భర్త మోసం చేశాడని భార్య ఆందోళన | Darna | Sakshi
Sakshi News home page

భర్త మోసం చేశాడని భార్య ఆందోళన

Jul 29 2016 10:32 AM | Updated on Sep 4 2017 6:46 AM

భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తున్న దృశ్యం

భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తున్న దృశ్యం

23 రోజుల వ్యవధిలో ఇద్దరిని పెళ్లాడిన యువకుడు

23 రోజుల వ్యవధిలో ఇద్దరిని పెళ్లాడిన యువకుడు
విషయం వెలుగులోకి వచ్చి ఓ భార్య ఆందోళన
రంగంలోకి దిగిన పోలీసులు

శ్రీకాకుళం సిటీ: ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు.. పెళ్లి చేసుకొని జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటానని ఓ యువతిని నమ్మించాడు. పెద్దవాళ్లు ఎవరూ లేరని చెప్పి ఆ యువతికి గుడిలో మూడు ముళ్లు వేశాడు. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేశాడు. పెళ్లయిన 23 రోజులకే మరో పెళ్లి చేసుకున్నాడు. ఎవరికీ అనుమానం కలగకుండా ఈ మూడు నెలలల్లో నాలుగు ఇళ్లు మార్చాడు. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఆ యువతి చివరికి తనకు న్యాయం  చేయాలని భర్త ఇంటి ముందు గురువారం ఆందోళన చేసింది. వివరాల్లోకి వెళ్తే... నగరంలోని నానుబాలవీధికి చెందిన లొట్ల కళ్యాణి, ఎల్‌.వెంకటరమణ అన్నాచెళ్లెళ్లు. వీరికి తల్లిదండ్రులు లేరు. వెంకటరమణ  ఓ షాపులో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కల్యాణి బీఎస్సీ కంప్యూటర్స్‌ వరకు చదువుకుని ఓ ఫెక్లీ షాపులో పని చేస్తోంది. ఈ క్రమంలో స్థానిక రెల్లివీధి దరి నివాసం ఉంటున్న వి.దుర్గాప్రసాద్‌ కల్యాణిని ప్రేమిస్తున్నానంటూ ఆరు నెలలుగా వెంటపడడం ప్రారంభించాడు. తాను ఓ హోటల్‌లో హెల్పర్‌గా పని చేస్తున్నానని, తాను ఒంటరిగా ఉంటున్నానని, తల్లి ఉన్నా తన సంరక్షణ బాధ్యతలను ఏనాడు చూడలేదని నమ్మించాడు. పెళ్లికి ఇరువైపులా పెద్దవాళ్లు ఎవరూ లేకపోవడంతో స్థానిక కమ్యూనిస్టు పార్టీకి చెందిన కొందరి సహాయంతో ఈ ఏడాది మార్చి 3వ తేదీన పాలకొండ శివాలయంలో పెళ్లి చేసుకున్నాడు. 
 
పెళ్లయిన 23 రోజులకే...
పెళ్లయిన 23 రోజులకే మరో పెళ్లికి సిద్దపడ్డాడు దుర్గాప్రసాద్‌. అదే నెలలో 26వ తేదీ రాత్రి 1 గంటకు నగరంలో ఓ ఆలయంలో హిరమండలానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే ఇద్దరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు నగరంలో ఇద్దరికి వేర్వేరు చోట్ల  ఇళ్లు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో  కొంత కాలంగా తనను పట్టించుకోకపోవడం, ఇంటికి రావడం మానేసిన దుర్గాప్రసాద్‌పై కల్యాణి అనుమానం వ్యక్తం చేయడమే కాకుండా స్థానిక మహిళా పోలీస్‌ స్టేషన్‌లో తన భర్త దుర్గాప్రసాద్‌ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నగరంలో దుర్గాప్రసాద్‌ తన తల్లి ఇంటివద్ద ఉంటున్నాడన్న  సమాచారం మేరకు గురువారం కల్యాణి  తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి వద్ద  ఆందోళనకు దిగింది. ఇరు కుటుంబాల మధ్య  చాలాసేపు వాగ్వివాదం చోటుచేసుకోగా, విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు దుర్గాప్రసాద్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చారు. బాధితురాలి కల్యాణి నుంచి లిఖిత పూర్వకంగా వివరాలను తీసుకున్నారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement