నారాయణ విద్యా సంస్థల్లో మరణ మృదంగం | deaths in narayana educational institutions | Sakshi
Sakshi News home page

నారాయణ విద్యా సంస్థల్లో మరణ మృదంగం

Published Wed, Aug 19 2015 1:50 AM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM

నారాయణ విద్యా సంస్థల్లో మరణ మృదంగం - Sakshi

నారాయణ విద్యా సంస్థల్లో మరణ మృదంగం

⇒ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు
⇒  చంద్రబాబు 15 నెలల పాలనలో 11 మంది విద్యార్థులు మృతి
⇒ ఆ విద్యాసంస్థల అకృత్యాలను ఎందుకు నియంత్రించరని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
⇒  నారాయణ’లో బాబు భాగస్వామి కాబట్టే చర్యలు లేవు
⇒ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న
⇒ మంత్రి నారాయణను అరెస్టు చేయండి
⇒  ఇంటర్‌లో చేరిన మూడు నెలలకే తనువు చాలించిన అభం శుభం ఎరుగని ఇద్దరు విద్యార్థినులు
⇒  మృతదేహాలను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ అధినేత
⇒ మనీషా, నందినీల మృతిపై సిట్టింగ్ జడ్జితో  జ్యుడీషియల్ విచారణ  జరిపించాలని డిమాండ్
⇒నేడు కడప నగరంలో బంద్‌కు పిలుపు

 సాక్షి ప్రతినిధి, కడప: చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారాయణ విద్యాసంస్థల్లో వరుసగా విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు... నిర్దాక్షిణ్యంగా విద్యార్థుల ఊపిరి తీస్తున్నారు.. 15 నెలల చంద్రబాబు పాలనలో 11 మంది విద్యార్థులు ఆ సంస్థల్లో అర్ధంతరంగా చనిపోయినా ఎలాంటి చర్యల్లేవు.. దీనికి కారణం నారాయణ విద్యా సంస్థల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు భాగస్వామ్యం ఉండడమేనని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని కాలేజీలకు, యూనివర్సిటీలకు విద్యార్థినులను పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడేలా చేస్తున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కడప నగర శివారులోని నారాయణ జూనియర్ బాలికల కళాశాల హాస్టల్‌లో సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న నందిని(16), మనీషా(16) అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినుల మృతదేహాలను మంగళవారం ఆయన రిమ్స్ మార్చురీలో పరిశీలించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల యాజమాన్యం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మృతుల బంధువులతో కలిసి మార్చురీ వద్ద బైఠాయించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
 చంద్రబాబు కన్నెత్తి చూడనేలేదు...
 ‘సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. 6.30 గంటల వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలోనే ఉన్నారు. సమీక్ష సమావేశాలు పెట్టారు. అయినా, ఈ విషయం ఆయనకు తెలియదంటే నమ్మాలా..’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. సీఎం విద్యార్థినుల మృతదేహాలను సందర్శించలేదు, తల్లిదండ్రులను పరామర్శించలేదు, ఇటువైపు కన్నెత్తి చూడనేలేదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 15 నెలలుగా నారాయణ విద్యా సంస్థల్లో అనంతపురంలో ఒకరు, తిరుపతిలో ఇద్దరు, నెల్లూరులో నలుగురు, కర్నూలులో ఒకరు, కడపలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు.. మొత్తం 11 మంది విద్యార్థులు చనిపోయారని తెలిపారు. ‘వారిలో తొమ్మిది మంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలున్నారు. ఇంత మంది చనిపోతున్నా ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు.. వేరే కళాశాలల్లో చనిపోతే సీఎం ఇలానే గమ్మున ఉంటారా? చంద్రబాబు.. నారాయణ కళాశాలల్లో భాగస్వామి కావడంతోనే చూసీ చూడనట్లు ఉన్నారని ఆయన ఆరోపించారు.

 నారాయణ స్కూళ్లను విస్తరించాలనే..
 ‘అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం, ఇవ్వలేకపోతే రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తా’ అని ఎన్నికల్లో చెప్పారు. ఇంటికో ఉద్యోగం లేదు.. నిరుద్యోగభృతీ లేదు. కానీ, కళాశాలల్లో విద్యార్థుల్ని చంపేసే పరిస్థితి. చంపేసే వారికే మద్దతు ఇస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి మృతి చెందింది. ఆమె మృతికి కారకులైన అసలు దోషులను ఇంతవరకూ అరెస్టు చేయనేలేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘గ్రామాల్లో మూడు కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ పాఠశాల ఉంటే ఎనిమిది కిలోమీటర్లకు కుదిస్తూ మిగతావి మూసేస్తున్నారు. నగరాలు, జిల్లా కేంద్రాల నుంచి గ్రామాలకు నారాయణ పాఠశాలలు విస్తరించాలనే గ్రామీణ పాఠశాలలను మూసి వేస్తున్నారని ఆరోపించారు. నారాయణ కళాశాలల్లో ఎలాంటి అఘాయిత్యాలు చోటుచేసుకున్నా.. ఎంత మంది చనిపోయినా మంత్రి కాబట్టి సీఎం భాగస్వామి కాబట్టి మూత పడవని పేర్కొన్నారు.

 విద్యార్థినుల మృతిపై అభాండాలా?
  ‘అభం శుభం తెలియని ఇద్దరు విద్యార్ణినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజాయితీగా వారి మృతికి కారణాలు వెలికి తీయకుండా లవ్ లెటర్‌ను కొత్తగా పుట్టించారు.. బుద్ది ఉండి మాట్లాడుతున్నారా..’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవే ఆరోపణలతో ఓ మీడియాలో వార్తలు వస్తాయి. తల్లిదండ్రులకు లెటర్ చూపెట్టరు. నారాయణ కాలేజీని కాపాడలనే దృక్పథం మినహా మరొకటి కాదని పేర్కొన్నారు. 10వతరగతి పాస్ అయి మూడు నెలల క్రితం ఇంటర్‌లో చేరిన విద్యార్థినులపై అభాండాలు వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అలా అభాండాలు వేయడం ఎంతవరకూ ధర్మమని ధ్వజమెత్తారు. ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా.. ఇంత దారుణమైన పరిస్థితులు, రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా.. దారుణమైన చంద్రబాబులాంటి రాజకీయ నాయకుడు ఎవరూ ఉండరని వైఎస్ జగన్ విమర్శించారు. విద్యార్థులను కాలేజీ, యూనివర్సిటీలకు పంపాలంటేనే తల్లిదండ్రులు బయపడేలా చేస్తున్నారని ఆయన వాపోయారు.

ఇద్దరూ మెరిట్ స్టూడెంట్లే..

(నందిని.. ఫైల్)       (మనీషా..ఫైల్)

  ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థినులు చదువుల ఒత్తిడికి తట్టుకోలేక చనిపోయారని మరో కారణం చెబుతున్నారని, వాస్తవానికి వారిద్దరూ మెరిట్ విద్యార్థినులని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మాలేపాటి నందిని 10వ తరగతిలో గ్రేడ్ పాయింట్ ఆవరేజి (జీపీఏ) 8 నమోదు చేసిందన్నారు. మనీషా 8.5 జీపీఏ దక్కించుకుందన్నారు. ఇద్దరూ 80 శాతం మార్కులు పొందిన విద్యార్థులని తెలిపారు. 10వ తరగతి పాస్ అయిన మూడు నెలలకే చదువుల ఒత్తిడి కారణంగా చనిపోయారన్నది నమ్మశక్యంగా లేదన్నారు.
 హైదరాబాద్‌లో రీ పోస్టుమార్టమ్ నిర్వహించాలి..
 విద్యార్థుల మృతిపై వాస్తవాలు వెలుగు చూసేందుకు జ్యుడీషియల్ ఎంక్వెయిరీ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో, అవసరమైతే ఇంకా సీబీఐతో ఎంక్వెయిరీ చేయించాలన్నారు. విద్యార్థినుల మృతదేహాలకు రీ పోస్టుమార్టమ్ నిర్వహించాలని, అదీ కూడా హైదరాబాద్‌లో చేయాలని డిమాండ్ చేశారు. వారు ఉరి వేసుకోకమునుపే చనిపోయారా? ఉరి వేసుకున్నాక చనిపోయారా? అని మీడియా ముందే డాక్టర్‌ను అడిగితే సమాధానం లేదని తెలిపారు. తాను వస్తున్నానని తెలుసుకుని.. హడావుడిగా ఆస్పత్రి నుంచి మృతదేహాలను తీసుకెళ్లాలంటూ వారి తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. పిల్లలపై అభాండాలు వేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా నారాయణ సంస్థల యజమాని నారాయణ మంత్రిగా కొనసాగుతూనే ఉంటారు. నారాయణ సంస్థల్ని వెంటనే మూసివేయించి, సంస్థల అధినేత నారాయణను అరెస్టు చేసి వెంటనే జైళ్లో పెట్టాలని డిమాండ్ చేశారు. తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
 నేడు కడప నగరంలో బంద్...
 నారాయణ కళాశాల యాజమాన్యం తీరుకు నిరసనగా బుధవారం కడప నగరంలో స్వచ్ఛందంగా బంద్ పాటించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి వైఎస్సార్‌సీసీ బంద్ పాటించాలన్నారు. మనీషా, నందిని మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకునేందుకు నగర ప్రజలు ఒత్తిడి తేవాలన్నారు. బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎస్‌బీ అంజాద్‌బాషా, కె శ్రీనివాసులు, పి.రవీంద్రనాథరెడ్డి, మేయర్ సురేష్‌బాబు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి ఉన్నారు.
 త్రిసభ్య కమిటీ బూటకం...
 విద్యార్థుల మృతిపై త్రిసభ్య కమిటీ వేస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడం ఓ బూటకమని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యానిపుణులు పేర్కొన్నారు. మంత్రి గంటా కుమారుడికి మంత్రి నారాయణ కుమార్తెతో వివాహం త్వరలో జరగనుందని, ఈ నేపథ్యంలో వియ్యంకుడి సంస్థల్లో జరిగిన ఘటనపై కమిటీ వేయడం హాస్యాస్పదమని ఆరోపించారు. ఆ కమిటీపై విశ్వసనీయత ఎంత ఉంటుందో ఇట్టే అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement