ఎమ్మెల్సీగా వాకాటి నారాయణరెడ్డి ప్రమాణం
అమరావతి: టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వాకాటి నారాయణరెడ్డి సోమవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ చక్రపాణి ఇవాళ ఉదయం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. వాకాటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీడీపీ నేతలు దూరంగా ఉండటంతో ...ఆయన ఒంటరిగానే వచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం వాకాటి మాట్లాడుతూ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని అన్నారు. మళ్లీ టీడీపీ, చంద్రబాబుతో కలిసి పని చేస్తానని, ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు, లోకేశ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు రుణాల చెల్లింపులో జాప్యం జరిగిన మాట వాస్తవమే అని వాకాటి అంగీకరించారు. రుణాలను రీ స్ట్రక్చర్ చేసే అంశంపై ఆలోచిస్తున్నామని రెండు, మూడు నెలల్లో అంతా సర్ధుకుంటుందని ఆయన అన్నారు.
కాగా ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఖర్చుపెట్టి గెలిచిన వాకాటి నారాయణరెడ్డి ఇంటి మీద శుక్రవారం నాడు సీబీఐ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. వివిధ బ్యాంకులకు రూ. 450 కోట్ల మేర బకాయిలు ఉన్న వాకాటి నారాయణరెడ్డి విల్‌ఫుల్ డీఫాల్టర్‌గా ఉన్నారా అనే విషయం గురించి దర్యాప్తు చేసేందుకే సీబీఐ ఈ సోదాలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే టీడీపీ ఎమ‍్మెల్సీగా శత్రుచర్ల విజయరామరాజు కూడా ప్రమణాస్వీకారం చేశారు.