- పౌరసరఫరాల శాఖను తప్పించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కేటాయింపు
- కాలవకు సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణం
- శాఖల కేటాయింపుల్లో ‘అనంత’కు దక్కని ప్రాధాన్యం
- జిల్లా అభివృద్ధికి దోహదం చేసే శాఖలు కాకపోవడంతో మంత్రుల్లో అసంతృప్తి!
- 2004–14 మధ్య కాలంలో జిల్లా మంత్రులకు కీలక పోర్టుఫోలియోలు
(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
కొత్తగా కేబినెట్‌లోకి చేరిన వారితో పాటు పాత మంత్రులకూ ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖలు కేటాయించారు. మంత్రి పరిటాల సునీతకు డిమోషన్ ఇచ్చారు. ఆమె ఇప్పటి వరకూ చూస్తున్న పౌరసరఫరాల శాఖను తప్పించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. అలాగే కొత్తగా మంత్రివర్గంలోకి అడుగుపెట్టిన కాలవ శ్రీనివాసులుకు సమాచార, పౌరసంబంధాల శాఖతో పాటు గ్రామీణ గృహనిర్మాణ శాఖను కేటాయించారు. సమాచార శాఖను ఇదివరకూ పల్లె రఘునాథరెడ్డి చూశారు. ప్రస్తుతం ‘అనంత’ మంత్రులకు కేటాయించిన శాఖలు అంతగా ప్రాధాన్యత లేనివే. ‘అనంత’ లాంటి కరువు జిల్లాకు, పైగా 2014 ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టిన జిల్లాకు చంద్రబాబు కేటాయించిన శాఖలు చూస్తే జిల్లా అభివృద్ధిపై ఆయనకు ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదన్న విషయం ఇట్టే తెలుస్తోందని పలువురు అంటున్నారు.
అనంతపురం జిల్లా తీవ్ర దుర్భిక్ష ప్రాంతం. వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. పారిశ్రామిక అభివృద్ధిలోనూ నిర్లక్ష్యానికి గురైంది. ఇలాంటి జిల్లాపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి. కానీ టీడీపీ ప్రభుత్వం ఈ జిల్లా మంత్రులకు మంచి శాఖలు కేటాయించకుండా ఎప్పుడూ అన్యాయమే చేస్తోంది. 1999–2004 మధ్యకాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒక మంత్రి పదవిని జిల్లాకు కేటాయించారు. నిమ్మల కిష్టప్పను మంత్రిగా చేసి ఏమాత్రమూ ప్రాధాన్యత లేని పశుసంవర్ధక, చేనేత, జౌళిశాఖలను కేటాయించారు. ఆ ఐదేళ్లలో జిల్లా అభివృద్ధికి మంత్రిగా కిష్టప్ప చేసింది, బాధ్యతగా ప్రభుత్వం చేసేందీ ఏమీ లేవు. తీవ్ర కరువుతో జిల్లా వ్యాప్తంగా తినేందుకు తిండిలేక గ్రామీణ ప్రాంత ప్రజలు గంజి కేంద్రాలను ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం జిల్లాకు ఎలాంటి సాయమూ చేయలేదు. ఆపై 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 8 కాంగ్రెస్, 6 టీడీపీ దక్కించుకున్నాయి.
అధికస్థానాలు గెలిపించినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు మంత్రి పదవులను జిల్లాకు కేటాయించి.. కీలకశాఖలను కట్టబెట్టారు. రఘువీరారెడ్డికి వ్యవసాయ శాఖను, జేసీ దివాకర్‌రెడ్డికి పంచాయతీరాజ్ శాఖను ఇచ్చారు. 2009లోనూ వైఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘువీరారెడ్డిని అదేశాఖలో కొనసాగించారు. అనివార్య కారణాలతో జేసీని తప్పించారు. ఆపై రోశయ్య సీఎం అయిన తర్వాత అదే కేబినెట్‌ను కొనసాగించారు. వైఎస్ హయాంలో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సురెన్స్‌తో పాటు వ్యవసాయపరంగా జిల్లాకు మంచి ప్రయోజనం కలిగింది. 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రఘువీరారెడ్డికి రెవెన్యూ శాఖను కేటాయించారు. శైలజానాథ్‌ను కేబినెట్‌లోకి తీసుకుని విద్యాశాఖను ఇచ్చారు.
టీడీపీ హయాంలో మళ్లీ అన్యాయమే..
టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె రఘునాథరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఐటీ శాఖను కేటాయించారు. దీని నిర్వహణలో పల్లె ఘోరంగా విఫలమయ్యారు. జిల్లాకు సంబంధించి ఒక ఎంఓయూ కూడా తీసుకురాలేకపోయారు. సమాచార, పౌరసంబంధాలు, మైనార్టీసంక్షేమ శాఖలు కూడా ‘పల్లె’ వద్దె ఉండేవి. ఆయన పనితీరు బాగోలేకపోవడంతో జిల్లాకు ఎలాంటి ప్రయోజనమూ ఒనగూరలేదు. పరిటాల సునీతకు ఇంతకుముందు పౌరసరఫరాల శాఖ కేటాయించారు. సంక్రాంతి కానుక, రంజాన్‌తోఫా, క్రిస్మస్ కానుకల్లో భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు పలుసార్లు వచ్చాయి.
పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ శాఖ వల్ల జిల్లాకు మేలు కలగడం కంటే వ్యక్తిగతంగా పరిటాల కుటుంబానికి ప్రయోజనం కలిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పరిటాల సునీతకు డిమోషన్ ఇచ్చి స్త్రీ, శిశుసంక్షేమ శాఖను కేటాయించారు. చీఫ్‌విప్ నుంచి మంత్రిగా ప్రమోషన్ పొందిన కాలవ శ్రీనివాసులుకు సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణశాఖ కేటాయించారు. మూడేళ్లలో గృహనిర్మాణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఒక్క ఇల్లూ నిర్మించలేదు. పట్టణ గృహనిర్మాణశాఖ మంత్రి నారాయణ వద్దే ఉంచారు. పోతే సమాచార, పౌరసంబంధాల శాఖ వల్ల కూడా జిల్లాకు ఒరిగేదేమీ లేదు.
‘అనంత’పై తనకు అలివిమాలిన ప్రేమ ఉందని పదేపదే వల్లెవేసే చంద్రబాబు శాఖల కేటాయింపుల్లో మాత్రం మొండిచేయి చూపారని జిల్లాలో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. టీడీపీలో మాత్రం ప్రస్తుత శాఖల కేటాయింపుపై సంతోషం వ్యక్తమవుతోంది. సునీతకు డిమోషన్ ఇవ్వడంతో పరిటాల వ్యతిరేకులు సంబరపడిపోతున్నారు. తమకు కాకుండా కాలవకు మంత్రి పదవి కేటాయించడంపై రగిలిపోతున్న సీనియర్లు.. ఆయనకు కేటాయించిన శాఖలను చూసి ..‘తగినశాస్తి జరిగింది. ఇలాంటి శాఖలు ఉండే మంత్రి పదవి ఉంటే ఎంత? లేకుంటే ఎంత?’ అని తమ సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నారు.
పరిటాలకు డిమోషన్
Published Tue, Apr 4 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
Advertisement
Advertisement