అరెస్ట్‌లకు నిరసనగా ధర్నా
-
శిరోముండనం కేసులో పీపీని తిరిగి నియమించాలి
-
దళిత సంఘాల డిమాండ్
కాకినాడ సిటీ :
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) జవహర్ అలీని తొలగించడం తగదని సోమవారం దళిత సంఘాలు, వామపక్షాలు ఉమ్మడిగా చేపట్టిన కలెక్టరేట్ ఆందోళనలో అక్రమ అరెస్ట్‌లు నిరసిస్తూ మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ ఉద్యమ సీనియర్‌నేత అయితాబత్తుల రామేశ్వరరావు, యునైటెడ్ ఎస్సీ, ఎస్టీ ఫోరం అధ్యక్షుడు గుడాల కృష్ణ మాట్లాడుతూ శిరోముండనం కేసులో 20 సంవత్సరాల తరువాత వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో పీపీని మారుస్తూ జీఓ ఇవ్వడం కేసును నీరుగార్చడానికేనన్నారు. దీనికి నిరసనగా పాత పీపీనే పునర్నియమించాలని దళిత, వామపక్షాలు ఉమ్మడిగా శాంతియుతంగా ర్యాలీ, ధర్నా తలపెట్టామన్నారు. దీనిపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి, అక్రమంగా అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు. కొంతమంది దళిత ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను వేనుకేసుకురావడం కంచె చేను మేసినట్టుగా ఉందన్నారు. అరెస్ట్‌లు, నిర్బంధాలతో ఉద్యమాలు ఆగవని పాలకులు గుర్తించాలన్నారు. వెంకటాయపాలెం దళితులకు న్యాయం జరిగే వరకూ దళిత, ప్రజా సంఘాలు, వామపక్షాలు అండగా ఉంటాయన్నారు. ఐఎఫ్‌టీయూ నాయకులు జె.వెంకటేశ్వర్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వేణుగోపాల్, దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, మాల మహానాడు నాయకులు తాడి బాబ్జి మద్దతుగా మాట్లాడారు. కేవీపీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు మోతా కృష్ణమూర్తి, మెల్లిమి డేవిడ్‌రాజు, మాజీ జెడ్పీటీసీ బంగారు శివ, ఐద్వా నాయకులు భవాని, సుభాషిణి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.