Smartcity
-
సత్తాచాటిన కాకినాడ.. స్మార్ట్ సిటీ అవార్డుల్లో రెండో స్థానం
కాకినాడ: పెన్షనర్స్ ప్యారడైజ్‌గా, ప్లాన్డ్ సిటీగా, రెండో మద్రాస్‌గా ప్రాచుర్యం పొందిన కాకినాడ మరోసారి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును కై వసం చేసుకుంది. మూడేళ్ల క్రితం దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగ రాల్లో (బెస్ట్ లివింగ్ సిటీ) నాలుగో స్థానం సాధించిన కాకినాడ ఇప్పుడు మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డులు–2022 పోటీలో దేశంలోనే కాకినాడ నగరం రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా ప్రత్యే క గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో దేశంలోని 100 స్మార్ట్‌సిటీలు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఇండోర్ మొదటి స్థానం సాధించగా.. మిగిలిన నగరాలన్నింటినీ అధిగమించి కాకినాడ రెండో స్థానాన్ని కై వసం చేసుకుంది. వచ్చే నెల 27వ తేదీన ఇండోర్‌లో జరిగే కార్యక్రమంలో కాకినాడ నగరానికి ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయనున్నారు. అవార్డు ఎందుకు దక్కిందంటే.. ► పారిశుధ్య విభాగంలో చేపట్టిన పాలనా సంస్కరణలు ఈ గుర్తింపునకు ప్రధాన కారణంగా నిలిచాయి. ► ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం, తడి – పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం, ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో చేసిన కృషికి కూడా ఈ గుర్తింపు దక్కడానికి కారణం. ► సాంకేతిక పరంగా కూడా పారిశుధ్య విభాగంలో అనేక మార్పులు తీసుకువచ్చారు. పారిశుధ్య వాహనాల కదలికలను గుర్తించేందుకు జీపీఎస్ విధానం అమలు చేశారు. ► చెత్త సేకరణకు 108 హూపర్, టిప్పర్ వాహనాలు సమకూర్చారు. ► స్మార్ట్ సిటీని 380 మైక్రో ప్యాకెట్లుగా విభజించారు. ప్రతి మైక్రో ప్యాకెట్‌కు ఇద్దరు పారిశుధ్య కార్మికులను కేటాయించి ప్రణాళికాబద్ధంగా చెత్త సేకరిస్తున్నారు. ► ఇక సేకరించిన చెత్త నుంచి సంపద సృష్టించే లక్ష్యంతో రూ.కోటితో ఇంటిగ్రేటెడ్ సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వేస్ట్ వంటి పొడి చెత్తను 16 రకాలుగా విభజించి ప్రాసెస్ చేయడం, తడి చెత్త నుంచి ఎరువుల తయారీ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ► ఈ చర్యలన్నీ జిల్లా కేంద్రమైన కాకినాడ స్మార్ట్ సిటీలో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు దోహదం చేశాయి. ► పారిశుధ్య నిర్వహణలో ఇటువంటి సంస్కరణలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ►వీటిని సమర్థవంతంగా అమలు చేసేందుకు స్మార్ట్ సిటీ కమిషనర్, మున్సిపల్ ఆరోగ్య అధికారి (ఎంహెచ్ఓ), పారిశుధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేశారు. ఇవన్నీ కూడా కాకినాడ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు దోహదపడ్డాయి. ఇది కాకినాడకు దక్కిన గౌరవం ఇండియన్ స్మార్ట్‌సిటీ అవార్డ్స్–2022లో దేశంలోనే కాకినాడ నగరం రెండో స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. గతంలో కూడా బెస్ట్ లివింగ్ సిటీల్లో కాకినాడ 4వ స్థానం సాధించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఇక్కడి అధికారులు చేపట్టిన పాలనా సంస్కరణలు కాకినాడ నగరానికి అరుదైన గౌరవాన్ని, గుర్తింపును తెచ్చి పెట్టాయి. కమిషనర్ నాగనరసింహారావు, ఇతర అధికారులు, పారిశుధ్య కార్మికులు, స్మార్ట్ సిటీ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. – ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే, కాకినాడ సిటీ శ్రమకు తగిన గుర్తింపు పారిశుధ్య విభాగంలో చేపట్టిన పాలనా సంస్కరణలకు సముచిత గుర్తింపు లభించింది. ఇక్కడి పారిశుధ్య సిబ్బంది, అధికారులతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారం వల్లే మంచి ఫలితాన్ని సాధించగలిగాం. జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా పొందగలిగాం. కాకినాడ స్మార్ట్ సిటీ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలవడానికి కారకులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. ఇదే స్ఫూర్తితో మరింత బాగా పని చేసి, ప్రజలకు మరిన్ని మంచి సేవలు అందించాలి. – సీహెచ్ నాగనరసింహారావు, కమిషనర్, కాకినాడ సిటీ -
స్మార్ట్‌సిటీలో హాట్ రాజకీయం!
సాక్షి, కరీంనగర్: స్టార్ట్‌సిటీగా కొత్త సొబగులు అద్దుకోవాల్సిన కరీంనగరం నేతల రాజకీయం ముందు తెల్లబోతోంది. కరీంనగర్లో స్మార్ట్ రోడ్ల కోసం నిధులు మంజూరైనా... టెండర్ల ప్రక్రియ దాటేందుకు సంవత్సర కాలం సరిపోయింది. టెండర్ల ప్రక్రియ పూర్తికాకుండానే అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రి కేటీఆర్ స్మార్ట్ రోడ్ల పనులను ప్రారంభించినా పనులు మాత్రం గురువారం నుంచి మొదలయ్యాయి. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించినప్పటికీ టెండర్ల వివాదం నేపథ్యంలో గందరగోళం తొలగలేదు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత పాటించలేదని, సింగిల్ టెండర్‌కు రూ.164 కోట్ల విలువైన రెండు ప్యాకేజీల పనులు అప్పగించారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై అధికార యంత్రాంగంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మొదలు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వరకు ఎంపీ సంజయ్ ఫిర్యాదులు చేశారు. టెండర్ల ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అదే సమయంలో నగర పాలక సంస్థలో ముఖ్య నేతగా వ్యవహరించిన అధికార పార్టీ నాయకుడు కూడా ఈ రోడ్ల టెండర్లపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ రోడ్ల పనులకు అడ్డంకులు ఎదురవుతాయేమోనని స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే ఈ పనుల విషయంలో ఎంపీ సంజయ్ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని విచారణకు ఆదేశిస్తే... కాంట్రాక్టర్‌కు ఇచ్చిన వర్క్ ఆర్డర్‌ను నిలిపివేస్తారేమోనని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ రోడ్ల పనులు మళ్లీ రెండడుగులు వెనక్కు వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఆది నుంచి ముందుకుసాగని టెండర్ల ప్రక్రియ కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ప్రకటించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పాత్ర పోషించారు. స్మార్ట్‌సిటీ మిషన్ చాలెంజ్‌లో రెండో విడత ఎంపిక చేసిన నగరాల్లో వరంగల్‌కు స్థానం దక్కగా , మూడో విడత కూడా కరీంనగర్‌కు అవకాశం రాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నాలుగో విడత స్మార్ట్‌సిటీ చాలెంజ్‌లో 2017లో కరీంనగర్‌కు అవకాశం దక్కింది. రూ.1,878 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయతలబెట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రతీ బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయిస్తూ వస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్‌రోడ్ల కోసం కేటాయించిన రూ.217.50 కోట్లు నిధులను మూడు ప్యాకేజీలుగా విభజించి పటిష్టమైన సీసీ రోడ్లు నిర్మాణానికి వెచ్చించాల్సి ఉంది. ఇక్కడే అసలు తతంగం మొదలైంది. రాజకీయ నేతల జోక్యం పెరిగింది. ఈ క్రమంలో తొలిసారి పిలిచిన టెండర్లకు కాంట్రాక్టర్లు ఎవరూ రాలేదు. రెండోసారి టెండర్లు పిలవగా, మూడో ప్యాకేజీ కింద హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్ల పనులకు మాత్రమే సింగిల్ టెండర్ రాగా, ఆమోదం పొందింది. 1, 2 ప్యాకేజీలకు సంబంధించిన టెండర్ల విషయంలో కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో గత ఫిబ్రవరిలో మూడో విడత ఆన్లైన్లో టెండర్లు పిలిచిన అధికారులు మరో మూడు రోజుల గడువు మిగిలి ఉన్న సమయంలో రెండో విడత టెండర్ల కేసు కోర్టులో ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా గత నెల చివరి వారంలో హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమక్షంలో ఆన్లైన్ టెండర్లను తెరిచి రాజరాజేశ్వర కన్స్ట్రక్షన్ కంపెనీకి రెండు ప్యాకేజీలు అప్పగించారు. అభ్యంతరం చెబుతున్న ఎంపీ సంజయ్ మూడో విడత టెండర్లు పిలిచి, వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఆన్లైన్లో వచ్చిన టెండర్లను ఎలా పరిగణలోకి తీసుకుంటారని ఎంపీ సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘వాయిదా వేసిన టెండర్లకు తిరిగి సమయం ఇస్తే ఆసక్తి ఉన్నవారు టెండర్లు దాఖలు చేసేవారు. సింగిల్ టెండర్ మాత్రమే ఎందుకు దాఖలవుతుంది’ అని ఆయన ప్రశ్న. పారదర్శకంగా వ్యవరించని కారణంగా విచారణ జరిపి ఈ టెండర్లను రద్దుచేసి, తిరిగి టెండర్లు పిలవాలని ఆయన సూచిస్తున్నారు. అయితే మూడు సార్లు టెండర్లు పిలిచిన నేపథ్యంలో సింగిల్ టెండర్‌ను కూడా ఖరారు చేసే అధికారం టెండర్ల కమిటీకి ఉంటుందని, రూ.164 కోట్ల విలువైన రెండు ప్యాకేజీలకు ఒకే టెండర్ రావడంతో ఆమోదం తెలిపినట్లు కరీంనగర్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ ఎండీ స్పష్టం చేశారు. అయితే అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై ఒకే వ్యక్తికి టెండర్లు దక్కేలా పావులు కదిపారని ఎంపీ సంజయ్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖలకు చెందిన అధికారులకు, స్మార్ట్‌సిటీ మిషన్‌కు, కేంద్ర విజిలెన్స్‌కు కూడా లేఖలు రాశారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన నగర పాలక సంస్థ మాజీ నేత ఒకరు కూడా ఈ టెండర్ల వ్యవహారం లోపభూయిష్టంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మొదలైన స్మార్ట్‌సిటీ పనులు స్మార్ట్‌రోడ్ల ప్రాజెక్టుల్లో భాగంగా రాజరాజేశ్వరి కన్స్ట్రక్షన్స్ దక్కించుకున్న ప్యాకేజీ 1, 2 పనులకు సంబంధించి ఇటీవలే వర్క్ ఆర్డర్ వచ్చింది. దీంతో గురువారం సదరు కాంట్రాక్టు కంపెనీ విద్యానగర్‌లోని సురక్ష టవర్స్ వద్ద పనులు ప్రారంభించగా, మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. స్మార్ట్‌రోడ్ల పనులు వేగంగా సాగాలని అధికారులను ఆదేశించారు. 24 రోడ్ల పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తయ్యేలా కాంట్రాక్టు కంపెనీ కృషి చేయాలని సూచించారు. కాగా ఓవైపు మంత్రి కమలాకర్ రోడ్ల పనులు వేగంగా పూర్తిచేయాలనే పట్టుదలతో ఉండగా, మరోవైపు ఎంపీ సంజయ్ టెండర్ల వ్యవహారంలో జరిగిన అవినీతి, అక్రమాలను విచారించాలని పట్టుపడుతున్నారు. పనులు ప్రారంభమైన దశలో ఏం జరుగుతుందో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
పాలన గాడిన పడేనా..?
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో గాడితప్పిన పాలనను గాడిన పెట్టేందుకు ప్రక్షాళన మొదలైంది. కొన్నేళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నవారిని డిమోషన్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. రెండేళ్లుగా స్మార్ట్‌సిటీ సాధనపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన బల్దియా.. ఉద్యోగులను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సిబ్బంది ఆడిందే ఆటగా నడుస్తోంది. దీనికితోడు పలువురికి రాజకీయ అండదండలు ఉండడంతో ఎక్కడివారక్కడే పాతుకుపోయారు. పనిచేయకున్నా ఫరవాలేదనే పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుని, ఓడీఎఫ్‌గా గుర్తించబడిన నగరపాలక సంస్థలో ఉద్యోగుల పనితీరుపై దృష్టిసారించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడం, సదరు ఉద్యోగులు పలు ఆరోపణలు వంటివి అధికారుల దృష్టికి వచ్చాయి. దీంతో కమిషనర్ శశాంక బల్దియా పాలనను గాడిన పెట్టేందుకు కొరడా ఝుళిపిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఉద్యోగులను డిమోషన్ చేసి, కంప్యూటర్ ఆపరేటర్లను అంతర్గత బదిలీలు చేశారు. కాగా ఐదేళ్లుగా బిల్ కలెక్టర్లను, కంప్యూటర్ ఆపరేటర్లను కదిలించిన సందర్భాలు లేవు. కారణం.. ఉత్తర్వులు వెలువడకముందే రాజకీయ ప్రమేయంతో ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో సాహసోపేత నిర్ణయంతో పలువురు ఉద్యోగులపై చర్యలు చేపట్టారు. దీంతో బల్దియా కార్యాలయంలో పనిచేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఆర్ఐ, బిల్ కలెక్టర్లకు డిమోషన్ నగరపాలక సంస్థకు గుండెకాయలాంటి రెవెన్యూ విభాగంలో నిలువెల్లా నిర్లక్ష్యం ఆవహించింది. ఇంటిపన్నుల వసూలు, అసెస్మెంట్లు, మోటేషన్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటికితోడు ఇంటిపన్నుల వసూళ్లకు కదలకపోవడం ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని పలుమార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులను మందలించినా.. మార్పు రాకపోవడంతో వేటుపడింది. మున్సిపల్లో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు క్లర్క్‌గా డిమోషన్ అయ్యారు. పన్నుల వసూలు విషయంలో నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయకుండా గతంలో షోకాజ్ నోటీసులు అందుకున్నా పనితీరులో మార్పు కనిపించని బిల్కలెక్టర్లు నర్సయ్య, శశికుమార్, ప్రణీత్, మల్లేశంను విధుల నుంచి తొలగించారు. అదే బాటలో నడుస్తున్న మరికొంత మంది రెవెన్యూ సిబ్బందిపై కూడా త్వరలో వేటు పడుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు కదిలిన సీట్లు కొద్ది సంవత్సరాలుగా ఆయా విభాగాల్లో పాతుకుపోయిన కంప్యూటర్ ఆపరేటర్ల సీట్లు ఎట్టకేలకు కదిలించారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆపరేటర్లతోపాటు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఆపరేటర్లను సైతం అంతర్గత బదిలీలు చేశారు. ఆరోపణలు ఉన్నవారిని కాకుండా అందరినీ ఒకేగాటిన కట్టడంతో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఔట్సోర్సింగ్ ద్వారా నియామకమై ఒక సెక్షన్లో 15ఏళ్లుగా, మరో సెక్షన్లో 10 ఏళ్లుగా పనిచేస్తూ తమకు ఎదురులేదన్నట్లు ఉన్నవారికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గతంలో ఎంతమంది కమిషనర్లు అంతర్గత బదిలీలకు ప్రయత్నించినా రాజకీ య ఒత్తిడి మేరకు వెనక్కితగ్గారు. ఈసారి కూడా రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒత్తిళ్లకు తలొగ్గుతారా..? ఉత్తర్వులకు కట్టుబడి ఉంటారా..? వేచి చూడాల్సిందే.. అధికారులపై చర్యలు లేవా..? నగరపాలక సంస్థలో చిన్న ఉద్యోగులపైనే కొరడా ఝుళిపిస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలకు వెనుకాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ... పలుమార్లు టెండర్ల రద్దుకు కారణమవుతున్న వారిపై, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ సెక్షన్లో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, వారిపై కూడా చర్యలు చేపట్టాలనే వాదనలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా బల్దియాలో ఆరంభమైన ప్రక్షాళన అవినీతి, నిర్లక్ష్యపు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. -
స్మార్ట్‌సిటీ కార్యాచరణ
కరీంనగర్ స్మార్ట్‌సిటీ పనులను త్వరలో ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె.శశాంక తెలిపారు. స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల టెండర్లకు ప్రణాళిక తయారుచేసి దశలవారీగా పనులు చేపట్టి పూర్తిచేయాలని కాంట్రాక్టర్ ఆర్వీ అసోసియేషన్ కన్సల్టెన్సీ బృందాన్ని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్హాల్లో ఆర్వీ కన్సల్టెన్సీ బృందంతో సమావేశమయ్యారు. ఏరియా బేస్డ్ డెవలప్మెంట్లో భాగంగా మొదటి దశలో చేపట్టే ప్రాజెక్టు పనులపై చర్చిస్తూ వివరణ కోరారు. స్టేజ్–1, 2ను పరిగణనలోకి తీసుకుని స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రూట్‌మ్యాప్‌లను పరిశీలించారు. కరీంనగర్ కార్పొరేషన్ : స్మార్ట్ పనులకు సంబంధించి ప్రాజెక్టు టెండర్లపై సలహాలు, సూచనలు చేశారు. ఏరియా డెవలప్‌మెంట్స్‌కు సంబంధించి ముఖ్యమైన లొకేషన్‌ను ముందస్తుగా గుర్తించాలన్నారు. స్టేజ్–1లో చేపట్టబోయే సోలార్ రూప్‌టాప్, స్మార్ట్ ఎనర్జీ, డిస్ట్రిబ్యూషన్, స్మార్ట్‌రోడ్స్, అండర్‌గ్రౌండ్ నెట్వర్క్, టూరిజం ఇన్ఫర్మేషన్, మానేరు రివర్‌ఫ్రంట్, హరితహోటల్, గ్రీనరీఅండ్పార్కులు, పార్కింగ్ ప్లేస్, మల్టీపర్పస్స్కూల్స్ అభివృద్ధిపై చర్చించారు. మాస్టర్‌ప్లాన్ ప్రకారం సంబంధిత ప్రాజెక్టు పనుల టెండర్ల వివరాలు, పనులను ప్రారంభించి పూర్తిచేసే విధానంపై కన్సల్టెన్సీ సభ్యుల వివరణ కోరారు. నగరంలో నడుస్తున్న మొదటి దశ రూ.100 కోట్ల పనులు, రెండోదశ రూ.147 కోట్ల పనులపై సలహాలు సూచనలు చేశారు. స్మార్ట్‌సిటీ పనులను ఏరియాల వారీగా గుర్తించి ముఖ్యమైన పనులను ముందస్తుగా చేపట్టి పూర్తిచేయాలని ఆదేశించారు. మరో వైపు స్టేజీ–2లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి కూరగాయల మార్కెట్లు, హ్యాకింగ్ వెండర్ జోన్స్, మార్కెట్‌యార్డు రీ డిజైనింగ్‌లో టౌన్‌ప్లానింగ్ అధికారుల సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. సిగ్నల్ సిస్టమ్, జీబ్రాక్రాసింగ్, కెమెరా కనెక్షన్స్, హెల్త్‌సెంటర్ల ఏర్పాటు, 24 గంటల మంచినీటి సరఫరాతోపాటు తదితర అంశాలపై వివరించారు. జిల్లాలో సంబంధిత అధికారుల సహకారాలతో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ శరత్‌బాబు, ఆర్వీ కన్సల్టెన్సీ బృందం సభ్యులు పాల్గొన్నారు. రూ.147 కోట్ల ప్రతిపాదనలు అందించాలి నగరంలో రెండోవిడతలో చేపట్టే రూ.147 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఒక్కరోజులోనే సిద్ధం చేయాలని శశాంక ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ప్రజారోగ్యశాఖ, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, మిషన్‌భగీరథ పనులపై చర్చించి అధికారులకు సూచనలు చేశారు. యూజీడీ పనులకు సంబంధించిన ట్రంక్‌లైన్, ఐకాన్స్, ఇన్స్పెక్షన్ చాంబర్ల వివరాలను అందించాలన్నారు. పనులు చేపట్టే ముందు ఏయే ప్రదేశాల్లో ఇన్స్పెక్షన్ చాంబర్లు వేయాలో ప్లానింగ్ చేయాలని సూచించారు. మిషన్‌భగీరథ పనుల పురోగతిని వివరించాలన్నారు. జూన్ 10లోపు మిషన్‌భగీరథ పనులు ఓ కొలిక్కి వచ్చేలా పనుల్లో వేగవంతం పెంచాలని సూచంచారు. సమావేశంలో ఎస్ఈ శరత్‌బాబు, ఈఈ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
అతిపెద్ద పర్యాటక కేంద్రంగా కరీంనగర్: ఎంపీ వినోద్
కరీంనగర్: అతిపెద్ద పర్యాటక కేంద్రంగా కరీంనగర్ మారనుందని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలోని వైద్యుల వీధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఎంపీ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగరాభివృద్దికి ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు. స్మార్ట్ సిటీకి ఎంపికైన కరీంనగర్‌ను వెయ్యి కోట్ల నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ సర్పరాజ్ ఆహ్మద్, సీపీ కమలాసన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇప్పటికే పలు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని జనసందడిగల ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఉన్నాయని సీపీ తెలిపారు. విద్యాసంస్థలు, హస్పిటల్, పంక్షన్ హాల్, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు టెంపుల్స్ ఏరియాలో ప్రజల బాగస్వామ్యంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. -
స్మార్ట్‌సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం స్వీకరిస్తాం
ఏయూక్యాంపస్: స్మార్ట్ సిటీగా విశాఖను తీర్చిదిద్దడంలో భాగస్వామిగా ఏయూ నిలుస్తుందని ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉదయం అమెరికా ప్రతినిధులను సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య నాగేశ్వరరావు మాట్లాడుతూ వర్సిటీలో ప్రత్యేకంగా నోడల్ ఏజన్సీని ఏర్పాటు చేస్తామన్నారు. స్మార్ట్సిటీపై అధ్యయనం చేసే నిపుణులకు సమన్వయం జరుపుతూ పనిచేస్తామన్నారు. దీనికి సంధాన కర్తగా ఆచార్య బాల ప్రసాద్‌ను వ్యవహరించాలని సూచించారు. జీవీఎంసీతో సమన్వయం జరుపుతూ పనిచేయాలన్నారు. స్మార్ట్ సిటీ నిర్మాణానికి సంబంధించి విభిన్న అంశాలలో ఏయూలోని నిపుణుల సూచలను స్వీకరించాలని సూచించారు. ప్రతీ రంగంలో అందుబాటులో వున్న నిపుణులను సమన్వయం చేస్తూ స్థానికంగా అభివద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ నిపుణులు తమ ఆలోచనలను పంచుకుంటే వీటిని అనుగుణంగా స్థానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఆచార్యులు పనిచేస్తారన్నారు. స్మార్ట్ సిటీలలో ఏయూను నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అమెరికన్ ఎంబసీకి చెందిన ఆల్ ఇండియా ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ అడ్వయిజర్ మనదీప్ కౌర్మాట్లాడుతూ అమెరికా దేశ నిపుణులు అలహాబాద్, ఆజ్మీర్,విశాఖ నగరాలను సందర్శించనున్నారన్నారు. ఎనర్జీ, ఇంజినీరింగ్, ఎన్విరాన్మెంట్ రంగాలలో నిపుణులైన ఆచార్యుల సహకారం అవసరమన్నారు. సజనాత్మకంగా పనిచేయడానికి, సుస్తిర నగరాలను తీర్చిదిద్దడానికి విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం అవసరమన్నారు. త్వరలో ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన నిపుణులు సందర్శించడం జరుగుతుందన్నారు. యూనివర్సిటీ ఆఫ్ మిన్నోసోట ఆచార్యుడు డాక్టర్ అను రామస్వామి మాట్లాడుతూ జివిఎంసీ చేస్తున్న కార్యక్రమాలకు సహాయకారిగా నిలుస్తున్నామన్నారు. ఎనర్జీ, శానిటేషన్, ఫుడ్సప్లయ్, సబ్లిక్ స్పేస్, ట్రాన్స్‌పోర్టేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ తదితర రంగాలలో పనిచేస్తామన్నారు. విశ్వవిద్యాలయాలో సంయుక్తంగా పనిచేసి అర్థవంతమైన పరిష్కారాలను చూడం జరుగుతుందన్నారు. విద్యాసంస్థల భాగస్వామ్యం అభిలషనీయమన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, ఆచార్య వి.బాల ప్రసాద్, జి.వి.ఆర్ శ్రీనివాసరావు, ఇ.ఉదయ భాస్కర రెడ్డి, టి.భైరాగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అను రామస్వామి, మనుదీప్ కౌర్‌లను వీసీ నాగేశ్వరరావు సత్కరించారు. -
స్లిమ్‌గా..హ్యాండ్సమ్గా..
సాగర్‌నగర్ (విశాఖపట్నం): ‘స్మార్ట్‌సిటీలో సిటిజనుల లైఫ్సై్టల్స్ మారుతున్నాయి. నడివయస్కులు సైతం ఫిట్నెస్ కావాలని కోరుకుంటున్నారు. అందానికి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఉపాధికి ఉన్నత స్థాయి ఎదుగుదలకూ ఫిట్నెస్,హ్యాండ్సమ్గా ఉండటం కీలకమే. విమానం మోసినా..తాము మోయలేమంటూ ఓవర్ వెయిట్ కారణాన్ని చూపుతూ కొంతకాలం క్రితం ఎయిర్ ఇండియా 125 మంది క్యాబిన్‌క్రూ సిబ్బందిని తొలగించింది. అలాంటి ప్రొఫెషన్స్‌లో ఊబకాయం ఉపాధికే ఎసరు పెడుతోంది. ఆ స్థాయిలో కాకపోయినా ఫిట్లెస్గా ఉండటం అనేది జాబ్ కెరీర్‌ను కూడా ఒడిదుడుకులకు గురి చేస్తోంది’.దీంతో విశాఖ కార్పొరేట్ కంపెనీల్లో జాబ్ కావాలంటే నైతిక విలువలతోపాటు, లైఫ్‌సై్టల్, ఫిట్నెస్ కాస్త అవసరమని సూచిస్తున్నాయి. నగరంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న రేష్మా 13 కేజీల బరువు తగ్గారు. హెల్తీ ఫైమ్ అనే వెయిట్ లాస్ యాప్‌తో నాలుగు నెలల్లో తగ్గించుకున్న బరువుతో తన ఉద్యోగ బాధ్యతలు మరింత చురుగ్గా నిర్వర్తించగలుగుతున్నారు. పైకి ప్రకటించినప్పటికీ పలు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులు ఫిట్‌గా ఉండడాన్ని ఖచ్చితంగా కోరుకుంటున్నాయి. తద్వారా కంపెనీ ప్రొఫైల్ మెరుగుపడటంతోపాటు ఉద్యోగుల పనితీరు సైతం పదునెక్కుతుందని భావిస్తున్నాయి అని రేష్మా చెప్పారు. క్రమశిక్షణకు శరీరమే సూచిక ఫిట్నెస్ లేకపోవడం శరీరంపై క్రమశిక్షణ లేకపోవడంగా కంపెనీల అధిపతులు, కార్పొరేట్ సర్కిల్స్ భావిస్తున్నాయి. తనపై తాను శ్రద్ధ చూపలేని వ్యక్తులు కంపెనీ ఎదుగుదలపై కూడా చూపలేరని ఈ వర్గాలు నమ్ముతున్నాయి. ‘ఉద్యోగంలో చేరినప్పుడు చాలా ఫిట్‌గా ఉండి ఆ తర్వాత ఒబెసిటీ బాధితులుగా మారిన వారు కెరీర్‌పరంగా ఎదుగుదలకు నోచుకోకపోవడం నేను గమనించా’ అని ఐటీ సెజ్‌లోని ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగి సౌజన్య చెప్పారు. నగరంలో పెరుగుతున్న వ్యాయామశాలలు అందం, ఆరోగ్యం, శరీరాకతికి నేటి యువతరం అత్యంత ప్రాధాన్యత పొందడానికి నగరంలో జిమ్ సెంటర్లు విస్తరిస్తున్నాయి. ఫిట్‌గా తయారవ్వాలనే తలంపుతో సూర్యుడు ఉదయించక ముందే యువతీ,యువకులు జిమ్ సెంటర్ల వద్ద వాలిపోతున్నారు. అత్యాధునిక పరికరాలతో చెమటలు పట్టేంత వరకు కుస్తీలు పడుతున్నారు. వీరి ఆసక్తికి తగ్గట్టుగా జిమ్ సెంటర్లు, అటు పురుషులకు, ఇటు మహిళలకు శిక్షణలు ఇచ్చే సెంటర్లు ఆకట్టుకుంటున్నాయి. విశాలాక్షినగర్, సాగర్‌నగర్, ద్వారకానగర్, ఎంవీపీకాలనీ, సీతమ్మధార, దొండపర్తి తదితర ప్రాంతాల్లో కార్పొరేట్ జిమ్‌లు దర్శనమిస్తున్నాయి. ఇవి కాకుండా వుడా ఏర్పాటు చేసిన హెల్త్ ఎనారీ, ఆర్కేబీచ్ వంటి ప్రాంతాల్లో ఫిట్నెస్ కోసం వ్యాయామం చేస్తున్నారు. ఈ ఫుడ్ తీసుకుంటే మంచిది స్లిమ్‌గా తయారవ్వాలంటే ముఖ్యంగా పొట్టను తగ్గించాలి. సిక్స్‌ప్యాక్ కావాలనుకునే వారు, ఫిజికల్ ఫిట్నెస్ కోసం తపించే వారు ఆహారం విషయంలో కొద్ది జాగ్రత్తలు పాటించాలి. ఉదయం జిమ్‌కు బయలుదేరే ముందు తేనే, నిమ్మరసం తీసుకోవడం వల్ల కొవ్వు ఏర్పడదు. వ్యాయామం పూర్తయ్యాక ఉడకబెట్టిన గుడ్డు, గ్లాసు పాలు తీసుకోవాలి. ఆర్థికస్తోమతను బట్టి డ్రైఫ్రూట్స్ తీసుకుంటే మరీ మంచిది. –మ«ధ్యాహ్నం భోజనంలో కూరగాయలతోపాటు, సాంబార్, పెరుగు ఉండేలా చూసుకోవాలి. రాత్రి భోజనంగా చపాతి తీసుకోవడం శ్రేయస్కరం. ఆలుగడ్డ, నెయ్యి,పెరుగు,అరటిపండు, తీసుకుంటే బాగుంటుంది. వారంలో ఒక్కసారైనా చికెన్ లేదా చేపలను ఆహారంగా తీసుకోవాలి. ఫిట్‌నెస్‌కు యోగా నగరంలో వయసు, హోదాలతో నిమిత్తం లేకుండా యోగాపై ఆసక్తి చూపుతున్నారు. కార్పొరేట్ ఉద్యోగులు, ఉన్నతస్థాయి నిరుద్యోగులు, ఉద్యోగులు సైతం యోగాసనాలతో సంతప్తి చెందుతున్నారు. తమ శరీరా ఆకతులను, ఆరోగ్యకరంతో ఫిట్నెస్గా కన్పించాలని తపన ఎక్కువగా కన్పిస్తుంది. అందుకు వారికి అందుబాటులో ఉన్న యోగా, జిమ్ ఇతర వ్యాయామశాలలకు పరుగులు దీస్తున్నారు. ముఖ్యంగా యోగాతోనే మంచి ఫిట్నెస్, ఆరోగ్యం లభిస్తోంది. –సింధుసాయి, విశాలాక్షినగర్, అంతర్జాతీయ యోగాకారుడు -
స్మార్ట్‌సిటీ హుళక్కే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలుకు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వం.. మొదటి దశ ప్రతిపాదనల్లో కర్నూలు జిల్లాకు మొండిచేయి చూపింది. మొదటి దశలో 100 స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసింది. మొదటి దశలోనే కర్నూలు పేరును చేరుస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా పంపిన ప్రతిపాదనల్లో నుంచి కర్నూలును తొలగించి ఈ స్థానంలో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పేరును చేర్చింది. రెండో దశ ప్రతిపాదనల్లో కర్నూలును చేరుస్తామని చెబుతోంది. అందుకే తాజాగా కర్నూలు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలును స్మార్ట్ సిటీగా అనకుండా మెగాసిటీగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనలోని అసలు ఆంతర్యం ఇదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్ నుంచి మెగా దాకా.. దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రాష్ట్రం నుంచి నాలుగు సిటీలను ఎంపిక చేసి పంపమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఇందుకోసం విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు, తిరుపతితో పాటు నాలుగో పేరుగా కర్నూలు జిల్లాను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో నిర్ణయించింది. అయితే, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న కృష్ణపట్నం పోర్టుతో పాటు ఇతర పారిశ్రామిక వర్గాల నుంచి ఒత్తిడో మరో ఇతర కారణమో తెలియదు కానీ... కర్నూలు స్థానంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు-కృష్ణపట్నం ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు, తిరుపతితో పాటు నెల్లూరు- కృష్ణపట్నం ప్రాంతాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో కర్నూలు వాసుల్లో వ్యతిరేకత వ్యక్తం కాకూడదనే ఉద్దేశంతో మెగాసిటీ అనే కొత్త పల్లవిని సీఎం చంద్రబాబు అందుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే శుక్రవారం కర్నూలులో నిర్వహించిన సామాజిక సాధికారిత మిషన్ ప్రారంభ సభలో కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని కాకుండా.. మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. వాస్తవానికి స్మార్ట్ సిటీగా కర్నూలును ప్రతిపాదిస్తే... అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది. మెగాసిటీగా ప్రకటించడం వల్ల కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయం ఏమీ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 90 శాతం నిధులు కేంద్రానివే.. లక్ష జనాభా దాటిన నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయాలనేది కేంద్రం భావన. ఇందుకోసం మొదటి దశలో 100 సిటీలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాల్లో మౌలిక సదుపాయాలు పెరగడం లేదు. దీంతో మురికివాడల్లో జనాభా పెరుగుతోంది. కనీస సౌకర్యాలు లేక నగరాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీ విధానాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. తద్వారా నగరానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం 90 శాతం నిధులను వెచ్చిస్తుంది. రాష్ర్ట ప్రభుత్వం కేవలం 10 శాతం నిధులను వ్యయం చేస్తే సరిపోతుంది. తాగునీరు, రోడ్లు, మురుగునీటి వ్యవస్థతో పాటు విద్యుత్ సరఫరా మెరుగుదల, ఇతర నగరాలకు రోడ్దు, రైల్వే కనెక్టివిటీ సహా అన్ని మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్రం ఇతోధికంగా సహాయం చేస్తుంది. అంతేకాకుండా స్మార్ట్ సిటీలో ప్రతీ ఇంటికీ వైఫై సౌకర్యం, అన్ని సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి రావడం, విపత్తులను ముందే హెచ్చరించే సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటు, ఆరోగ్య, విద్యా సౌకర్యాల ఏర్పాటు తదితర అన్ని అంశాల్లో కేంద్రం సహాయం చేస్తుంది. ఈ స్మార్ట్‌సిటీల అభివృద్ధి కోసం ఏకంగా రూ.7 వేల కోట్లకుపైగా కేంద్రం వెచ్చించనుంది. అంటే 100 స్మార్ట్సిటీలకుగానూ ఒక్కో స్మార్ట్‌సిటీకి సుమారుగా సగటున రూ.700 కోట్ల మేరకు వస్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో కర్నూలు నగర అభివృద్ధికి రావాల్సిన రూ.700 కోట్ల మేర నిధులు నెల్లూరుకు తరలివెళ్లినట్టు అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో కర్నూలు నగర వాసుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పాల్సిందేనన్న అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.