పరపతి లేక.. పట్టించుకోక!
∙ కౌలురైతును కనికరించని బ్యాంకర్లు
∙ ఎక్కడా పంట పెట్టుబడులు దొరకని పరిస్థితి
∙ గుర్తింపుకార్డులివ్వరు.. రుణాలు దొరకవు
కౌలు రైతుకు అన్యాయం జరుగుతున్నా నోరుమెదిపే వారే కరువయ్యారు. ప్రభుత్వ నిర్లిప్తతకు తోడు అధికారులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో కౌలురైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బయట అప్పులు దొరకక.. బ్యాంకర్లు ఇవ్వక అల్లాడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో తల తాకట్టుపెట్టి అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. చివరకు అప్పులపాలై తనువు చాలిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లోని సంక్షేమ çఫలాలు కూడా అందకపోవడంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోలేకపోతున్నారు. అంతేకాకుండా వారికి గుర్తింపు కార్డుల విషయంలోను సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది.
సాక్షి, కడప :కౌలురైతు సంక్షేమం గాల్లో దీపంలా మారింది. వారికి పరపతి దక్కడం లేదు. కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఏం చేయాలో తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేక కృషితోపాటు రైతుల రణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తామన్న బాబు సర్కార్ అధికారం అందగానే అన్నింటిని మర్చిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏవేవో హామీలిచ్చి ఏమీ చేయలేక చేతులెత్తేసింది.. అధికారంలోకి రాక మునుపు ఒకమాట..వచ్చిన తరువాత మరొకమాట చెబుతూ చంద్రబాబు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. కేవలం ఆర్భాటాలే చేస్తున్నారు.
రుణాలు అంతంతమాత్రమే
కౌలురైతుల విషయంలో ఎవరూ కనికరం చూపడం లేదు. ఎందుకంటే వారు పంట పెట్టుకునేందుకు అవసరమైన పెట్టుబడి కూడా దొరకని పరిస్థితుల్లో బ్యాంకులకు వెళ్లినా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. ఏదొక సాకు చూపి తిప్పుకుంటున్నారే తప్ప రుణాలు మం జూరుచేయడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్నేళ్లుగా పొలాల్లో హలం పట్టి వ్యవసాయం చేస్తున్నా.. ఆశించిన మేర దిగుబడులు రావడం లేదు. పైపెచ్చు ప్రభుత్వ ప్రయోజనాలు లేకపోవడం కూడా వారిని కృంగదీస్తోంది. ఇలా అయితే పంటల సాగు కష్టమన్న తరహాలోకి కౌలురైతు వచ్చా డు. జిల్లాలో కౌలుదారులకు 10శాతం రుణాలు కూడా అందించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గుర్తింపుకార్డులు ఇవ్వరు..
ప్రభుత్వం కౌలుదారులకు గుర్తింపుకార్డులు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో 13,550మంది కౌలుదారులు ఉండగా, ఇప్పటివరకు 4,821మందికి మాత్రమే గుర్తిం పుకార్డులు ఇచ్చారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా కౌలురైతులు నరకం అనుభవిస్తున్నారు. కార్డుల క్రమబద్ధీకరణ జరిగితేనే కౌలు రైతుకు ఏదైనా చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే పాతవాళ్లకే చాలామందికి ఇంతవరకు అందివ్వలేదు. దీంతో ఎక్కడికి వెళ్లినా వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయిలో కౌలు రైతులకు భరోసా కల్పించడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపుపత్రంతో బతుకు చిత్రం మారుతుందనే ఆశతో పొలంలోకి అడుగుపెడుతున్నా వారి జీవన ప్రమాణాలు మాత్రం మెరుగుపడడం లేదు. దశాబ్దాలుగా బడుగు జీవుల వ్యథలకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. పరపతి బాసట లేదు....కనీసం అధికారిక గుర్తింపు ఎంతమాత్రం లేదు..భూమి హక్కు మాట పక్కన పెడితేనే మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో కనీస గుర్తింపు లేకుండా కౌలు రైతును ఆదుకునేది ఎలాగో అధికారులే సెలవివ్వాలి!
తనువు చాలిస్తున్న కౌలురైతులు
వ్యవసాయంపై ఆధారపడి నిత్యం కష్టం చేస్తున్నా ఆశించిన మేర ఉత్పత్తులు రాక అన్నదాత దిగాలు చెందుతున్నాడు. పెట్టుబడులు భారీగా పెడుతున్నా దిగుబడులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. దీంతో జిల్లాలో పంటలకు చేసిన అప్పులు తీరక అనేకమంది రైతులు తనువు చాలిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తుందే తప్ప ఆదుకోవడం లేదు. సవాలక్ష ఆంక్షలతో అరకొరగా అందించే ఆర్థికసాయాన్ని కూడా నిబంధనల పేరుతో కొంతమందికే పరిమితం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పంట సాగు చేస్తున్నా కౌలుదారులు గుర్తింపుకార్డులతోపాటు రుణాలు అందక బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆవేదన కలిగిస్తోంది.