కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో గాడితప్పిన పాలనను గాడిన పెట్టేందుకు ప్రక్షాళన మొదలైంది. కొన్నేళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నవారిని డిమోషన్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. రెండేళ్లుగా స్మార్ట్‌సిటీ సాధనపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన బల్దియా.. ఉద్యోగులను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సిబ్బంది ఆడిందే ఆటగా నడుస్తోంది. దీనికితోడు పలువురికి రాజకీయ అండదండలు ఉండడంతో ఎక్కడివారక్కడే పాతుకుపోయారు. పనిచేయకున్నా ఫరవాలేదనే పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుని, ఓడీఎఫ్‌గా గుర్తించబడిన నగరపాలక సంస్థలో ఉద్యోగుల పనితీరుపై దృష్టిసారించారు.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడం, సదరు ఉద్యోగులు పలు ఆరోపణలు వంటివి అధికారుల దృష్టికి వచ్చాయి. దీంతో కమిషనర్ శశాంక బల్దియా పాలనను గాడిన పెట్టేందుకు కొరడా ఝుళిపిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఉద్యోగులను డిమోషన్ చేసి, కంప్యూటర్ ఆపరేటర్లను అంతర్గత బదిలీలు చేశారు. కాగా ఐదేళ్లుగా బిల్ కలెక్టర్లను, కంప్యూటర్ ఆపరేటర్లను కదిలించిన సందర్భాలు లేవు. కారణం.. ఉత్తర్వులు వెలువడకముందే రాజకీయ ప్రమేయంతో ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో సాహసోపేత నిర్ణయంతో పలువురు ఉద్యోగులపై చర్యలు చేపట్టారు. దీంతో బల్దియా కార్యాలయంలో పనిచేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగుల్లో గుబులు మొదలైంది.
ఆర్‌ఐ, బిల్ కలెక్టర్లకు డిమోషన్
నగరపాలక సంస్థకు గుండెకాయలాంటి రెవెన్యూ విభాగంలో నిలువెల్లా నిర్లక్ష్యం ఆవహించింది. ఇంటిపన్నుల వసూలు, అసెస్‌మెంట్లు, మోటేషన్‌లో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటికితోడు ఇంటిపన్నుల వసూళ్లకు కదలకపోవడం ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని పలుమార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులను మందలించినా.. మార్పు రాకపోవడంతో వేటుపడింది. మున్సిపల్‌లో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు క్లర్క్‌గా డిమోషన్ అయ్యారు. పన్నుల వసూలు విషయంలో నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయకుండా గతంలో షోకాజ్ నోటీసులు అందుకున్నా పనితీరులో మార్పు కనిపించని బిల్‌కలెక్టర్లు నర్సయ్య, శశికుమార్, ప్రణీత్, మల్లేశంను విధుల నుంచి తొలగించారు. అదే బాటలో నడుస్తున్న మరికొంత మంది రెవెన్యూ సిబ్బందిపై కూడా త్వరలో వేటు పడుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఎట్టకేలకు కదిలిన సీట్లు
కొద్ది సంవత్సరాలుగా ఆయా విభాగాల్లో పాతుకుపోయిన కంప్యూటర్ ఆపరేటర్ల సీట్లు ఎట్టకేలకు కదిలించారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆపరేటర్లతోపాటు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఆపరేటర్లను సైతం అంతర్గత బదిలీలు చేశారు. ఆరోపణలు ఉన్నవారిని కాకుండా అందరినీ ఒకేగాటిన కట్టడంతో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఔట్‌సోర్సింగ్ ద్వారా నియామకమై ఒక సెక్షన్‌లో 15ఏళ్లుగా, మరో సెక్షన్‌లో 10 ఏళ్లుగా పనిచేస్తూ తమకు ఎదురులేదన్నట్లు ఉన్నవారికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గతంలో ఎంతమంది కమిషనర్లు అంతర్గత బదిలీలకు ప్రయత్నించినా రాజకీ య ఒత్తిడి మేరకు వెనక్కితగ్గారు. ఈసారి కూడా రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒత్తిళ్లకు తలొగ్గుతారా..? ఉత్తర్వులకు కట్టుబడి ఉంటారా..? వేచి చూడాల్సిందే..
అధికారులపై చర్యలు లేవా..?
నగరపాలక సంస్థలో చిన్న ఉద్యోగులపైనే కొరడా ఝుళిపిస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలకు వెనుకాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ... పలుమార్లు టెండర్ల రద్దుకు కారణమవుతున్న వారిపై, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ సెక్షన్‌లో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, వారిపై కూడా చర్యలు చేపట్టాలనే వాదనలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా బల్దియాలో ఆరంభమైన ప్రక్షాళన అవినీతి, నిర్లక్ష్యపు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment