సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలుకు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వం.. మొదటి దశ ప్రతిపాదనల్లో కర్నూలు జిల్లాకు మొండిచేయి చూపింది. మొదటి దశలో 100 స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసింది.
మొదటి దశలోనే కర్నూలు పేరును చేరుస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా పంపిన ప్రతిపాదనల్లో నుంచి కర్నూలును తొలగించి ఈ స్థానంలో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పేరును చేర్చింది. రెండో దశ ప్రతిపాదనల్లో కర్నూలును చేరుస్తామని చెబుతోంది. అందుకే తాజాగా కర్నూలు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలును స్మార్ట్ సిటీగా అనకుండా మెగాసిటీగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనలోని అసలు ఆంతర్యం ఇదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్మార్ట్ నుంచి మెగా దాకా..
దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రాష్ట్రం నుంచి నాలుగు సిటీలను ఎంపిక చేసి పంపమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఇందుకోసం విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు, తిరుపతితో పాటు నాలుగో పేరుగా కర్నూలు జిల్లాను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో నిర్ణయించింది. అయితే, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న కృష్ణపట్నం పోర్టుతో పాటు ఇతర పారిశ్రామిక వర్గాల నుంచి ఒత్తిడో మరో ఇతర కారణమో తెలియదు కానీ... కర్నూలు స్థానంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు-కృష్ణపట్నం ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు, తిరుపతితో పాటు నెల్లూరు- కృష్ణపట్నం ప్రాంతాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
దీంతో కర్నూలు వాసుల్లో వ్యతిరేకత వ్యక్తం కాకూడదనే ఉద్దేశంతో మెగాసిటీ అనే కొత్త పల్లవిని సీఎం చంద్రబాబు అందుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే శుక్రవారం కర్నూలులో నిర్వహించిన సామాజిక సాధికారిత మిషన్ ప్రారంభ సభలో కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని కాకుండా.. మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. వాస్తవానికి స్మార్ట్ సిటీగా కర్నూలును ప్రతిపాదిస్తే... అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది. మెగాసిటీగా ప్రకటించడం వల్ల కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయం ఏమీ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
90 శాతం నిధులు కేంద్రానివే..
లక్ష జనాభా దాటిన నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయాలనేది కేంద్రం భావన. ఇందుకోసం మొదటి దశలో 100 సిటీలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాల్లో మౌలిక సదుపాయాలు పెరగడం లేదు. దీంతో మురికివాడల్లో జనాభా పెరుగుతోంది. కనీస సౌకర్యాలు లేక నగరాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీ విధానాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది.
తద్వారా నగరానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం 90 శాతం నిధులను వెచ్చిస్తుంది. రాష్ర్ట ప్రభుత్వం కేవలం 10 శాతం నిధులను వ్యయం చేస్తే సరిపోతుంది. తాగునీరు, రోడ్లు, మురుగునీటి వ్యవస్థతో పాటు విద్యుత్ సరఫరా మెరుగుదల, ఇతర నగరాలకు రోడ్దు, రైల్వే కనెక్టివిటీ సహా అన్ని మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్రం ఇతోధికంగా సహాయం చేస్తుంది. అంతేకాకుండా స్మార్ట్ సిటీలో ప్రతీ ఇంటికీ వైఫై సౌకర్యం, అన్ని సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడం, విపత్తులను ముందే హెచ్చరించే సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటు, ఆరోగ్య, విద్యా సౌకర్యాల ఏర్పాటు తదితర అన్ని అంశాల్లో కేంద్రం సహాయం చేస్తుంది.
ఈ స్మార్ట్‌సిటీల అభివృద్ధి కోసం ఏకంగా రూ.7 వేల కోట్లకుపైగా కేంద్రం వెచ్చించనుంది. అంటే 100 స్మార్ట్‌సిటీలకుగానూ ఒక్కో స్మార్ట్‌సిటీకి సుమారుగా సగటున రూ.700 కోట్ల మేరకు వస్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో కర్నూలు నగర అభివృద్ధికి రావాల్సిన రూ.700 కోట్ల మేర నిధులు నెల్లూరుకు తరలివెళ్లినట్టు అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో కర్నూలు నగర వాసుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పాల్సిందేనన్న అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.
స్మార్ట్‌సిటీ హుళక్కే!
Published Sun, Mar 1 2015 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement