demotion
-
డీఎస్పీకి కానిస్టేబుల్‌గా డిమోషన్.. ఏం జరిగిందంటే!
లక్నో: ఓ మహిళా కానిస్టేబుల్‌తో అనైతిక సంబంధం పెట్టుకోవటం ఓ పోలీసు అధికారికి మాయని మచ్చగా మిగిలింది. అదీకాక, డీఎస్పీ స్థాయి నుంచి ఒక్కసారిగా కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన మూడేళ్ల తర్వాత పోలీసులు ఆయనపై తాజాగా చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. కృపా శంకర్ కన్నౌజియా కానిస్టేబుల్ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయికి కష్టపడి ఎదిగారు. ఆయన 2021లో ఉన్నావ్‌లోని బిఘాపూర్‌లో సర్కిర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో తరచూ కుటుంబ సమస్యల పేరుతో సెలవు పెట్టేవారు. అయితే ఆయన ఇంటికి వెళ్లే బదులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పూర్‌లోని హోటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వ్యక్తిగత, అధికారిక ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో తన భర్త ఇంటికి రాకపోవటం, ఫోన్లు సైతం కలువకపోవడంతో ఆందోళనపడిన ఆయన భార్య జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్పెషల్ టీంలు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా కాన్పూర్‌లోని ఓ హోటల్లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆయన మహిళా కానిస్టేబుల్‌తో ఏకాంతంగా ఉన్న సమయంలో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణకు ఆదేశించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సాయంతో ఆధారాలు సేకరించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సిఫార్సు చేశారు. దీంతో డీఎస్పీగా ఉన్న ఆయన్ను గోరఖ్‌పూర్‌లోని 26వ ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా డిమోషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
మూకుమ్మడిగా పదోన్నతులు రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్. పలువురు చీఫ్ ఇంజనీర్లు డబుల్ డిమోషన్ పొంది డివిజనల్ ఇంజనీర్/ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా మారిపోయారు. మరికొందరు సూపరింటెండింగ్ ఇంజనీర్లు డబుల్ డిమోషన్‌తో అదనపు డివిజనల్ ఇంజనీర్ స్థాయికి పడిపోయారు. దాదాపు 250 మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు గతంలో పొందిన ఒకటి లేదా రెండు పదోన్నతులను కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణ వచ్చాక ఇక్కడి విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చిన అన్ని రకాల పదోన్నతులను మంగళవారం తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్ సంస్థల యాజమాన్యాలు మూకుమ్మడిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల అమల్లో భాగంగా రాష్ట్ర విభజనకు ముందు 2014 జూన్ 1 నాటి సీనియారిటీ జాబితాల ఆధారంగా మళ్లీ కొత్తగా పదోన్నతులు కల్పి స్తూ ఆ వెంటనే వేరే ఉత్తర్వులూ జారీ చేశారు. తెలంగాణ ఉద్యోగులతోపాటు ఏపీ నుంచి వచ్చిన దాదాపు 700 మందితో రూపొందించిన సీనియారిటీ జాబితాను ఇందుకు వినియోగించారు. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో అధిక మంది సీనియర్లే ఉండటంతోపాటు రిజర్వేషన్లకు సంబంధించిన రోస్టర్ పాయింట్లను అమలు చేయడంతో పదోన్నతుల్లో అధిక శాతం ఉన్నతస్థాయి పోస్టులను వారికే కేటాయించినట్టు తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో కొందరు ఉద్యోగులకు డబుల్ ప్రమోషన్లు రాగా, తెలంగాణ వారికి డబుల్ డిమోషన్లు లభించినట్టు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొత్త పదోన్నతుల్లో దాదాపు 250 మంది తెలంగాణ ఇంజనీర్లు, అకౌంట్స్, పీఅండ్‌జీ విభాగాల అధికారులు, ఉద్యోగులు గతంలో పొందిన పదోన్నతులను నష్టపోయారు. సీఈలు ఎస్ఈలు/డీఈలుగా, ఎస్ఈలు డీఈలు/ఏడీఈలుగా, డీఈలు ఏడీఈలు/ఏఈలుగా రివర్షన్లు పొందినట్టు విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. నలుగురు సీఈలు, 30 మందికి పైగా ఎస్ఈలు, 120 మంది డీఈల పదోన్నతులు రద్దైనట్టు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. దీంతోపాటు కొత్త సీనియారిటీ జాబితాల్లో చాలామంది తీవ్రంగా వెనకబడిపోవడంతో మళ్లీ పదోన్నతులు పొందకుండా రిటైర్ కావాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారని సంఘాల నేతలు తెలిపారు. ‘కరెంట్’ రఘుకి డిమోషన్ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్‌గా తెలంగాణ ఉద్యమ కాలంలో చురుకుగా వ్యవహరించిన ‘కరెంట్’ రఘు సైతం ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ (సివిల్) స్థాయి నుంచి రెండు హోదాలు తగ్గి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కొత్త పోస్టింగ్ పొందినట్టు తెలిసింది. నేటి ముట్టడి రద్దు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల పదోన్నతు ల రద్దును, కేంద్రం తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం విద్యుత్ సౌధను ముట్టడిని ఉపసంహరించుకున్నట్టు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శివాజీ తెలిపారు. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగులకు న్యాయం చేస్తామని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళనలను విరమించుకున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. -
సీబీఐ ఏడీ మన్నెం నాగేశ్వరరావుకు డిమోషన్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అదనపు డైరెక్టర్ బాధ్యతల నుంచి మన్నెం నాగేశ్వరరావును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. 1986 ఒడిశా కేడర్‌కు చెందిన ఆయనను అగ్నిమాపక దళ, పౌర రక్షణ, హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నియామకాల కమిటీ సమావేశం జరిగిన కొద్ది గంటల్లోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. సీబీఐతో పోలిస్తే ఫైర్ సర్వీసెస్‌ను తక్కువ కేటగిరీ డిపార్ట్మెంట్గా భావిస్తారు. సీబీఐ అదనపు డైరెక్టర్‌గా ఉన్న ఆయనను అదనపు డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గించినట్లవుతుంది. అంటే ఫైర్ సర్వీసెస్ డీజీ పోస్టు.. సీబీఐలో అదనపు డైరెక్టర్ జనరల్ స్థాయికి సమానమైంది. ఒక రకంగా ఆయనకు ఇది డిమోషన్ లాంటిది. తాజా బదిలీతో ఆయన తన పదవీకాలం ముగిసే(జూలై 31, 2020) వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన ఇదే కేడర్‌లో కొనసాగాల్సి ఉంది. ఇంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వం గత సీబీఐ చీఫ్ అలోక్ వర్మను సైతం ఇదే విధంగా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు బదిలీ చేయగా.. ఆయన ఆ పదవిని తీసుకునేందుకు అప్పట్లో తిరస్కరించారు. నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రెండు సార్లు నియమితులయ్యారు. కాగా నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని జయశంకర్ జిల్లా(ఉమ్మడి వరంగల్) మండపేట మండలం బోర్‌నర్సాపూర్ గ్రామం. 1986 ఒడిశా క్యాడర్‌కు చెందిన నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రెండుసార్లు నియమితులయ్యారు. -
పాలన గాడిన పడేనా..?
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో గాడితప్పిన పాలనను గాడిన పెట్టేందుకు ప్రక్షాళన మొదలైంది. కొన్నేళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నవారిని డిమోషన్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. రెండేళ్లుగా స్మార్ట్‌సిటీ సాధనపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన బల్దియా.. ఉద్యోగులను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సిబ్బంది ఆడిందే ఆటగా నడుస్తోంది. దీనికితోడు పలువురికి రాజకీయ అండదండలు ఉండడంతో ఎక్కడివారక్కడే పాతుకుపోయారు. పనిచేయకున్నా ఫరవాలేదనే పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుని, ఓడీఎఫ్‌గా గుర్తించబడిన నగరపాలక సంస్థలో ఉద్యోగుల పనితీరుపై దృష్టిసారించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడం, సదరు ఉద్యోగులు పలు ఆరోపణలు వంటివి అధికారుల దృష్టికి వచ్చాయి. దీంతో కమిషనర్ శశాంక బల్దియా పాలనను గాడిన పెట్టేందుకు కొరడా ఝుళిపిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఉద్యోగులను డిమోషన్ చేసి, కంప్యూటర్ ఆపరేటర్లను అంతర్గత బదిలీలు చేశారు. కాగా ఐదేళ్లుగా బిల్ కలెక్టర్లను, కంప్యూటర్ ఆపరేటర్లను కదిలించిన సందర్భాలు లేవు. కారణం.. ఉత్తర్వులు వెలువడకముందే రాజకీయ ప్రమేయంతో ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో సాహసోపేత నిర్ణయంతో పలువురు ఉద్యోగులపై చర్యలు చేపట్టారు. దీంతో బల్దియా కార్యాలయంలో పనిచేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఆర్ఐ, బిల్ కలెక్టర్లకు డిమోషన్ నగరపాలక సంస్థకు గుండెకాయలాంటి రెవెన్యూ విభాగంలో నిలువెల్లా నిర్లక్ష్యం ఆవహించింది. ఇంటిపన్నుల వసూలు, అసెస్మెంట్లు, మోటేషన్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటికితోడు ఇంటిపన్నుల వసూళ్లకు కదలకపోవడం ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని పలుమార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులను మందలించినా.. మార్పు రాకపోవడంతో వేటుపడింది. మున్సిపల్లో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు క్లర్క్‌గా డిమోషన్ అయ్యారు. పన్నుల వసూలు విషయంలో నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయకుండా గతంలో షోకాజ్ నోటీసులు అందుకున్నా పనితీరులో మార్పు కనిపించని బిల్కలెక్టర్లు నర్సయ్య, శశికుమార్, ప్రణీత్, మల్లేశంను విధుల నుంచి తొలగించారు. అదే బాటలో నడుస్తున్న మరికొంత మంది రెవెన్యూ సిబ్బందిపై కూడా త్వరలో వేటు పడుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు కదిలిన సీట్లు కొద్ది సంవత్సరాలుగా ఆయా విభాగాల్లో పాతుకుపోయిన కంప్యూటర్ ఆపరేటర్ల సీట్లు ఎట్టకేలకు కదిలించారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆపరేటర్లతోపాటు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఆపరేటర్లను సైతం అంతర్గత బదిలీలు చేశారు. ఆరోపణలు ఉన్నవారిని కాకుండా అందరినీ ఒకేగాటిన కట్టడంతో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఔట్సోర్సింగ్ ద్వారా నియామకమై ఒక సెక్షన్లో 15ఏళ్లుగా, మరో సెక్షన్లో 10 ఏళ్లుగా పనిచేస్తూ తమకు ఎదురులేదన్నట్లు ఉన్నవారికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గతంలో ఎంతమంది కమిషనర్లు అంతర్గత బదిలీలకు ప్రయత్నించినా రాజకీ య ఒత్తిడి మేరకు వెనక్కితగ్గారు. ఈసారి కూడా రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒత్తిళ్లకు తలొగ్గుతారా..? ఉత్తర్వులకు కట్టుబడి ఉంటారా..? వేచి చూడాల్సిందే.. అధికారులపై చర్యలు లేవా..? నగరపాలక సంస్థలో చిన్న ఉద్యోగులపైనే కొరడా ఝుళిపిస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలకు వెనుకాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ... పలుమార్లు టెండర్ల రద్దుకు కారణమవుతున్న వారిపై, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ సెక్షన్లో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, వారిపై కూడా చర్యలు చేపట్టాలనే వాదనలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా బల్దియాలో ఆరంభమైన ప్రక్షాళన అవినీతి, నిర్లక్ష్యపు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. -
సిగరెట్ కాల్చలేదని.. డిమోట్ చేశారు!
స్థానిక ముస్లిం నాయకుల ఎదుట సిగరెట్ కాల్చే ధైర్యం చేయనందుకు చైనాలో ఓ ఉద్యోగి డిమోట్ అయ్యాడు. ముస్లింలు ఎక్కువగా ఉండే జింజియాంగ్ రాష్ట్రంలో ఓ కమ్యూనిస్టు పార్టీ అధికారికి హోదా తగ్గించారు. హోటన్ నగరం సమీపంలోని ఒక గ్రామానికి పార్టీ చీఫ్‌గా ఉన్న జెలిల్ మత్నియాజ్ను ’సీనియర్ స్టాఫ్ మెంబర్’ నుంచి ’స్టాఫ్ మెంబర్’ గా డిమోట్చేశారు. మత నాయకుల ఎదురుగా నిలబడి సిగరెట్ కాల్చే ధైర్యం చేయనందుకే ఇలా చేసినట్లు హోటన్ డైలీ తమ సోషల్ మీడియా వుయ్ చాట్ అకౌంటులో పోస్టు చేసిన సమాచారంలో తెలిపింది. సిగరెట్ తాగడం అనేది ఎవరికి వారి వ్యక్తిగత ఇష్టమని, అయితే మతపెద్దల ఎదురుగా సిగరెట్ కాల్చకూడదనేది ఆ ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మిక ఆలోచనల తీవ్రతను తెలియజేస్తుందని హోటన్ నగర అధికారి ఒకరు చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది. తీవ్రమైన మత ఆలోచనలకు వ్యతిరేకంగా అతడు పోరాడాల్సి ఉందని, లేకపోతే అతడు ఈ తీవ్రవాద ప్రాంతీయ బలగాలపై పోరాటంలో విఫలం అయినట్లే అవుతుందని ఆ అధికారి వ్యాఖ్యానించారు. స్థానిక మతాచారాల ప్రకారం పెద్దలు లేదా మతపెద్దల ఎదురుగా సిగరెట్లు కాల్చకూడదని ఝెజియాంగ్ నార్మల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తుర్జుంజున్ తుర్సుమ్ తెలిపారు. ఈ అధికారి హోదాను తగ్గించడం అనేది ఒక్క ఘటన మాత్రమేనని, దీన్ని విధాన నిర్ణయంగా తీసుకోకూడదని ఆయన అన్నారు. -
పరిటాలకు డిమోషన్
- పౌరసరఫరాల శాఖను తప్పించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కేటాయింపు - కాలవకు సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణం - శాఖల కేటాయింపుల్లో ‘అనంత’కు దక్కని ప్రాధాన్యం - జిల్లా అభివృద్ధికి దోహదం చేసే శాఖలు కాకపోవడంతో మంత్రుల్లో అసంతృప్తి! - 2004–14 మధ్య కాలంలో జిల్లా మంత్రులకు కీలక పోర్టుఫోలియోలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) కొత్తగా కేబినెట్లోకి చేరిన వారితో పాటు పాత మంత్రులకూ ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖలు కేటాయించారు. మంత్రి పరిటాల సునీతకు డిమోషన్ ఇచ్చారు. ఆమె ఇప్పటి వరకూ చూస్తున్న పౌరసరఫరాల శాఖను తప్పించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. అలాగే కొత్తగా మంత్రివర్గంలోకి అడుగుపెట్టిన కాలవ శ్రీనివాసులుకు సమాచార, పౌరసంబంధాల శాఖతో పాటు గ్రామీణ గృహనిర్మాణ శాఖను కేటాయించారు. సమాచార శాఖను ఇదివరకూ పల్లె రఘునాథరెడ్డి చూశారు. ప్రస్తుతం ‘అనంత’ మంత్రులకు కేటాయించిన శాఖలు అంతగా ప్రాధాన్యత లేనివే. ‘అనంత’ లాంటి కరువు జిల్లాకు, పైగా 2014 ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టిన జిల్లాకు చంద్రబాబు కేటాయించిన శాఖలు చూస్తే జిల్లా అభివృద్ధిపై ఆయనకు ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదన్న విషయం ఇట్టే తెలుస్తోందని పలువురు అంటున్నారు. అనంతపురం జిల్లా తీవ్ర దుర్భిక్ష ప్రాంతం. వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. పారిశ్రామిక అభివృద్ధిలోనూ నిర్లక్ష్యానికి గురైంది. ఇలాంటి జిల్లాపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి. కానీ టీడీపీ ప్రభుత్వం ఈ జిల్లా మంత్రులకు మంచి శాఖలు కేటాయించకుండా ఎప్పుడూ అన్యాయమే చేస్తోంది. 1999–2004 మధ్యకాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒక మంత్రి పదవిని జిల్లాకు కేటాయించారు. నిమ్మల కిష్టప్పను మంత్రిగా చేసి ఏమాత్రమూ ప్రాధాన్యత లేని పశుసంవర్ధక, చేనేత, జౌళిశాఖలను కేటాయించారు. ఆ ఐదేళ్లలో జిల్లా అభివృద్ధికి మంత్రిగా కిష్టప్ప చేసింది, బాధ్యతగా ప్రభుత్వం చేసేందీ ఏమీ లేవు. తీవ్ర కరువుతో జిల్లా వ్యాప్తంగా తినేందుకు తిండిలేక గ్రామీణ ప్రాంత ప్రజలు గంజి కేంద్రాలను ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం జిల్లాకు ఎలాంటి సాయమూ చేయలేదు. ఆపై 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 8 కాంగ్రెస్, 6 టీడీపీ దక్కించుకున్నాయి. అధికస్థానాలు గెలిపించినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు మంత్రి పదవులను జిల్లాకు కేటాయించి.. కీలకశాఖలను కట్టబెట్టారు. రఘువీరారెడ్డికి వ్యవసాయ శాఖను, జేసీ దివాకర్‌రెడ్డికి పంచాయతీరాజ్ శాఖను ఇచ్చారు. 2009లోనూ వైఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘువీరారెడ్డిని అదేశాఖలో కొనసాగించారు. అనివార్య కారణాలతో జేసీని తప్పించారు. ఆపై రోశయ్య సీఎం అయిన తర్వాత అదే కేబినెట్‌ను కొనసాగించారు. వైఎస్ హయాంలో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సురెన్స్‌తో పాటు వ్యవసాయపరంగా జిల్లాకు మంచి ప్రయోజనం కలిగింది. 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రఘువీరారెడ్డికి రెవెన్యూ శాఖను కేటాయించారు. శైలజానాథ్‌ను కేబినెట్లోకి తీసుకుని విద్యాశాఖను ఇచ్చారు. టీడీపీ హయాంలో మళ్లీ అన్యాయమే.. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె రఘునాథరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఐటీ శాఖను కేటాయించారు. దీని నిర్వహణలో పల్లె ఘోరంగా విఫలమయ్యారు. జిల్లాకు సంబంధించి ఒక ఎంఓయూ కూడా తీసుకురాలేకపోయారు. సమాచార, పౌరసంబంధాలు, మైనార్టీసంక్షేమ శాఖలు కూడా ‘పల్లె’ వద్దె ఉండేవి. ఆయన పనితీరు బాగోలేకపోవడంతో జిల్లాకు ఎలాంటి ప్రయోజనమూ ఒనగూరలేదు. పరిటాల సునీతకు ఇంతకుముందు పౌరసరఫరాల శాఖ కేటాయించారు. సంక్రాంతి కానుక, రంజాన్‌తోఫా, క్రిస్మస్ కానుకల్లో భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు పలుసార్లు వచ్చాయి. పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ శాఖ వల్ల జిల్లాకు మేలు కలగడం కంటే వ్యక్తిగతంగా పరిటాల కుటుంబానికి ప్రయోజనం కలిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పరిటాల సునీతకు డిమోషన్ ఇచ్చి స్త్రీ, శిశుసంక్షేమ శాఖను కేటాయించారు. చీఫ్‌విప్ నుంచి మంత్రిగా ప్రమోషన్ పొందిన కాలవ శ్రీనివాసులుకు సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణశాఖ కేటాయించారు. మూడేళ్లలో గృహనిర్మాణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఒక్క ఇల్లూ నిర్మించలేదు. పట్టణ గృహనిర్మాణశాఖ మంత్రి నారాయణ వద్దే ఉంచారు. పోతే సమాచార, పౌరసంబంధాల శాఖ వల్ల కూడా జిల్లాకు ఒరిగేదేమీ లేదు. ‘అనంత’పై తనకు అలివిమాలిన ప్రేమ ఉందని పదేపదే వల్లెవేసే చంద్రబాబు శాఖల కేటాయింపుల్లో మాత్రం మొండిచేయి చూపారని జిల్లాలో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. టీడీపీలో మాత్రం ప్రస్తుత శాఖల కేటాయింపుపై సంతోషం వ్యక్తమవుతోంది. సునీతకు డిమోషన్ ఇవ్వడంతో పరిటాల వ్యతిరేకులు సంబరపడిపోతున్నారు. తమకు కాకుండా కాలవకు మంత్రి పదవి కేటాయించడంపై రగిలిపోతున్న సీనియర్లు.. ఆయనకు కేటాయించిన శాఖలను చూసి ..‘తగినశాస్తి జరిగింది. ఇలాంటి శాఖలు ఉండే మంత్రి పదవి ఉంటే ఎంత? లేకుంటే ఎంత?’ అని తమ సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నారు. -
సదానంద గౌడకు డిమోషన్?
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తొలి వంద రోజుల పనితీరు ఆధారంగా కొంతమంది మంత్రుల శాఖలను మార్చి, కొంతమందిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడకు శాఖ తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పనితీరుపై మోదీ అసంతృప్తిగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సదానంద కుమారుడు కార్తీక్ వివాదం కూడా ఆయన మంత్రి పదవికి ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా నూతన రైల్వేశాఖ మంత్రిగా శివసేనకు చెందిన సురేష్ ప్రభుకు కట్టబెట్టనున్నట్లు సమాచారం. మొత్తం 10 నుంచి 11మందికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ నుంచి పలువురు కొత్త ముఖాలతో పాటు మిత్ర పక్షాలైన శివసేన, టీడీపీకి కూడా కేబినెట్లో చోటు దక్కనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోవా సీఎం మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున పంజాబ్ నుంచి తొలిసారి నెగ్గిన విజయ్ సాంప్లా, సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తనయుడు జయంత్ సిన్హా, హర్యానా నుంచి జాట్ నేత బీరేందర్‌సింగ్, బీహార్ నుంచి గిరిరాజ్‌సింగ్ లేదా భోలా సింగ్, రాజ్‌స్థాన్ నుంచి కల్నల్ సోనారామ్ చౌదరీ, గజేంద్ర సింగ్ షెకావత్, మహారాష్ర్ట నుంచి హన్స్‌రాజ్ అహిర్‌తో పాటు సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ, శివసేన నుంచి సురేష్ ప్రభు, అనిల్ దేశాయ్‌కి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. అలాగే టీడీపీ నుంచి సుజనా చౌదరికి, బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయకు చోటు దక్కింది. కాగా నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్‌లకు కేబినెట్ హోదా దక్కనున్నట్లు సమాచారం. కొత్తగా కేబినెట్లో చేరనున్న వారికి.. మోదీ ఇచ్చే టీ విందుకు రావాలని పీఎంఓ ఫోన్లు చేసింది.