ఉత్కంఠకు తెర
- పైలా నామినేషన్ ఉపసంహరణ
- ‘స్థానిక’ ఎమ్మెల్సీగా దీపక్‌రెడ్డి ఏకగ్రీవం
అనంతపురం అర్బన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడింది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పైలా నరసింహయ్య వెనక్కి తగ్గారు. ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో టీడీపీ నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. పైలాతో పాటు టీడీపీ డమ్మీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి కూడా శుక్రవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ అభ్యర్థి గుణపాటి దీపక్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన వస్తే డిక్లరేషన్ పత్రాన్ని అందజేస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు.
‘పైలా’ పై క్రమశిక్షణ చర్యలు
పార్టీ అనుమతి లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసి, తర్వాత ఉపసంహరించుకున్న పైలా నరసింహయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నామినేషన్ వేసిన క్రమంలోనూ, అటు తరువాత ఉపసంహరించుకోవడంలోనూ పార్టీ అనుమతిని పైలా తీసుకోలేదని తెలిపారు. నామినేషన్ వేయడంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. కనీసం అందుబాటులోకి రాలేదని వివరించారు. పార్టీ జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పైలాపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని రాష్ట్ర కమిటీ దృష్టికి కూడా తీసుకెళతామని తెలిపారు.