మృతుడు ప్రవీణ్ (ఫైల్)
తాను చనిపోతూ....మరికొందరి జీవితాల్లో వెలుగులు
Published Thu, Aug 11 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
– బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందిన ప్రవీణ్
– అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు
– మృతుని అవయవాలు ఇతర రాష్ట్రాలకు
చిగరపల్లె(ఐరాల) : ప్రమాదవశాత్తు తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాడు ఐరాల మండలం చిగరపల్లెకు చెందిన ప్రవీణ్. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి, కుమారి దంపతుల కుమారుడు ప్రవీణ్(37). పూతలపట్టు మండలం అనంతాపురానికి చెందిన భవ్యతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరు గ్రామంలోని ప్రవీణ్ తల్లిదండ్రుల వద్ద నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంటి పరిసరాల్లో తిరుగుతూ ప్రవీణ్ కాలుజారి కిందపడ్డాడు. వెంటనే అతడిని అరగొండ అపోలో ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడా స్పృహలోకి రాలేదు. రెండు రోజుల వరకు చలనం లేకపోవడంతో కుటుంబసభ్యులు అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ గురువారం ఉదయం ప్రవీణ్ మృతి చెందాడు. తల్లిదండ్రులు, భార్య స్పందించారు. మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు. చెన్నై వైద్యులను సంప్రదించి అక్కడే అవయవాలు దానం చేయాలని కోరారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రవీణ్ మృత్యదేహన్ని శుక్రవారం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రవీణ్ గుండెను దిల్లీకి, కాలేయం, కిడ్నీలు, నేత్రాలు ఇతర రాష్ట్రాలకు పంపినున్నట్లు వైద్యులు తెలిపారు.
Advertisement