాదం జరిగిందని బాధిత గిరిజనులు చెప్పడం గమనార్హం.
ఓ లారీసైతం వైర్లకిందనుంచి వెళ్ళలేని స్థితిలో వైర్లు వేలాడుతున్నా.. విద్యుత్తు అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. వీళ్ల నిర్లక్ష్యానికి 2015-16లో 245 కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి బజారున పడ్డాయి. టీఎస్ ట్రాన్స్‌కో నివేదికల ప్రకారమైతే ఈ లెక్క 112 మాత్రమే. మరణాలు చూపించడంలోనూ మోసమే. ఒక విద్యుత్తు మరణాన్ని ధ్రువీకరించడానికి సవాలక్ష కొర్రీలు. ఇష్టపరిహారం ఇవ్వడానికి రోజుల కొద్ది జాప్యం చేయడం. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 33 మందికి మాత్రమే పరిహారం చెల్లించారు.
జిల్లాలో 3.07 లక్షల కిలోమీటర్లలో ఎల్‌టీ లైన్, 1.32 లక్షల కిలో మీటర్లలో 11 కేవీ లైన్స్, 19 వేల కిలో మీటర్ల 32 కేవీ లైన్, 158.9 కిలో మీటర్ల హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. ఈ లెక్కన కరెంటు తీగలు సిబ్బి తీగల మాదిరిగా జిల్లాను చుట్టేశాయి. ఇందులో కేవలం 158.9 కిలో మీటర్ల మేరకు ఉన్న హైటెన్షన్ వైర్లు మాత్రమే కాస్తో కూస్తో పతిష్టంగా ఉన్నాయి. మిగిలిన లైన్లు అన్ని కూడా దాదాపు 35 నుంచి 40 ఏళ్ల కిందట వేసిన లైన్లే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ట్రాన్స్‌కో అధికారులు చేసిన సర్వే ప్రకారం ఎల్‌టీ, 11కేవీ, 32 కేవీ లైన్ల కాలం తీరిపోయి బాగా సాగినట్టు గుర్తించారు. సాధారణంగా గ్రామాల్లో వేసే విద్యుత్తు లైన్లు 8 మీటర్ల ఎత్తులో, పట్టణ ప్రాంతాల్లో 9 నుంచి 11 మీటర్ల ఎత్తులో లైన్లు ఉండాలి. కానీ ఈ విద్యుత్తు తీగలు నిర్ధిష్ట ఎత్తు నుంచి దాదాపు మూడు నుంచి 6 మీటర్ల వరకు సాగి కిందికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వ్యవసాయ క్షేత్రాల్లో భూమికి కేవలం రెండు గజాల దూరంలో వేలాడుతున్న తీగలను కూడా ట్రాన్స్‌కో అధికారులే గుర్తించారు. కాని వాటిని ఇప్పటి వరకు సరి చేయకపోవటం గమనార్హం.
కరెంటు చావుల అడ్డా...
నారాయణఖేడ్ నియోజకవర్గంలో విద్యుత్తు మరణాలు ఎక్కువ. జిల్లాలో ఎక్కడా లేని విధంగా నారాయణఖేడ్ నియోజకవర్గం విద్యుత్‌షాక్‌లకు, విద్యుత్ ప్రమాదాలకు నిలయంగా మారింది. గడిచిన నాలుగేళ్లలో ఇక్కడ దాదాపు 70 మంది మరణించారు.
నర్సాపూర్‌లోనూ అదే తంతు
శివ్వంపేట మండలంలోని అల్లీపూర్‌కు చెందిన సాయిలు సుమారు ఆరు నెలల క్రితం తన ఇంటి బాల్కనీ వద్ద బట్టలు ఆరెస్తుండగా ఇంటిని ఆనుకుని ఉన్న కరెంటు వైర్లు తగిలి షాక్ కొట్టి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆరు నెలలు గడుస్తున్నా ప్రాణం తీసిన వైర్లను అధికారులు ఇంత వరకు సరిచేయకపోవడం గమనార్హం.
జహీరాబాద్‌లో అదే అలజడి
♦ ఏడాది క్రితం సదాశివపేటకు చెందిన అభిలాష్ (25) ఝరాసంగంలోని బంధువు ఇంటికి వచ్చి విద్యుత్ తీగలకు బలయ్యాడు.
♦ మహీంద్రా కాలనీలో విద్యుత్ తీగలు తగిలి ఒక వ్యక్తి మరణించగా, ఒక బాలుడు గాయపడ్డాడు.
♦ కోహీర్ పట్టణ సమీపంలో గత సంవత్సరం ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మరణించాడు.
♦ ఇక మూగజీవాలకు లెక్కేలేదు. మనియార్‌పల్లి మాణిక్యనాయక్ తండాలో ఇళ్ల మధ్యన ఉన్న ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మకు తగులుకొని ఏడు, బిలాల్‌పూర్ గ్రామ శివారులో మూడు, కోహీర్ పట్టణ పరిధిలో మూడు, కవేలి సమీపంలో రెండు, రాజనెల్లి సమీపంలో విద్యుత్ తీగెలకు తగులుకొని ఒక పశువు మరణించింది.
♦ న్యాల్‌కల్ మండలంలోని గుంజోటి, మల్గి, చాల్కి, తాటిపల్లి, శంశల్లాపూర్, హూసెళ్లి, గణేష్‌పూర్ గ్రామాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వాటిని పైకి లేపి సరి చేసే విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదు.
‘ఆందోళ’నలోనే ..
అందోలు నియోజకవర్గం పరిధిలోని అందోలు, రాయికోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, మునిపల్లి, పుల్కల్ మండలాల్లో విద్యుత్ తీగలు తెగిపడి పోవడం వల్ల కొన్ని చోట్ల మనుషుల ప్రాణానికి నష్టం కలుగగా, మరికొన్ని చోట్ల మూగ జీవాలు మృత్యువాతకు గురయ్యాయి. అందోలు మండలంలోని సాయిబాన్‌పేట, రాయికోడ్ మండలంలో ఒక ఆపరేటర్, పుల్కల్ మండలం ఇసోజిపేట గ్రామాల్లో తెగిపడిన విద్యుత్ తీగలకు బలయ్యారు. అందోలు, పుల్కల్, రాయికోడ్, మునిపల్లి ప్రాంతాల్లో సుమారు 50 పశువులు కరెంటు షాక్‌తో అక్కడికక్కడే మరణించాయి.