వాకాటి రూ.443.27 కోట్లు బురిడీ
⇒ అయినప్పటికీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్
⇒ ఉన్నత స్థాయి పెద్దల ఒత్తిడితో ఆమోదించిన ఎన్నికల అధికారి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి ఇదో పరాకాష్ట. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాకాటి నారాయణ రెడ్డి నాలుగు బ్యాంకులకు రూ.443.27 కోట్ల రుణం చెల్లించలేదు. బ్యాంకులకు అప్పులు చెల్లించని వారు, ప్రభుత్వానికి పన్నులు కట్టనివారు (డిఫాల్టర్లు) ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. వాకాటి నారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేసినపుడు ఎన్నికల సంఘానికి సమర్పిం చిన అఫిడవిట్‌లో నాలుగు బ్యాంకులకు రుణం చెల్లించని అంశాన్ని ప్రస్తావించలేదు.
నిబంధనల మేరకు ఇతని నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించాలి. కానీ ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి అతని నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించలేదని తెలుస్తోంది. వాకాటి హామీదారుగా ఉండి వీఎన్‌ఆర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్, పవర్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోసీ)ల నుంచి రుణం ఇప్పించారు. రుణం తీసుకున్న ఈ సంస్థలు సకాలంలో తిరిగి చెల్లించలేదు. రూ.443.27 కోట్లు బకాయి పడినట్లు ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, బీవోబీ, ఐవోసీలు తేల్చాయి.