ఇంకా ప్రతిష్టంభనే
బెట్టువీడని మంత్రులు
చంద్రబాబును వెన్నాడుతున్న రెబల్ భయం
తేలని రెండో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక
నేడు మరోసారి సమావేశం కావాలని నిర్ణయం
విశాఖపట్నం: జిల్లా టీడీపీలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పీటముడి మరింతగా బిగుసుకుంటోంది. మంత్రులు ఇద్దరూ ఎవరికివారు తమ పంతమే నెగ్గాలని పట్టుదలకు పోవడంతో వ్యవహారం సంక్లిష్టంగా మారింది. సీఎం చంద్రబాబు వరుసగా రెండో రోజు శుక్రవారం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిపిన సమావేశంలో కూడా తుది నిర్ణయం తీసుకోలేకపోయారు. రెండో ఎమ్మెల్సీ స్థానం బీసీకి ఇవ్వాలా?...ఎస్టీకి ఇవ్వాలా అనే దానిపై పీటముడి తెగలేదు. ఎంపిక వ్యవహారం ఏమాత్రం బెడిసికొట్టినా పార్టీ నేత ఎవరైనా స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగొచ్చనే సందేహం కూడా చంద్రబాబును వెంటాడుతోంది. దాంతో మంత్రులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను ఇన్‌చార్జ్ మంత్రి యనమలకు అప్పగించారు. ఆయన మంత్రులు ఇద్దరితో శనివారం ఉదయం సమావేశమై సూత్రప్రాయ నిర్ణయాన్ని ప్రకటిస్తారు.
తమ వర్గీయుడి కోసం మంత్రుల బీసీ మంత్రం
రెండో ఎమ్మెల్సీ పదవిని బీసీ నేతకే ఇవ్వాలని మంత్రులు అయ్యన్న, గంటా కచ్చితంగా చెప్పారు. ఎస్టీ అభ్యర్థికి వద్దని కూడా పట్టుబట్టారు. ఎందుకంటే వారిద్దరూ కూడా ఎవరికివారుగా తమ వర్గీయులకు ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తామని మాట ఇచ్చేశారు. పీలా శ్రీనివాస్‌కుగానీ, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రామానాయుడుకుగానీ ఇవ్వాలని అయ్యన్న పట్టుబడుతున్నారు. కాగా బీసీ వర్గానికే చెందిన బొడ్డేటి కాశీ విశ్వనాథంకు అవకాశం ఇవ్వాలని గంటా కరాఖండిగా చెప్పారు. ఈమేరకు మెజార్టీ ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీతో కూడా ఇదే మాట గట్టిగా చెప్పించారు.
ఎస్టీ నేతకు ఇవ్వాలని భావిస్తున్న అధినేత
గిరిజన నేతకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఏజెన్సీకి సంబంధించి భవిష్యత్‌తో తీసుకోనున్న ‘కీలక’ నిర్ణయాలకు సంబంధించి మార్గం సుగమం చేసుకునేందుకు ఆయన ఎత్తుగడ ఇదీ. ఇందుకోసం మణికుమారి, ఎం.వి.ఎస్. ప్రసాద్‌ల పేర్లు తెరపైకి తెచ్చారు. మణికుమారి కంటే ఎం.వి.ఎస్. ప్రసాద్‌పట్లే ఆయన మొగ్గుచూపుతున్నారు. కానీ మంత్రులు ఇద్దరూ ఇందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. దాంతో శుక్రవారం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సమావేశాన్ని ముగించారు.
వెన్నాడుతున్న రెబల్ భయం
మంత్రులను ఒప్పించకుండా ఏకపక్షంగా రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేయడానికి సీఎం చంద్రబాబు సాహసించలేకపోతున్నారు. అసంతృప్తికి గురైన నేతల్లో ఎవరైనా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మొదటికే మోసం వస్తుందని ఆయన సందేహిస్తున్నారు. ఇప్పటికే రమణమూర్తిరాజు( కన్నబాబు) ఈమేరకు కొంత ప్రాథమిక సన్నాహాలు చేశారన్నది బహిరంగ రహస్యమే. ఆయన కొందరు జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్పీటీసీ సభ్యులతో ‘టచ్’తో ఉన్నారు. మరోవైపు పరిస్థితులు అనుకూలిస్తే జిల్లాలో ఓ ‘వర్గం’ కూడా తమ తరపున స్వతంత్ర అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తోంది. అదే జరిగితే రెండో అభ్యర్థిని గెలిపించుకోవడం టీడీపీకి తలకుమించిన భారమవుతుంది. అందుకే సీఎం చంద్రబాబు ధైర్యంగా అభ్యర్థిని ఎంపిక చేయలేకపోతున్నారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
మంత్రులు ఇద్దర్ని ఒప్పించే బాధ్యతను ఇన్‌చార్జ్ మంత్రి యనమల రామకృష్ణుడికి అప్పగించారు. జిల్లా మంత్రులు అయ్యన్న, గంటా శనివారం ఉదయం సమావేశమైన తరువాతగానీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఓ కొలిక్కి రాదు. అనంతరం మరోసారి యనమల, అయ్యన్న, గంటాలు సీఎం చంద్రబాబుతో సమావేశమవుతారు. అప్పుడే రెండో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవర్నన్నది అధికారికంగా ప్రకటిస్తారు. అంతవరకు జిల్లా టీడీపీలో ఈ సస్పెన్స్ కొనసాగాల్సిందే.