సీనియర్లకే కీలక శాఖలు | Narendra modi allocates key branches to seniors in his cabinet | Sakshi
Sakshi News home page

సీనియర్లకే కీలక శాఖలు

Published Wed, May 28 2014 2:06 AM | Last Updated on Fri, Mar 29 2019 6:00 PM

సీనియర్లకే కీలక శాఖలు - Sakshi

సీనియర్లకే కీలక శాఖలు

*  శాఖల కేటాయింపులో మోడీ ముద్ర
రాజ్‌నాథ్‌కు హోం; సుష్మకు విదేశాంగం
* జైట్లీకి కీలకమైన ఆర్థిక, రక్షణ బాధ్యతలు
* వెంకయ్యకు పట్టణాభివృద్ధి; అశోక్‌కు పౌర విమానయానం
* ‘కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన’ లక్ష్యంగా శాఖల కూర్పు
* 17 శాఖలు ఏడుగా విలీనం

 
సాక్షి, న్యూఢిల్లీ: సస్పెన్స్‌కు, మీడియా ఊహాగానాలకు తెర దించుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన మంత్రివర్గానికి శాఖలను కేటాయించారు. అయితే, కీలక శాఖలు ఊహించినట్లే బీజేపీ సీనియర్ నేతలకు దక్కాయి. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు హోం, అరుణ్ జైట్లీకి ఆర్థిక శాఖతో పాటు అదనంగా రక్షణ శాఖ బాధ్యతలు, సుష్మా స్వరాజ్‌కు విదేశాంగ శాఖ అప్పగించారు. మౌలిక వసతుల రంగానికి చెందిన షిప్పింగ్, ఉపరితల రవాణా, రహదారుల శాఖలను విలీనం చేసి ఒకే శాఖగా నితిన్ గడ్కారీకి కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ నేత వెంకయ్యనాయుడుకు కూడా కీలక శాఖల బాధ్యత అప్పగించారు.
 
 పట్టణాభివృద్ది, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలనలను ఒక శాఖ కిందకు తెచ్చి దానికి వెంకయ్యనాయుడిని అధిపతిని చేశారు. దాంతో పాటు పార్లమెంటరీ వ్యవహారాలను కూడా ఆయనకే అప్పగించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడను రైల్వే మంత్రిని చేశారు. మరో సీనియర్ నేత, న్యాయవాది రవిశంకర్ ప్రసాద్‌కు న్యాయ, కమ్యూనికేషన్, ఐటీ శాఖలను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రాజుకు పౌర విమానయాన శాఖ అప్పగించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం మంత్రులకు శాఖలను కేటాయించారు.
 
మంత్రివర్గ కూర్పులోనే మోడీ ముద్ర
 మంత్రివర్గ కూర్పులోనే మోడీ తన ప్రత్యేక ముద్ర చూపించారు. పాలనా సంస్కరణలకు శాఖల పునర్వ్యవస్థీకరణతోనే శ్రీకారం చుట్టారు. ‘కనిష్ట ప్రభుత్వం - గరిష్ట పాలన’ సూత్రానికి అనుగుణంగా పలు శాఖలను, విభాగాలను విలీనం చేసి పాలనను సులభతరం చేశారు. మోడీ ఆదివారం చెప్పినట్లుగా.. అనుబంధ, సంబంధిత విభాగాలు, శాఖలను కలిపి ఒకే శాఖగా మార్చి, ఒకే కేబినెట్ మంత్రిని దానికి బాధ్యుడిని చేసే ప్రక్రియ ప్రారంభించారు. అందులో భాగంగానే కార్పొరేట్ వ్యవహారాల శాఖను ఆర్థిక శాఖలో విలీనం చేశారు. యూపీఏ-2లో ప్రారంభమైన విదేశాల్లోని భారతీయుల వ్యవహారాల శాఖను, విదేశాంగ శాఖలో కలిపేశారు.
 

పట్టణాభివృద్ది, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలనలను ఒక శాఖ కిందకు తెచ్చారు. విద్యుత్, బొగ్గుతో పాటు నూతన, పునరుత్పాదక ఇంధనం శాఖలను విలీనం చేసి స్వతంత్ర సహాయ మంత్రి హోదాలో పియూష్ గోయల్‌కు అప్పగించారు. మొత్తంమీద శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 17 శాఖలను వివిధ ఇతర శాఖల్లో విలీనం చేసి 7 మంత్రిత్వ శాఖలుగా కుదించారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగాలను మోడీ తనవద్దే అట్టిపెట్టుకున్నారు. జమ్మూ, కాశ్మీర్‌లోని ఉధంపూర్ నుంచి మొదటిసారి గెలిచిన బీజేపీ ఎంపీ జితేంద్ర సింగ్‌కు ప్రధాని కార్యాలయం(పీఎంఓ)లో సహాయమంత్రి హోదా కల్పించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై పరిపాలనాపరమైన అజమాయిషీ ఉండే సిబ్బంది విభాగాన్ని కూడా ఆయనకే అప్పగించారు. అవి కాకుండా శాస్త్ర, విజ్ఞాన శాఖ, భౌగోళిక శాస్త్రాల శాఖలకు స్వతంత్ర మంత్రిగా జితేంద్రసింగ్ వ్యవహరిస్తారు.
 
 శివసేన అసంతృప్తి
 కేంద్ర మంత్రివర్గంలో ఒకేఒక్క పదవి లభించడంపై బీజేపీ సీనియర్ మిత్రపక్షం శివసేన అసంతృప్తితో ఉంది. అంతేకాకుండా తమ పార్టీ సీనియర్ నేత అనంత్ గీతెకు భారీ పరిశ్రమల శాఖ కేటాయించడంపై కూడా ఆగ్రహంగా ఉంది. అందువల్లనే గీతె మంగళవారం మంత్రిగా బాధ్యతలు తీసుకోలేదని శివసేన వర్గాలు తెలిపాయి. ఎన్‌డీఏలో బీజేపీ తరువాత అతిపెద్ద పార్టీ అయిన శివసేనకు ఒకే మంత్రిపదవి కేటాయించడంపై పార్టీ అధ్యక్షుడు ఉధ్దవ్ ఠాక్రే బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని వెల్లడించాయి.
 
 రక్షణ శాఖకు త్వరలో కొత్త మంత్రి!
 మరోవైపు, రక్షణ శాఖ బాధ్యతల నుంచి అరుణ్ జైట్లీని త్వరలో తప్పించవచ్చని వార్తలు వస్తున్నాయి. బీజేపీకే చెందిన మరో సీనియర్ నేతకు ఆ శాఖను కేటాయించవచ్చని తెలుస్తోంది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో జైట్లీ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ విషయానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ‘మంత్రివర్గాన్ని పూర్తిగా విస్తరించి, ప్రత్యామ్నాయం ఏర్పడే వరకు రక్షణ శాఖ నాకు కేవలం అదనపు బాధ్యతనే. రక్షణ శాఖ చాలా కీలకమైనది. దానికి పూర్తిస్థాయి మంత్రి అవసరం. మరికొన్ని వారాల్లోనే ఆ శాఖకు పూర్తిస్థాయి మంత్రి వస్తారని ఆశిస్తున్నాను’ అని జైట్లీ వ్యాఖ్యానించారు.  
 
 కేంద్ర మంత్రులు.. శాఖలు..
 నరేంద్ర మోడీ: ప్రధానమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్షం, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

 కేబినెట్ మంత్రులు                    శాఖలు
 1.రాజ్‌నాథ్ సింగ్    హోం
 2.సుష్మా స్వరాజ్                       విదేశీ వ్యవహారాలు (ప్రవాస భారతీయుల వ్యవహారాలు)
 3.అరుణ్ జైట్లీ                       ఆర్థిక(కార్పొరేట్‌వ్యవహారాలు),రక్షణ శాఖ (అదనం)
 4.ఎం.వెంకయ్యనాయుడు       పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాలు
 5.నితిన్ గడ్కారీ                       రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్
 6.డి.వి.సదానంద గౌడ                రైల్వే
 7.ఉమాభారతి                        జల వనరులు, నదులఅభివృద్ధి, గంగానది ప్రక్షాళన
 8.డాక్టర్ నజ్మా హెప్తుల్లా        మైనారిటీ వ్యవహారాలు
 9.గోపీనాథ్ ముండే                గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పంచాయతీరాజ్, పారిశుద్ధ్యం
 10.రాంవిలాస్ పాశ్వాన్(ఎల్‌జేపీ)  వినియోగదారుల వ్యవహారాలు  ఆహార, ప్రజాపంపిణీ
 11.కల్‌రాజ్ మిశ్రా                        సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
 12.మేనకా గాంధీ                        మహిళా, శిశు అభివృద్ధి
 13.అనంత్ కుమార్                రసాయనాలు, ఎరువులు
 14.రవిశంకర్ ప్రసాద్                కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యాయ శాఖ
 15.అశోక్ గజపతి రాజు(టీడీపీ)   పౌర విమాన యానం
 16.అనంత్ గీతె                        భారీ పరిశ్రమలు,  (శివసేన)ప్రభుత్వ రంగ సంస్థలు
 17.హర్‌సిమ్రత్ కౌర్(ఎస్‌ఏడీ)         ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
 18.నరేంద్ర సింగ్ తోమర్                గనులు, ఉక్కు, కార్మిక, ఉపాధి
 19.జుయల్ ఓరం                     గిరిజన వ్యవహారాలు
 20.రాధా మోహన్ సింగ్            వ్యవసాయం
 21. తావర్ చంద్ గెహ్లాట్        సామాజిక న్యాయం, సాధికారత
 22. స్మృతి జుబిన్ ఇరానీ        మానవ వనరుల అభివృద్ధి
 23. డాక్టర్ హర్షవర్ధన్                ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
 
 కేంద్ర సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా)        శాఖలు
 1.జనరల్ వి.కె.సింగ్                     ఈశాన్య ప్రాంత అభివృద్ధి (స్వతంత్ర), విదేశీ వ్యవహారాలు
 2.ఇందర్‌జిత్‌సింగ్ రావు               ప్రణాళిక, గణాంక, పథకాల అమలు (స్వతంత్ర), రక్షణ
 3.సంతోష్‌కుమార్‌గంగావర్          జౌళి(స్వతంత్ర), పార్లమెంటరీ వ్యవహారాలు, జలవనరులు, గంగానది పునరుద్ధరణ
 4.శ్రీపాద్ యశో నాయక్              సాంస్కృతిక, పర్యాటకం
 5.ధర్మేంద్ర ప్రధాన్                        పెట్రోలియం, సహజ వాయువు
 6.శర్బానంద సోనోవాల్              స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, యువజనవ్యవహారాలు, క్రీడలు
 7.ప్రకాశ్ జవదేకర్                    సమాచార, ప్రసార, అటవీ, పర్యావరణ(స్వతంత్ర),పార్లమెంటరీ వ్యవహారాలు
 8.పీయుష్‌గోయల్                   విద్యుత్తు, బొగ్గు, నూతన, పునరుత్పాదక ఇంధనం
 9.జితేందర్ సింగ్                      సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సెన్సైస్(స్వతంత్ర), ప్రధాని కార్యాలయం,
                                               పర్సనల్, ప్రజావినతులు, పింఛన్లు, అణు శక్తి, అంతరిక్షం,
 10. నిర్మలా సీతారామన్         వాణిజ్యం,పరిశ్రమలు(స్వతంత్ర), ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు

 సహాయ మంత్రులు                           శాఖలు
 1.జి.ఎం. సిద్ధేశ్వర                            పౌర విమానయానం
 2.మనోజ్‌సిన్హా                                   రైల్వేలు
 3.నిహాల్‌చంద్                           రసాయనాలు, ఎరువులు
 4.ఉపేంద్ర కుష్వాహా                   గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం
 5.పి.రాధాకృష్ణన్                          భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
 6.కిరెన్ రిజిజు                                     హోం
 7.క్రిషన్ పాల్                          రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్
 8.డాక్టర్ సంజీవ్ బలియన్          వ్యవ సాయం, ఫుడ్ ప్రాసెసింగ్
 9.మన్‌సుఖ్‌భాయి                  గిరిజన వ్యవహారాలు
 10.రావుసాహెబ్                          వినియోగదారులవ్యవహారాలు,   దాదారావు దాన్వే ఆహార, ప్రజాపంపిణీ
 11.విష్ణు దేవ్ సాయి                 గనులు, ఉక్కు, కార్మిక, ఉపాధి
 12.సుదర్శన్ భగత్                 సామాజికన్యాయం, సాధికారత
*   క్రిమినల్ కేసులున్న మంత్రులు 13 మంది
*   సీరియస్ క్రిమినల్ కేసులున్న మంత్రులు 8 మంది
*   కోటీశ్వరులైన మంత్రులు 40 మంది
*   మంత్రుల ఆస్తులు సగటున రూ.13.47 కోట్లు

 ప్రధాని మోడీతో సహా 46 మంది మంత్రుల్లో 44 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డె మొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థలు ఈ వివరాలు తెలిపాయి. ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్ ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యులు కాకపోవడంతో వారిని పరిగణనలోకి తీసుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement