సిగరెట్ కాల్చలేదని.. డిమోట్ చేశారు!
స్థానిక ముస్లిం నాయకుల ఎదుట సిగరెట్ కాల్చే ధైర్యం చేయనందుకు చైనాలో ఓ ఉద్యోగి డిమోట్ అయ్యాడు. ముస్లింలు ఎక‍్కువగా ఉండే జింజియాంగ్ రాష్ట్రంలో ఓ కమ్యూనిస్టు పార్టీ అధికారికి హోదా తగ్గించారు. హోటన్ నగరం సమీపంలోని ఒక గ్రామానికి పార్టీ చీఫ్‌గా ఉన్న జెలిల్ మత్నియాజ్‌ను ’సీనియర్ స్టాఫ్ మెంబర్’ నుంచి ’స్టాఫ్ మెంబర్’ గా డిమోట్‌చేశారు. మత నాయకుల ఎదురుగా నిలబడి సిగరెట్ కాల్చే ధైర్యం చేయనందుకే ఇలా చేసినట్లు హోటన్ డైలీ తమ సోషల్ మీడియా వుయ్ చాట్ అకౌంటులో పోస్టు చేసిన సమాచారంలో తెలిపింది. సిగరెట్ తాగడం అనేది ఎవరికి వారి వ్యక్తిగత ఇష్టమని, అయితే మతపెద్దల ఎదురుగా సిగరెట్ కాల్చకూడదనేది ఆ ప్రాంతంలో ఉన్న ఆధ్యాత‍్మిక ఆలోచనల తీవ్రతను తెలియజేస్తుందని హోటన్ నగర అధికారి ఒకరు చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది.
తీవ్రమైన మత ఆలోచనలకు వ్యతిరేకంగా అతడు పోరాడాల్సి ఉందని, లేకపోతే అతడు ఈ తీవ్రవాద ప్రాంతీయ బలగాలపై పోరాటంలో విఫలం అయినట్లే అవుతుందని ఆ అధికారి వ్యాఖ్యానించారు. స్థానిక మతాచారాల ప్రకారం పెద్దలు లేదా మతపెద్దల ఎదురుగా సిగరెట్లు కాల్చకూడదని ఝెజియాంగ్ నార్మల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తుర్జుంజున్ తుర్సుమ్ తెలిపారు. ఈ అధికారి హోదాను తగ్గించడం అనేది ఒక్క ఘటన మాత్రమేనని, దీన్ని విధాన నిర్ణయంగా తీసుకోకూడదని ఆయన అన్నారు.