సదానంద గౌడకు డిమోషన్?
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తొలి వంద రోజుల పనితీరు ఆధారంగా కొంతమంది మంత్రుల శాఖలను మార్చి, కొంతమందిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడకు శాఖ తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పనితీరుపై మోదీ అసంతృప్తిగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సదానంద కుమారుడు కార్తీక్ వివాదం కూడా ఆయన మంత్రి పదవికి ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది.
తాజాగా నూతన రైల్వేశాఖ మంత్రిగా శివసేనకు చెందిన సురేష్ ప్రభుకు కట్టబెట్టనున్నట్లు సమాచారం. మొత్తం 10 నుంచి 11మందికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ నుంచి పలువురు కొత్త ముఖాలతో పాటు మిత్ర పక్షాలైన శివసేన, టీడీపీకి కూడా కేబినెట్‌లో చోటు దక్కనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గోవా సీఎం మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున పంజాబ్ నుంచి తొలిసారి నెగ్గిన విజయ్ సాంప్లా, సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తనయుడు జయంత్ సిన్హా, హర్యానా నుంచి జాట్ నేత బీరేందర్‌సింగ్, బీహార్ నుంచి గిరిరాజ్‌సింగ్ లేదా భోలా సింగ్, రాజ్‌స్థాన్ నుంచి కల్నల్ సోనారామ్ చౌదరీ, గజేంద్ర సింగ్ షెకావత్, మహారాష్ర్ట నుంచి హన్స్‌రాజ్ అహిర్‌తో పాటు సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ, శివసేన నుంచి సురేష్ ప్రభు, అనిల్ దేశాయ్కి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.
అలాగే టీడీపీ నుంచి సుజనా చౌదరికి, బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయకు చోటు దక్కింది. కాగా నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్లకు కేబినెట్ హోదా దక్కనున్నట్లు సమాచారం. కొత్తగా కేబినెట్‌లో చేరనున్న వారికి.. మోదీ ఇచ్చే టీ విందుకు రావాలని పీఎంఓ ఫోన్లు చేసింది.